ఆధునిక సాంకేతికతను అందుకోవాలి
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:46 PM
: నర్సింగ్ సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పిలుపునిచ్చారు
వైద్యరంగంలో నర్సుల పాత్ర ఎంతో కీలకం
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
ఘనంగా 79వ ‘ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర సదస్సు
కర్నూలు హాస్పిటల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్ సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. కర్నూలు నగర శివారులోని ఏఎం కాన్ఫరెన్స్ హాలులో 79వ ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సదస్సును మంత్రి టీజీ భరత్ గుప్తా, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డి.ఉషా పన్నాగవేణి, ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుశీల, డిప్యూటీ డైరెక్టర్ ఆప్ నర్సింగ్ పి.హిమగిరి, కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ ఆర్.పద్మావతి, సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీ శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాయలసీమలో మొట్టమొదటిసారిగా 2వేల మంది నర్సింగ్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి, నర్సింగ్ సేవల మెరుగుదలకు ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలంతా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమైనప్పటికీ వైద్యులతో కలిసి నర్సులు మాత్రం ప్రాణాలకు తెగించి సేవలందించారని కొనియాడారు. వైద్యరంగంలో నర్సుల పాత్ర వెలకట్టలేనిదని, నర్సులు చూపించే ఓర్పు, సహనం, ఆప్యాయత సేవాభావం ఎంతో గొప్పదని అన్నారు. అనంతరం విశేష సేవలందించిన ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రార్ కె.సుశీల, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి.ఉసా పన్నగవేణికి దివంగత ప్రొఫెసర్ సీహెచ్ శ్రీలక్ష్మి ఓరేషన్ అవార్డులను మంత్రి అందజేశారు.