నీటిని పొదుపుగా వాడుకోండి
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:26 AM
రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని వీసీ హాలులో ముచ్చుమర్రి, మల్యాల పంప్ హౌస్ ద్వారా నీటి పంపిణీ అంశంపై పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, జయసూర్య, ఎస్పీ సునీల్‌షె రాన్, జేసీ కార్తీక్‌తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు
కలెక్టర్ రాజకుమారి
ముచ్చుమర్రి, మల్యాల నుంచి కేసీ కెనాల్‌కు నీటి విడుదల
నంద్యాల నూనెపల్లి/నందికొట్కూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లోని వీసీ హాలులో ముచ్చుమర్రి, మల్యాల పంప్ హౌస్ ద్వారా నీటి పంపిణీ అంశంపై పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, జయసూర్య, ఎస్పీ సునీల్‌షె రాన్, జేసీ కార్తీక్‌తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేసీ కెనాల్ పరిధిలో రబీ పంట వేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో మొదటి 20 రోజుల పాటు చివరి ఆయకట్టు వరకు నిరంతరాయంగా నీటిని విడుదల చేయనున్నందన్నారు. మొదటి ఫేజ్‌లో 20 రోజులు విడుదల చేయనున్నట్లు అనంతరం కొద్ది రోజుల తర్వాత మళ్లీ రెండవ ఫేజ్ కింద నీటిని విడుదల చేయనున్నట్లు వివరించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితా మాట్లాడుతూ రైతుల సాగునీటి కోసం పడుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన వెంటనే స్పందించి ఇరిగేషన్ మంత్రి, ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్‌కు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. దీంతో 0-150 కిలోమీటర్ల వరకు, గడివేముల మండలం చివరి ప్రాంతాల వరకు నీరందేలా చర్యలు తీసున్నారన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమనడానికి ఇదే నిదర్శనమన్నారు. నీరులేని పరిస్థితుల్లో కూడా రైతులను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు నీరందించడం ఆనందంగా ఉందన్నారు. రైతు లు ఆందోళన చెందవద్దని ప్రతి ఎకరాకు నీరందుతుందన్నారు.
వేర్వేరుగా నీటి విడుదల
నందికొట్కూరు రూరల్/ పాములపాడు/ పగిడ్యాల: మాండ్ర శివానందరెడ్డి, బైరెడ్డి వర్గం నాయకులు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద వేర్వేరుగా నీటిని విడుదల చేశారు. ఎంపీ బైరెడ్డి శబరి చొరవతో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేస్తున్నట్లు మండల టీడీపీ యువ నాయకుడు, టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు కురువ రమేశ్ తెలిపారు. సమయానికి రైతుల పక్షాన నిలిచి నీటిని విడుదల చేయించినందుకు రైతులు కృతజ్ఙతలు తెలిపారు.