ముగిసిన పురపోరు
ABN , Publish Date - Nov 02 , 2026 | 12:23 AM
జిల్లాలో పురపోరు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా టీడీపీ వశమైన విషయం తెలిసిందే.
జిల్లాలో 67.06 శాతం పోలింగ్ నమోదు
నంద్యాల, డోన్, బేతంచెర్లలో స్వల్ప ఘర్షణలు
నందికొట్కూరులో అత్యధికంగా 80.35 శాతం
డోన్‌లో వైసీపీ మాజీ మంత్రి బుగ్గన నిరసన
అభ్యర్థుల్లో అలజడి.. భవితవ్యంపై ఉత్కంఠ
మొదలైన బెట్టింగ్
అభ్యర్థుల్లో ఉత్కంఠ
నంద్యాల, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పురపోరు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీలు ఏకగ్రీవంగా టీడీపీ వశమైన విషయం తెలిసిందే. ఇక మిగిలిన నంద్యాల, నందికొట్కూరు, డోన్, బేతంచెర్ల, ఆత్మకూరు మున్సిపాలిటీలోని నాలుగు వార్డుల్లో పోలింగ్ ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి వరకు కొనసాగింది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సాగింది. తద్వారా జిల్లాలో పురపోరు పోలింగ్ శాతం 67.06 శాతం నమోదైంది. ఆయితే నంద్యాల, డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీల్లో అక్కడక్కడ టీడీపీ, వైసీపీ మధ్య చిన్న ఘర్షణలు జరిగాయి. ఆయితే డోన్‌లో మాత్రమే వైసీపీ మాజీ మంత్రి బుగ్గన అభ్యర్థులు, తమ అనుచరులతో కలిసి నిరసనకు దిగారు. ఇది తప్ప జిల్లాలో ఎక్కడా గొడవలు లేకుండా పురపోరు పోలింగ్ సాఫీగా జరిగింది.
ఆ మూడు మున్సిపాలిటీల్లో...
పురపోరు పోలింగ్‌లో భాగంగా జిల్లాలోని నంద్యాల, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, ఆత్మకూరు చైర్మన్ స్థానాలకు, 151 వార్డులకు పోలింగ్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగింది. మధ్యాహ్నం దాకా ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తలేదు. ఆయితే నంద్యాల, డోన్, బేతంచెర్లలో వైసీపీ అడ్డదారిలో నిరసనలకు దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ మధ్య స్వల్ప ఘటనలు జరిగాయి. దీంతో ఎక్కడిక్కడ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిని గృహ నిర్బంధం చేశారు. డోన్ మాజీ మంత్రి బుగ్గన సైతం వైసీపీ అభ్యర్థులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డోన్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి సుమారు రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎస్పీ శ్రీనివాసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. ఎక్కడా కూడా పోలింగ్ ఆగలేదు. పోలీసుల భద్రత నడుమ పోలింగ్ కొనసాగింది. నంద్యాలలో రెండు వార్డుల్లో టీడీపీ, వైసీపీ మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది.
అత్యధికంగా నందికొట్కూరులో..
జిల్లాలో పురపోరు పోలింగ్ పరిశీలిస్తే.. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 212 వార్డులతో పాటు ఆరు చైర్మన్ స్థానాలు ఉండగా.. ఆళ్లగడ్డ, ఆత్మకూరు చైర్మన్ల స్థానాలతో పాటు 60 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 151 వార్డులతో పాటు నాలుగు చైర్మన్ స్థానాలకు 403 పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం పోలింగ్ జరిగింది. మొత్తంగా 3,23,401 ఓటర్లలో 2,16,861 మంది తమ ఓటు హక్కును వినియోగించారు. తద్వారా జిల్లాలో 67.06 పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా.. మున్సిపాలిటీల వారిగా పరిశీలిస్తే.. నంద్యాల- 62.49 శాతం, నందికొట్కూరు- 80.35 శాతం, డోన్-67.84 శాతం, బేతంచెర్ల- 78.54 శాతం, ఆత్మకూరు- 73.23 శాతం పోలింగ్ శాతం నమోదైంది. ఇక ఆత్మకూరులో మరో వార్డుకు త్వరలో రీషెడ్యూల్ ద్వారా ఎన్నికల జరగనుంది. ఆయితే అత్యధికంగా నందికొట్కూరు- 80.35 శాతం. అత్యల్పంగా నంద్యాలలో నమోదైంది.
అభ్యర్థుల్లో అలజడి.. భవితవ్యంపై ఉత్కంఠ..
పురపోరులో కీలకమైన పోలింగ్ ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది ఈ క్రమంలో ఓటర్ల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉందో తెలియాల్సి ఉంది.
బెట్టింగ్ షురూ
పురపోరు పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఉత్కంఠ మొదలైంది. అభ్యర్థుల భవితవ్యం తేలాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ మధ్య బెట్టింగ్ షురూ అయ్యింది. చైర్మన్ పీఠం, వార్డుల గెలుపుపై బెట్టింగ్ మొదలైంది. నంద్యాల, డోన్, బేతంచెర్లలో ఎక్కువగా ఈ వ్యవహారం సాగుతోంది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
మున్సిపాలిటీ వార్డులు పోలింగ్ ఓటర్లు పోలైనఓట్లు శాతం
కేంద్రాలు
నంద్యాల 52 217 1,99,238 1,24,501 62.49
నందికొట్కూరు 32 53 36,332 29,193 80.35
డోన్ 35 72 52,176 35,397 67.84
బేతంచెర్ల 28 56 31,285 24,570 78.54
ఆత్మకూరు 04 05 4370 3200 73.23
మొత్తం 151 403 3,23,401 2,16,861 67.06
మున్సిపాలిటీల వారీగా ఏకగ్రీవాలు
మున్సిపాలిటీ చైర్మన్ వార్డులు
ఆళ్లగడ్డ 1 32
ఆత్మకూరు 1 27
డోన్ - 01