Share News

విజయానికి రెండేళ్లు!

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:14 AM

2024 జూన్‌ 12.. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. వైసీపీ విధ్వంస పాలనకు ప్రజలు స్వస్తి చెప్పి కూటమికి పట్టం కట్టిన రోజు.

విజయానికి రెండేళ్లు!

జిల్లాలో పారిశ్రామిక పరుగులు

సీసీ రోడ్లు, డ్రైనేజీలతో గ్రామాల్లో మార్పు

సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ విఫలం

పశ్చిమ ప్రాంతంలో తీరని తాగునీటి సమస్యలు

ప్రతిపాదనల దశలోనే ‘యువగళం’ హామీలు

హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై ఎదురు చూపులు

రెండేళ్లలో ప్రభుత్వ తీరు అలా..ఇలా..!

2024 జూన్‌ 12.. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. వైసీపీ విధ్వంస పాలనకు ప్రజలు స్వస్తి చెప్పి కూటమికి పట్టం కట్టిన రోజు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు.. అభివృద్ధిపై భారీ అంచనాలతో ‘ప్రజా ప్రభుత్వ పాలన’కు తొలి అడుగు పడి నేటితో రెండేళ్లు. ఎన్టీఆర్‌ భరోసా, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ, దీపం-2.. వంటి సంక్షేమ పథకాలు అమలులో భేష్‌ అనిపించినా.. ఆశించిన అభివృద్ధి పరుగులు పెట్టలేదని సామాన్యుల్లో నిరాసక్తత వెంటాడుతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం పల్లెసీమలను నిత్యం వెంటాడుతున్న కరువు.. వలసల నివారణకు చర్యలు చేపట్టలేదు. వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. గుండ్రేవులు ప్రాజెక్టు ఊసే లేదు. పల్లె దాహం తీర్చేందుకు రూ.2,428 కోట్లతో పంపిన ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఆదోని, కర్నూలు వైద్య కళాశాల అసంపూర్తి భవనాలు ఏలికల నిర్లక్ష్యానికి గుర్తుగా మిగిలాయి. ఆరు నెలల్లో హైకోర్టు బెంచ్‌.. అన్నారు. రెండేళ్లైనా కార్యరూపం దాల్చలేదు. ఇలా ఎన్నో. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ప్రజాగళం సభల్లో సీఎం చంద్రబాబు.. యువగళం సారథిగా పాదయాత్ర సభల్లో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇచ్చిన పలు హామీలు అమలుకు నోచుకోలేదు. సంక్షేమం, అభివృద్ధి పథంలో రెండేళ్ల కూటమి పాలన జిల్లాలో సాధించిన విజయాలపై ‘ఆంధ్రజ్యోతి’

విశ్లేషణాత్మక కథనం.

కర్నూలు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను సూపర్‌ సక్సెస్‌గా అమలు చేస్తోంది. జిల్లాలో లక్షలాది మంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. జిల్లాలో 2,242 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల్లో చదివే 4,73,823 మంది విద్యార్థులు ఉంటే, వారిలో 3,67,614 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి రూ.13 వేలు చొప్పున రూ.477.89 కోట్లు తల్లులు ఖాతాలో జమ చేస్తున్నారు. పాఠశాలల మౌలిక వసతులకు రూ.73.52 కోట్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్‌ భరోసా కింద రూ.3 వేలు పింఛన్‌ రూ.4 వేలకు పెంచారు. దివ్యాంగుల పింఛన్‌ రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్‌ రూ.10-15 వేలకు పెంచారు. జిల్లాలో 2,45,229 మంది పింఛన్‌దారులకు ప్రతి నెల ఒకటో తేదీన రూ.115-120 కోట్టు ఇంటికి చేరుతుంది. 6.40 లక్షల మంది గ్యాస్‌ వినియోగదారులు ఉంటే.. దీపం-2 కింద 4.75 లక్షల మందికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఒక్క కుటుంబానికి ఏడాదికి రూ.3 వేలు చొప్పున ఏడాదికి రూ.142 కోట్లు గ్యాస్‌ రూపంలో ఆదా అవుతుంది. అన్నదాత సుభీభవ పథకం కింద 2.72 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున మూడు విడుతల్లో రూ.512 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గతేడాది ఆగస్టు 15న స్ర్తీశక్తి పథకం కింద ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ అమలు చేశారు. జిల్లాలో రోజుకు 45-50 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పొందుతున్నారు. మహిళల ప్రయాణికుల సంఖ్య గతంలో 30 శాతంలోపే ఉంటే ప్రస్తుతం 51 శాతానికి చేరింది. మెగా డీఎస్సీ-2024 ద్వారా జిల్లాలో 2,600 యువతకు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు.

పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట

జిల్లాలో నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి ఫేజ్‌-1 కింద 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులకు శ్రీకారం చుట్టారు. రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యం. జపాన్‌కు చెందిన ఇటోయో మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్‌, ఇండియాకు చెందిన హైడ్రెన్‌ గ్రూప్‌, బీఎన్‌ గ్రూపులు సంయుక్తంగా దాదాపు రూ.14 వేల కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ 130 ఎకరాల్లో స్థాపించేందుకు ఒప్పందం చేసుకున్నారు. 1200 ఎకరాల్లో రూ.13 వేల కోట్లతో ‘ఈవీ పార్క్‌’కు ఒప్పందం, 300 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో డ్రోన్‌ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. తాజాగా రిలయన్స్‌ సంస్థ రూ.1,266 కోట్లతో జ్యూష్‌ తయారి పరిశ్రమ స్థాపనకు శ్రీకారం చుట్టారు. పత్తికొండలో టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం దాదాపుగా పూర్తికావస్తుంది. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్క్‌ వంద ఎకరాల్లో రూ.54 కోట్లలో మౌళిక వసుతుల కల్పన పనులు జరుగుతున్నాయి.

పల్లెకు పండుగ తెచ్చారు

గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లపై అంతులేని నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ‘పల్లె’కు ‘పండుగ’ తెచ్చారు. పల్లె పండుగ పథకం కింద ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేశారు. రూ.77.81 కోట్లతో 118.05 కి.మీలు సీసీ రోడ్లు వేశారు. పీఎంజీఎ్‌సవై కింద రూ.21.78 కోట్లు, నాబార్డు కింద రూ.78 కోట్లతో 25 గ్రామాలకు రహదారులు, ఏపీ గ్రామీణ రహదారి కనెక్టివిటీ కింద 250 జనాభా కంటే ఎక్కువ ఉన్న 65 గ్రామాలకు రూ.132.38 కోట్లతో 160 కి.మీలు బీటీ, సీపీ రోడ్లు నిర్మించారు. ఏపీఆర్‌ఆర్‌ఎ్‌సపీ కింద 26 గ్రామాలకు 110 కి.మీల రోడ్లు నిర్మాణాలకు రూ.60 కోట్లు మంజూరయ్యాయి.

మెడికల్‌ కళాశాలలపై నిర్లక్ష్యం

కర్నూలు, ఆదోని మెడికల్‌ కళాశాల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుంది. ఆదోని మండలం ఆరేకల్లు గ్రామం దగ్గర 59.50 ఎకరాల విస్తీర్ణంలో 420 బెడ్స్‌ బోధనాస్పత్రి నిర్మాణానికి రూ.475 కోట్లు మంజూరు చేస్తే, రూ.370 కోట్లతో 13.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ భవనాలు చేపట్టారు. గత వైసీపీ హయాంలో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రెండేళ్లుగా ఆపేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంతో నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు. రూ.475 కోట్లతో చేపట్టిన కర్నూలు మెడికల్‌ కళాశాల పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి.

జిల్లా పశ్చిమ ప్రాంతంలో కరువు, వలసలు నివారణే లక్ష్యంగా వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులకు గత టీడీపీ హయాంలో బీజం వేశారు. 2019 ఫిబ్రవరిలో నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆలూరు, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాకలు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలని వేదవతి ప్రాజెక్టుకు రూ.1,942.80 కోట్లు మంజూరు చేశారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని రూ.1,985.42 కోట్లు, కేసీ కాలువ కింద కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ కాలువ ద్వారా 2.65,628 ఎకరాలకు సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమే లక్ష్యంగా గుండ్రేవుల జలాశయం నిర్మాణం కోసం రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేశారు. అదే ఏడాది మార్చిలో శంకుస్థాపనలు, కృతజ్ఞత శిలాఫలకాలు వేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అటకెక్కించారు. 2024 ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులు చేపడుతామని ప్రజాగళం, యువగళం పాదయాత్ర సభల్లో అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. రెండేళ్లయినా ఆ దిశగా చర్యలు శూన్యం.

