డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలి
ABN , Publish Date - May 20 , 2026 | 12:04 AM
బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయి. అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఒకరు మృతి చెందగా పనులు ముగించుకొని వెళ్తూ మరొకరు మృత్యు ఒడికి చేరుకున్నాడు.
స్కూటర్‌ను ఢీకొట్టిన బొలెరో
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఒకరు..
పని ముగించుకొని వెళ్తూ మరొకరి దుర్మరణం
ఏడుగురికి తీవ్ర గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం
ఆదోని రూరల్, మే 19 (ఆంధ్రజ్యోతి): బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరి ప్రాణాలు బలి అయ్యాయి. అంత్యక్రియలకు వెళ్లొస్తూ ఒకరు మృతి చెందగా పనులు ముగించుకొని వెళ్తూ మరొకరు మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి ఆదోని మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. శిరుగుప్ప తాలూకా రారావికి చెందిన అంజినయ్య మృతిచెందాడు. అతడి అంత్యక్రియల కోసం ఎమ్మిగనూరుకు చెందిన రంగమ్మ(60), నాగరాజు, రోజా, పత్తికొండ మండలం రాజులమండగిరి గ్రామానికి చెందిన రంగమ్మ, ఉరుకుందమ్మ, నాగరాజు, ఆస్పరి మండలం ముత్తుకూరుకి చెందిన హంపయ్య, లక్ష్మి వేర్వేరుగా వెళ్లారు. అంత్యక్రియలు ముగించుకొని రారావి నుంచి ఆదోని వైపు వస్తున్న బొలెరో వాహనంలో వారు బయలుదేరారు. హొళగుంద మండలం వందవాగిలికి చెందిన బేల్దారి పనిచేసే వడ్డే మర్రిస్వామి(48) పని నిమిత్తం ఆదోనికి వచ్చాడు. పని ముగించుకొని బైక్‌పై ఆదోని నుంచి సొంత గ్రామానికి బయలుదేరాడు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న బొలెరో డ్రైవర్ సతీ్‌షకుమార్ అతి వేగంగా వాహనాన్ని నడుపుతూ వచ్చాడు. ఆదోని మండలం మదిరే సమీపంలోని ఎన్‌డీబీఎల్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బైక్‌పై వస్తున్న మర్రిస్వామిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందగా, బొలెరో బోల్తా పడింది. దీంతో ఎమ్మిగనూరుకు చెందిన రంగమ్మ సైతం అక్కడికక్కడే మృత్యుఒడికి చేరుకుంది. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎమ్మిగనూరుకు చెందిన నాగరాజు, ముత్తుకూరుకు చెందిన హంపయ్య, రాజులమండిగిరికి చెందిన నాగరాజుల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వీరిని కర్నూలుకు తరలించారు.
మిన్నంటిన రోదనలు
ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఏడుగురికి తీవ్ర గాయాలై ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తె లుసుకున్న వారి బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీ రయ్యారు.
మద్యం మత్తులో డ్రైవర్
ఇద్దరు మృతికి ప్రధాన కారకుడైన బొలెరో వాహన డ్రైవర్ ఆదోని పట్టణంలోని కల్లుబావికి చెందిన సతీ్‌షకుమార్‌ను ఇస్వీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం జరగడానికి డ్రైవర్ మద్యం సేవించడంతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ ఎస్‌ఐ మహే్‌షకుమార్ తెలిపారు.