ఒక కుటుంబంలో రెండు ఇంటి పేర్లు
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:03 AM
మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో ఒకే కుటుంబ సభ్యులకు రెండు ఇంటి పేర్లు (సర్ నేమ్‌లు) నమోదు కావటం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు బనగానపల్లె ఇన్‌చార్జి ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి కలసి చెర్లోపల్లెకు వెళ్లి కుటుంబ ధ్రువీకరణ పత్రంపై మంగళవారం విచారణ జరిపారు.
కుటుంబ ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపిన ఆర్డీవో
అవుకు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో ఒకే కుటుంబ సభ్యులకు రెండు ఇంటి పేర్లు (సర్ నేమ్‌లు) నమోదు కావటం వివాదాస్పదంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు బనగానపల్లె ఇన్‌చార్జి ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి కలసి చెర్లోపల్లెకు వెళ్లి కుటుంబ ధ్రువీకరణ పత్రంపై మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి... చెర్లోపల్లె గ్రామంలోని ఉప్పరి కులానికి చెందిన సుబ్బమ్మ 2013లో చనిపోయింది. ఈమె ఇంటి పేరు ధనుం అయినప్పటికీ అప్పట్లో కులం పేరుతో ఉప్పరి సుబ్బమ్మగానే రికార్డుల్లో నమోదు చేశారు. ఈమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు సంతానం. రెవెన్యూ అధికారులు 2015లో కుటుంబ సభ్యులకు జారీ చేసిన కుటుంబ సభ్యుల సర్టిఫికెట్‌లో ఇంటి పేరు (సర్ నేమ్) ధనుంగా మంజూరు చేశారు. . రిజర్వాయర్ నిర్మాణం కోసం చేసిన భూ సేకరణలో సుబ్బమ్మ పేరుతో ఉన్న భూములను కూడా అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ భూములకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇంకా ఇవ్వకపోవడంతో కుటుంబసభ్యులు కోర్టుకు ఎక్కారు. తల్లి ఇంటి పేరు ఒక విధంగా, కుటుంబసభ్యుల ఇంటిపేరు వేరే విధంగా ఉండటంతో కోర్టు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, ఇంటిపేరు ధనుంగానే నిర్ధారించి కోర్టుకు నివేదిక ఇవ్వనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ వెంగళరెడ్డి, వీఆర్‌వో సుబ్బరాయుడు పాల్గొన్నారు.