ఎమ్మెల్యేలూ..వీటిపై దృష్టి ఉంచరూ..!

కూటమి ప్రభుత్వ ఏర్పడి ఆరు నెలల్లో కర్నూలులో ‘హైకోర్టు బెంచ్‌’ ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ దిశగా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నా రెండేళ్లైనా కార్యరూపం దాల్చలేదని ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రాష్ట్ర న్యాయ శాఖ నుంచి ఈ ఫైల్‌ కేంద్రానికి వెళ్లింది. త్వరలో కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలి.

ఆలూరు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా చేపట్టిన వేదావతి ప్రాజెక్టును ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. పనులు మొదలు పెట్టాల్సి ఉంది.

కోడుమూరు పట్టణానికి తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 12 కిలోమీటర్లు పైపులైన్‌, ఫిల్టర్స్‌బెడ్స్‌ నిర్మాణానికి రూ.38.65 కోట్లు మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియలో ఉంది. త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.

ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం చేస్తామని ఎన్నికల ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. అందుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించారు. భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది.

గోనేగండ్ల మండలంలో మల్టీ విలేజెస్‌ స్కీం కింద 14 గ్రామాలకు తాగునీరు అందించాలని రూ.19.50 కోట్లతో పనులు చేపట్టారు. నిధులు కొరత కారణంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయి.

జిల్లాలో గోరుకల్లు, పులికనుమ, గాజులదిన్నె, పందికోన జలాశయాల నుంచి 2.140 టీఎంసీలు వినియోగించుకొని 721 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంగా రూ.2,428.31 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) పంపారు. నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలి.

కర్నూలు నగరంలో రెండేళ్లలో దాదాపు రూ.120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేసినా.. కర్నూలు నగరం స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామనే హామీ అమలుకు నోచుకోవడం లేదు. స్మార్ట్‌సిటీపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

జిల్లాలో ఏకైక పెద్ద జలాశయం గాజులదిన్నె. 5.50 టీఎంసీలకు సామర్థ్యం పెంచేందుకు గత ప్రభుత్వంలో రూ.54 కోట్లతో పనులు చేపట్టారు. నిధులు మంజూరు చేసి అసంపూర్తి పనులను పూర్తి చేయాలి.

మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాల్లో దోపిడి దొంగలు పది దోచుకెళ్లారు. రూ.11 కోట్లతో మరమ్మతులు చేపట్టాలి.

పత్తికొండ పట్టణంలో ట్రాఫిక్‌ నియంత్రణకు తక్షణమే రోడ్ల విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. అదే క్రమంలో హంద్రీనీవా ప్రాజెక్టు పత్తికొండ జలాశయం, కుడి, ఎడమ కాలువల అసంపూర్తి పనులకు రూ.210 కోట్లు మంజూరు చేయించి పనులు చేయించాలి. తద్వారా అదనంగా 45 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

ఆలూరు నియోజకవర్గంలో నగరడోణ జలాశయం, 55 ఏళ్ల క్రితం నిర్మించిన చింతకుంట, ఖాజీపురం, బాపురం, ఆలూరు సమగ్ర రక్షిత మంచినీటి ఫథకాలను పునఃనిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించాలి. తద్వారా తాగునీటి సమస్యకు తీర్చాలి.

ఆదోనిలో యువగళం పాదయాత్ర 1,000 కి.మీలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని పట్టణం 21వ వార్డు రాయనగర్‌ను ప్రగతి పథంలో నడిపించేందకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదోడ్లు నిర్మాణం, తాగునీరు సహా వివిధ మౌలిక వసతుల కల్పనకు యవనేత నారా లోకేశ్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. శిలాఫలకం వేశారు. కానీ పనులు మాత్రం చేపట్టలేదు.

Updated Date - Jun 12 , 2026 | 12:14 AM