పద్ధతి లేని పదోన్నతులు..!
ABN , Publish Date - May 18 , 2026 | 12:15 AM
జిల్లా పంచాయతీ కార్యాలయంలో పదోన్నతుల పర్వం తీవ్ర గందరగోళంగా మారింది.
నిబంధనలు ఖాతరు చేయని అధికారులు
జీవో 65కు పాతర
పంచాయతీ శాఖ గ్రేడ్-4లో 60 ఖాళీలు
అయోమయంగా 50 మంది డిజిటల్ అసిస్టెంట్ల భవిష్యత్తు
కర్నూలు కలెక్టరేట్, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ కార్యాలయంలో పదోన్నతుల పర్వం తీవ్ర గందరగోళంగా మారింది. ఈ శాఖ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఉద్యోగులకు మేలు చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం భారీగా పదోన్నతులకు శ్రీకారం చుట్టింది. కొత్తగా డివిజనల్ అభివృద్ధి అధికారులు (డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు) సచివాలయాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక డిప్యూటీ ఎంపీడీవో పోస్టులను సృష్టించి పదోన్నతులకు తెరలేపింది. ఎక్కడ ఎటువంటి ఖాళీలు ఉన్నా తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే.. క్షేత్ర స్థాయిలో కొంత మంది అధికారుల అస్తవ్యస్త విధానాలు, దిగువ స్థాయి సిబ్బంది ఎదుగుదలను జీర్ణించుకోలేని కొన్ని శక్తుల కుట్రల వల్ల పంచాయతీ సిబ్బంది నిలువునా మునుగుతున్నారు.
క్రమం తప్పిన ప్రమోషన్లు.. చేజారిన 200 పోస్టులు..
సాధారణంగా గ్రేడ్-1, గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శుల పదోన్నతులు కమిషనరేట్ స్థాయిలో, గ్రేడ్-3, 4, 5, 6 పదోన్నతులు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) కార్యాలయం స్థాయిలో కల్పి స్తారు. పై నుంచి కింద దాకా ఉన్న ఖాళీల సంఖ్య ను బట్టి సీనియారిటీ, రోస్టర్ జాబితాలను రూపొందించి పదోన్నతులు కల్పించాలి. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అఽధికారులు నిబంధ నలను తుంగలో తొక్కారు. గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 ఉద్యోగులకు ముందస్తు పదోన్నతి ఇవ్వకుండా.. నేరుగా గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులకు గత ఆగస్టులో ఏకంగా 122 మందికి ప్రమోషన్లు కట్టబెట్టారు. సరైన క్రమ పద్ధ్దతిలో ఈ పదోన్నతులు ఇచ్చి ఉంటే.. ఒకేసారి దాదాపు 200 మందికి ప్రమోషన్లు వచ్చేవని, అధికారుల అత్యుత్సాహం వల్ల ఆ అవకాశం చేజారిందని పలు ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర కమిషనర్‌కు పిర్యాదు చేశారు. త్వరలో పదోన్నతుల ఫైళ్లు కదులుతున్న నేపథ్యంలో కొందరు అక్రమ మార్గానకు పాల్పడుతున్నారు. ప్రమోషన్ ఫైల్ ముందుకు వెళ్లాలంటే మామూలు ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేయడం కొసమెరుపు.
జీవో. నెం. 65కు పాతర
గ్రామ సచివాలయాల్లో పని చేసే గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులను డిజిటల్ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. సాధారణ పంచాయతీ కార్యదర్శులతో పోలిస్తే వీరి జాబ్ చార్ట్ పూర్తిగా భిన్నమైనది. వీరికి పదోన్నతులు కల్పిస్తే గ్రామ సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత సేవలు నిలిచిపోతాయని, అందువల్ల వీరి పదోన్నతులను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశిం చారు. అయినప్పటికీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీరికి కూడా గ్రేడ్-5 కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇచ్చారు. ప్రభుత్వం జీవో నెంబర్.65 ప్రకారం పది ఖాళీలు ఏర్పడి తే.. అందులో ఐదు పోస్టులను మాత్రమే పదోన్నతుల ద్వారా, మిగిలినవి నోటిఫికేషన్ ద్వారా ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయాలి. ఈ లెక్కన జిల్లాలో కేవలం 72 మందికి మాత్రమే పదోన్నతి కల్పించాల్సి ఉంది. ఏకంగా కలెక్టర్‌ను సైతం తప్పుదారి పట్టించి వంద శాతం పోస్టులను ప్రమోషన్లతో భర్తీ చేస్తూ మరో 50 మందికి అడ్‌హక్ రూపంలో పదోన్నతి కల్పించారు. దీంతో ఈ 50 మంది భవిష్యత్తు ఇప్పుడు త్రిశంకుస్వర్గంలో పడింది. నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందంటే.. ఇటీవల అనంతపురం జిల్లాలో ఇలా పదోన్నతి పొందిన 8 మంది డిజిటల్ అసిస్టెంట్లు, ప్రమోషన్ మాకొద్దు బాబోయ్ అంటూ తిరిగి తమ పాత డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు రివర్షన్ కోరుకోవడం గమనార్హం.
త్వరలో పదోన్నతులు కల్పిస్తాం
జిల్లాలో పని చేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి ఇస్తాం. జిల్లాలో సుమారు 60 గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఉన్నాయి. పదోన్నతులకు అక్రమ వసూళ్లు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
- భాస్కర్, డీపీవో