తిప్పలెన్నో
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:17 AM
కొండలు ప్రకృతి సంపద. గత చరిత్రకు ఆనవాలు. వీటిపై చెట్టూచేమ పెరిగి మూగజీవాలకు ఆహారం లభిస్తుంది. అయితే స్వార్ధపరులు ఎర్రమట్టి కోసం యంత్రాలతో కొండల డొక్కలు చీల్చుతున్నారు. అధికారుల అలసత్వం కారణంగా స్వార్ధపరులు పండుగ చేసుకుంటున్నారు.
విచ్చలవిడిగా ఎర్రమట్టి తవ్వకాలు
వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో తవ్వకాలు
అయినా ఒక్కరూ ముందుకురాని లబ్ధిదారులు
కూటమి ప్రభుత్వంలో తగ్గేదేలే
ఆనవాలు కోల్పోతున్న ప్రకృతి సంపద
కోడుమూరు రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కొండలు ప్రకృతి సంపద. గత చరిత్రకు ఆనవాలు. వీటిపై చెట్టూచేమ పెరిగి మూగజీవాలకు ఆహారం లభిస్తుంది. అయితే స్వార్ధపరులు ఎర్రమట్టి కోసం యంత్రాలతో కొండల డొక్కలు చీల్చుతున్నారు. అధికారుల అలసత్వం కారణంగా స్వార్ధపరులు పండుగ చేసుకుంటున్నారు. ఎర్రమట్టి తరలిపోవడంతో కొండ ప్రదేశాలపై కన్నేస్తున్న కొందరు పంటలు సాగు చేసుకుంటున్నారు. గత వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో తవ్వకాలు జరగ్గా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అక్రమార్కుల భోజ్యంగా మారింది.
ఎర్రమట్టి సంపదతో బైనదొడ్డి, వెంకటగిరి ‘తిప్ప’లు
మండలంలోని బైనదొడ్డి గ్రామ సమీపంలో స.నెం 798లో 34.45 ఎకరాలు, 182లో 68.34 ఎకరాల విస్తీర్ణంలో రెండు తిప్పలు ఉన్నాయి. అలాగే వెంకటగిరి గ్రామానికి సమీపాన స.నెం 562లో ఓ తిప్ప ఉంది. ఆయా కొండలు గ్రామస్థుల సెంటిమెంట్‌గా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో అధికారులు దగ్గరుండి మట్టి తవ్వించి చదును కార్యక్రమం చేపట్టారు. మట్టి తవ్వకాలను వెంకటగిరి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన ఘటనలు ఉన్నాయి. ఎర్రమట్టి తవ్వకాలతో పాటు గ్రామానికి సంబంధం లేని వారికి ఇంటి పట్టాలు ఎలా ఇస్తారని అప్పట్లో ప్రశ్నించారు.
ఇతర గ్రామాల లబ్ధిదారులకు తిప్పలు
వెంకటగిరి తిప్పపై దాదాపు 25 ఎకరాల స్థలాన్ని చదును చేసి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఏ నుంచి ఎఫ్ బ్లాక్‌లను ఏర్పాటు చేసి కోడుమూరు, వర్కూరు, వెంకటగిరి గ్రామాలకు చెందిన సుమారు 1018 మందికి స్థలాలు పంపిణీ జరిగినట్లు అధికారుల లెక్కలు ఉన్నాయి. అలాగే బైనదొడ్డి తిప్ప దగ్గర కల్లపరి, పులకుర్తి లబిఽ్ధదారులకు 162 మందికి ఇచ్చారు. ప్రభుత్వం లేఅవుట్ అభివృద్ధి కోసం రూ. లక్షలు ఖర్చు చేసింది. ఇదే సమయంలో ఇళ్ల స్థలాలు వైసీపీ నాయకులకు కాసులు కురిపించాయనే గుసగుసలు వినిపించాయి. అయితే ఎంతో అట్టహాసంగా సాగిన పట్టాల పంపిణీ అంతే వేగంగా నీరుగారింది. లబ్దిదారులెవరూ ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో నాటించిన నంబర్ రాళ్లు చెదిరిపోయాయి. దీనికి కారణం వెంకటగిరి లేఅవుట్ కోడుమూరుకు 6 కి.మీ, వర్కూరుకు 9కి.మీ దూరం ఉండడమే. అలాగే కల్లపరి, పులకుర్తి లబ్ధిదారులకు లేఅవుట్ సుమారు నాలుగైదు కి.మీ దూరం ఉంది. దీంతో లబ్ధిదారులు వెనుకంజ వేశారు.
యథేచ్ఛగా బైనదొడ్డి తిప్పపై తవ్వకాలు..
కూటమి ప్రభుత్వ హయాంలో బైనదొడ్డి తిప్పను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్సకవేటర్‌తో తవ్వి భారీ టిప్పర్లలో ఎర్రమట్టి తరలిస్తున్నారు. పరిసర ప్రాంతాలతో పాటు దూర ప్రాంతాలకు రాత్రి సమయంలో ఎర్రమట్టి తరలిస్తూ కొండను పిండి చేస్తున్నారు. ఎర్రమట్టి తవ్వకాల వలన ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మైనింగ్, రెవిన్యూ అధికారులు దృష్టిసారించి ప్రకృతి సంపదను కాపాడాల్సిన అవసరం ఉంది.