Share News

20 దాకా జీడీపీ నీరు విడుదల

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:27 PM

గాజులదిన్నె ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు పంటలకు ఈ నెల 20వ తేది వరకు నీరు అందించనున్నట్లు జీడీపీ అధికారులు శనివారం తెలిపారు.

20 దాకా  జీడీపీ నీరు విడుదల
జీడీపీ కుడికాలువ నుంచి విడుదల అయిన 130 క్యూసెక్కుల నీరు

రైతుల వినతితో స్పందించిన ఇరిగేషన్‌ అధికారులు

ఆనందం వ్యక్తం చేస్తున్న కుడి, ఎడమ కాలువల ఆయకట్టు రైతులు

గోనెగండ్ల, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు పంటలకు ఈ నెల 20వ తేది వరకు నీరు అందించనున్నట్లు జీడీపీ అధికారులు శనివారం తెలిపారు. ఈనెల 15 న కాలువలకు బంద్‌ చేయనున్నట్లు గతంలో తెలిపినప్పటికీ రైతుల వినతి మేరకు 20 వ తేది దాకా నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత మార్చి 31న జీడీపీ కింద ఉన్న ఆయకట్లు భూములకు కుడి, ఎడమ కాలువలకు విడుదల అయ్యే నీటిని నిలిపివేశారు. అయితే కుడి, ఎడమ కాలువ కింద ఉన్న సాగుచేసిన పంటలు రైతుల చేతికి రావాలంటే మరో 20 రోజుల పడుతుండటంతో పంట కోతకు నీటి అవసరం ఉన్నందున రైతులు సాగునీటి సమస్యను ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కారణంగా అధికారులు కుడి, ఎడమ కాలువకు మళ్లీ 20 రోజులు నీటి విడుదల చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కుడి కాలువకు నీటి విడుదల కావడంతో ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాలలోని ఆయకట్టు రైతులకు దాదాపు 3000 నుంచి 3500 ఎకరాలలో సాగు చేసిన పంటలకు లబ్ధిచేకూరుతుంది. అలాగే ఎడవ కాలువకు నీటి విడుదల ను కూడా 20 వ తేది వరకు పొడిగించారు. ఎడవ కాలువకు రోజుకు 40 క్యూసెక్కుల ప్రకారం నీరు విడుదల అవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆ కాలువ కింద 3000 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 1600 ఎకరాలు పంట సాగు అయింది. ప్రస్తుత రబీలో కుడికాలువ కింద 11500 ఎకరాల పంట సాగయింది. 8000 ఎకరాలలో పంట కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3000 నుంచి 3500 ఎకరాలకు నీటి అవసరం ఉన్నందున నీటి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Apr 11 , 2026 | 11:27 PM