నిరుపయోగంగా మినీ ట్యాంకులు
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:01 AM
పట్టణంలో నీటి సమస్యలను తగ్గించాలన్న లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పట్టణంలో విస్తృతంగా మిని నీటి ట్యాంకులను నిర్మించారు.
పనిచేయని మోటార్లు
తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఎమ్మిగనూరు, మార్చి 8(ఆంధ్రజ్యోతి): పట్టణంలో నీటి సమస్యలను తగ్గించాలన్న లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పట్టణంలో విస్తృతంగా మిని నీటి ట్యాంకులను నిర్మించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం మిని నీటి ట్యాంకుల గురించి పట్టించుకోక పోవటంతో నీటి ట్యాంకులు అనే చోట్ల నిరుపయోగంగా మారాయి. పట్టణంలో 132 వరకు మినీ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వెంకటాపురం కాలనీలో ఐదు ట్యాంకులు ఉండగా ఒకటి పనిచేయటం లేదు, మిలిటరీ కాలనీలో నాలుగు ఉండగా మూడు మరమ్మతులకు గురయ్యాయి. అలాగే పై మాలగేరి, హెచ్‌బీఎస్ కాలనీ వెళ్లే దారిలోను, ఎంఎస్‌నగర్‌లోని పాత యుపీహెచ్‌సీ, లక్ష్మీపేటలోని మాచాని సోమప్ప పాఠశాల, సంజీవయ్య నగర్, హనుమాన్ నగర్‌లో రెండు చోట్ల పనిచేయడం లేదు. అలాగే ముగతి పేట, ఎన్టీఆర్ కాలనీ, ఎరుకల వీధి, కలుగొట్ల రోడ్డు, జకాతిగేట్, ఖాదర్‌బేగ్ కాలనీ, బొడ్రాయి వీధితో పాటు ఎస్‌ఎంటీ కాలనీలోని నాగప్ప కట్టలైను, మాత్రల తిమ్మప్ప ఆలయం సమీపంలో ఉన్న మినీ వాటర్ ట్యాంకులు మరమ్మతులకు గురయ్యాయి. ఇవే కాక పట్టణంలో మరి కొన్ని చోట్ల నీటిట్యాంకులు పనిచేయకపోవటంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వేసవి ప్రాంరంభం కావటంతో నీటి వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ట్యాంకులు, బోర్లకు మరమ్మతులు చేసి వాటని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరమ్మతులకు గురైన మోటార్లు
పట్టణంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులకు అనుసంధానంగా బోర్లు, మోటార్లు ఉన్నాయి. ఇందులో కొన్ని చోట్ల మోటార్లు మరమ్మతులకు గురికాగా, మరి కొన్ని చోట్ల బోర్లు చెడిపోయాయి. మరి కొన్ని చోట్ల బోర్లలో నీటి ఊట తగ్గిపోయి ఎండిపోయాయి. మోటార్లకు, బోర్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయటంలో సంబంధిత సిబ్బంది విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఎండిన బోర్ల స్థానంలో ఆ ప్రాంతంలోనే కొత్త బోర్లు వేయాల్సిన అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోకపోవటంతో నీటి ట్యాంకులు కాస్త దిష్టిబొమ్మల్లా మారాయి.
మరమ్మతులు చేపట్టాలి
ట్యాంకు ఉన్నప్పుడు మా వీధిలో అందరూ నీటిని వాడుకునేందుకు ఉపయోగించుకునే వాళ్లం. రెండేళ్లనుంచి బంద్ అయ్యింది. దీంతో పక్క వీధికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం. కొళాయిలనుంచి నీరు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ట్యాంకుకు మరమ్మతులు చేయాలి. - సరోజ, ముగతి పేట, ఎమ్మిగనూరు
పట్టించుకోవడం లేదు
ట్యాంకు ఏర్పాటు చేసినప్పటి నుంచి నాలుగైదు ఏళ్లు పనిచేసింది. నీటిని వీధి వారంతా వాడుకునేవారు. అలాగే పశువులకు ఉపయోగంగా ఉండేది. ట్యాంకు బంద్ అయి ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకుకోవడం లేదు. - పరశురాం, పై మాలగేరి
కొత్త బోర్లు వేస్తున్నాం
ప్రస్తుతం ఉన్న సిస్టమ్స్‌లో కొన్ని చోట్ల నీరు ఇంకిపోయి బోర్లు ఎండిపోయాయి. దీంతో నీటి సమస్య లేకుండా కొత్త బోర్లు వేస్తున్నాం. ఇప్పటికే వెంకటాపురం, శివన్ననగర్, లక్ష్మిపేటలో బోర్లు వేశాము. మరి కొన్ని చోట్ల వేసేందుకు రూ. 10లక్షలతో ప్రతిపాధనలు సిద్ధం చేశాం. - కరుణాకర్, ఇన్‌చార్జి ఏఈ, మున్సిపాలిటీ, ఎమ్మిగనూరు