కూలి లేని ఉపాధి
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:34 PM
గ్రామాల్లో ఉపాధి కూలీల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.
రెండున్నర నెలల నుంచి ఆకలి కేకలు
కర్నూలు జిల్లాలో రూ.5కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.7 కోట్లు బకాయి
గ్రామాల్లో స్తంభించిన పనులు
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఉపాధి కూలీల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నవంబరు నెల తర్వాత ఈ నెల ఇప్పటి వరకు పనులు చేసిన సుమారు రెండున్నర నెలలు గడిచిపోయినా తమ చేతికి ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టేందుకు వ్యవసాయ కూలీలు, రైతులు మాకొద్దు ఈ పనులు దేవుడా.. అంటూ వలసబాట పడుతున్నారు. ప్రభుత్వం ఏదో ఒక రోజు వేతనం విడుదల చేస్తుందని నీటి యాజమాన్య సంస్థ అధికారులు నచ్చచెబుతున్నా వ్యవసాయ కూలీలు మాత్రం గ్రామాల్లో అధికారులు చేపట్టిన పనులకు రాలేమని మొఖం మీదనే చెబుతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలందరికీ పనులు కల్పించాలని నీటి యాజమాన్య సంస్థ అధికారులు కింది స్థాయి సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ప్రతి రోజు 50వేల మందికి పనులు కల్పించాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నారు. అయితే కేవలం 23,411 మంది మాత్రమే పనులకు వస్తున్నట్లు నీటి యాజమాన్య సంస్థ అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లాలో కేవలం 13వేల మంది మాత్రమే పనులకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పంటల సాగు పూర్తయింది. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు పనులు లేక పొట్ట చేతపట్టుకుని జీవనోపాధి, కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని వలసబాట పడుతున్నారు. రెండున్నర నెలల నుంచి చేసిన పనులకు కూలి డబ్బులు రాకుంటే ఎట్లా బతకాలని కూలీలు ప్రశ్నిస్తుంటే.. నీటి యాజమాన్య సంస్థ అధికారులు మాత్రం తమ చేతుల్లో ఏమీ లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలీ డబ్బులను రెండున్నర నెలలుగా విడుదల చేయకపోవడం వల్లే గ్రామాల్లో ఉపాధి పనులకు రైతులు గానీ, వ్యవసాయ కూలీలు గానీ ఆసక్తి చూపడం లేదని, దూర ప్రాంతాలకు వలస వెళ్లేందుకే చొరవ చూపిస్తున్నారనీ బదులు ఇస్తున్నారు.
రెండున్నర నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదు
కర్నూలు జిల్లాలో 5,56,672 మంది వ్యవసాయ, రైతు కుటుంబాలకు చెందిన కూలీలకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు జాబ్ కార్డులు అందజేశారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో 4,60,098 మంది కూలీలు ఉన్నట్లు అధికారులు గుర్తించి వారికి జాబ్‌కార్డులు అందించారు. ఉమ్మడి జిల్లాలో 10 లక్షల మంది వ్యవసాయ కూలీలు, రైతులకు ఉపాధి కార్డులు అందజేసినా ఏటా కనీసం 2లక్షల మందికి కూడా ఉపాధి కల్పించలేని దుస్థితి ఎదురవుతోంది. ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తయినా రెండు జిల్లాలో ఈ సంవత్సరం ప్రస్తుత ఫిబ్రవరి నెలలో కనీసం లక్ష మందికి కూడా ఉపాధి కల్పించలేని దుస్థితిని అధికారులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి కారణం రెండున్నర నెలలుగా చేసిన పనులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో వ్యవసాయ కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు. కర్నూలు జిల్లాలో రూ.5 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.7 కోట్లు కూలీలకు ఇవ్వాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు.
గ్రామాల్లో స్తభించిన పనులు.. ఉమ్మడి జిల్లాలో రూ.56 కోట్ల బిల్లులు పెండింగ్
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పనులకు, రైతుల పొలాల అభివృద్ధి, జీవనోపాధిని మెరుగు పరుచుకునేందుకు చేపట్టిన ఇతర పనులకు కర్నూలు జిల్లాలో రూ.43 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.13 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దాదాపు రెండున్నర నెలలైనా చేసిన పనులకు బిల్లులు అందకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కింద చేపట్టిన మట్టిరోడ్లు, సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ పనులను పర్యవేక్షిస్తున్న జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు కలెక్టర్ల ద్వారా పెండింగ్‌లో ఉన్న ఉపాధి వేతనాలు, చేపట్టిన పనులకు సంబందించి చెల్లించాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో వ్యవసాయ కూలీలకు సమాధానం చెప్పుకోలేక అధికారులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
వేలాదిగా వలసబాట
నంద్యాల జిల్లాలో సాగునీటి వనరులు కొంత వరకు మెరుగ్గా ఉండటం వల్ల ఆ జిల్లాలోని గ్రామాల్లో ఇప్పటి దాకా పంటల సాగు పూర్తి కాలేదు. అందువల్ల ఆయా గ్రామాల్లోని వ్యవసాయ కూలీలకు ఉపాధి కొంత మెరుగ్గానే ఉంది. ఇక్కడ జీవనోపాధి కోసం కుటుంబాలను తీసుకుని వలసబాట పట్టే పరిస్థితి కొంత మేరకు తక్కువగానే కనిపిస్తోందని ఆ జిల్లా డ్వామా అధికా రులు చెబుతున్నారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం వ్యవసాయ కూలీ లు, రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే నాటికే గ్రామాల్లో వ్యవసాయ పనులు దాదాపు డిసెంబరు నాటికే ముగిసి పోయాయి. గ్రామాల్లో పనులు లేక పశ్చిమ నియోజకవర్గాలైన మంత్రాల యం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, డోన్ తదితర నియోజకవర్గాల్లోని వ్యవసాయ కూలీలు, రైతులు గుంటూరు, బెంగుళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. కొన్ని చోట్ల దూర ప్రాంతాలకు వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
వ్యవసాయ కూలీలను ఆదుకుంటాం
నవంబరు నెల తర్వాత గ్రామాల్లో ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు చెల్లించలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే వ్యవసాయ కూలీలు, రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తాం. గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టాలనుకునే వారికి వెంటనే పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- మాధవీలత, డ్వామా పీడీ