Share News

ఉద్యోగుల్లో అలజడి

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:06 AM

ఉద్యోగుల్లో అలజడి

ఉద్యోగుల్లో అలజడి

తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు

సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ సహాయకులుగా విధులు

వైసీపీ నేతల సహకారంపై ఆరోపణలు

కూటమి అధికారంలోకి రాగానే లోకాయుక్తకు ఫిర్యాదు

ఉమ్మడి జిల్లాలో 76 మందికి నోటీసులు

కొనసాగుతున్న విచారణ

రాష్ట్రంలోని సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ సహాయకుల నియామకంలో అక్రమాలు జరిగాయి. వైసీపీ హయాంలో ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిలో 1200 మందిని రాష్ట్రవ్యాప్తంగా అనర్హులుగా నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలోనే ఏకంగా 550 మందిని పశుసంవర్థక శాఖ అసిస్టెంట్లుగా నియమించారు. ఆ శాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 76మంది ధ్రువపత్రాలు నిజమైనవా?.. లేక నకిలీవా? అని నిర్ధారించేందుకు ఆయా కళాశాలలు, యూనివర్సిటీలకు పంపారు. ప్రస్తుతం ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిలో ఆందోళన నెలకొంది. అసలు విషయం బయటపడితే తమ ఉద్యోగాలు ఉంటాయో.. లేదోనని మధన పడుతున్నారు.

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. ఫేక్‌ సర్టిఫికెట్లతో వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయాల్లో ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. కొంతమంది అర్హులైన వారు తమకు ఉద్యోగాలు రాలేదని, అనర్హులకు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు ఏప్రిల్‌ 10న అన్ని జిల్లాల జేడీలకు ఉత్తర్వులు జారీ చేశారు.

1200 మందిని అనర్హులుగా..

ఎవరైతే ఫేక్‌ సర్టిఫికెట్లతో సచివాలయాల్లో పనిచేస్తున్నారో వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుని అవి నిజమైనవా? లేదా ఫేకా అని దర్యాప్తు చేసి తమకు ఏప్రిల్‌ 25 లోపల సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించినట్లు పశుసంవర్థక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ పోస్టులను ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిలో 1200 మందిని అనర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు.

కళాశాలలకు.. యూనివర్సిటీలకు ధ్రువ పత్రాలు

ఉమ్మడి జిల్లాలోనే ఏకంగా 550మందిని పశుసంవర్థక శాఖ అసిస్టెంట్లుగా నియమించారు. ఆ శాఖ డైరెక్టర్‌ దామోదర్‌ నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 76మందికి ఏప్రిల్‌ నెల సర్టిఫికెట్లను వెంటనే తమకు అందజేయాలని నోటీసులు జారీచేశారు. వారి విద్యా ర్హతల సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకొని ఆఉద్యోగులు ఎక్కడెక్కడ చదివారు. ఇతర రాష్ట్రాల్లోని ఏ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారో తెలుసుకునేందుకు ఆయా కళాశాలలు, యూనివర్సిటీలకు ఆ ఉద్యోగుల దృవపత్రాలను పంపారు. దీనికి సంబందించి కర్నూలు పశుసంవర్దక శాఖలో పని చేస్తున్న మేనేజర్‌ జవహర్‌ వివరణ ఇచ్చారు. 76 మందికి నోటీసులు అందించి వారి సర్టిఫికెట్లను తీసుకున్నామని, వాటిని ఆయా కళాశాలలు, యూనివర్సిటీలకు పంపినట్లు స్పష్టం చేశారు.

నెలనెలా జీతాలు తీసుకుంటూనే..

పశుసంవర్థక శాఖలో వైసీపీ ప్రభుత్వం రెండు మండలాలకు కలిపి ఒక ఏరియా ఆ స్పత్రిని ఏర్పాటుచేసింది. ఈవ్యవహారంలోనే పెద్దఎత్తున స్కాం బయట పడింది. ఏరియా ఆస్పత్రుల్లో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఓ వైపు ఉద్యోగాలు చేస్తూ నెలనెలా జీతాలు తీసుకుంటూనే పక్క రాష్ట్రాల్లో రాష్ట్రంలోని కొన్నిజిల్లాలో ఉన్న పశు వైద్యకళా శాలలు, యూనివర్సిటీల్లో రెండేళ్ల యానిమల్‌ అసిస్టెంట్‌ డిప్లమా కోర్సు చదివినట్లు సర్టిఫికెట్లను సృష్టించుకున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలోని కళాశాలల్లో ఈ విధంగా తప్పుడు వివరాలతో విద్యార్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు సంపాదించారు.

సచివాలయాల పోస్టులకు..

సచివాలయాల పోస్టులకు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో అర్హత సంపాదించారు. అప్పట్లో అభ్యర్థుల కొరత కారణంగా రాత పరీక్షలో 1, 2 మార్కులు వచ్చినవారికి కూడా ఉద్యోగాలు దక్కాయి. కొందరు తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు అప్పట్లోనే పెద్ద ఎత్తున వినిపించాయి. వైసీపీ నేతల అండదండలతో సాగిన పశుసంవర్థక శాఖ సహాయకుల అక్రమ నియామకాలపై అప్పట్లో కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ఆదేశించింది.

ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు..

ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరి ధ్రువపత్రాన్ని వారు చదివిన కళాశాలకు పంపి అవి నిజమైనవా.. లేక ఫేక్‌ పత్రాలో నిర్ధారించుకోవాలని పశుసంవర్థక శాఖను ఆదేశించారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినవారు ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురవుతు న్నారు. ఇది రుజువైతే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

ధ్రువపత్రాలు కాలేజీలు, యూనివర్సిటీలకు పంపాం

పశుసంవర్థక శాఖకు సంబంధించి ప్రస్తుతం సచివాలయాల్లో అసిస్టెంట్‌ ఉద్యోగాలు పొందిన ఉమ్మడి జిల్లాలోని 76 మంది ఉద్యోగుల సర్టిఫికెట్లను సేకరించి అవి నిజమైనవా? లేదా ఫేక్‌ అని నిర్దారించేందుకు మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లోని కళాశాలలు, యూనివర్సిటీలకు ఏప్రిల్‌లోనే పంపాం. వాటికి సంబంధించి ఫలితాలు వచ్చిన వెంటనే డైరెక్టర్‌కు నివేదికను పంపుతాం.

- జవహర్‌, మేనేజర్‌, పశుసంవర్థక శాఖ, కర్నూలు

Updated Date - Jun 05 , 2026 | 12:06 AM