Share News

వినాయక నిమజ్జనానికి రెండు ఘాట్లు

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:25 PM

కర్నూలులో గణేశ్‌ నిమజ్ఞనోత్సవాన్ని నిర్వ హించేందుకు రెండు ఘాట్లు ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు.

వినాయక నిమజ్జనానికి రెండు ఘాట్లు
ఘాట్లను పరిశీలిస్తున్న మంత్రి

కేసీ కెనాల్‌, హంద్రీ నీవాలో ఏర్పాట్లు

ఘాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌/ న్యూసిటీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో గణేశ్‌ నిమజ్ఞనోత్సవాన్ని నిర్వ హించేందుకు రెండు ఘాట్లు ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. శుక్రవారం కేసీ కెనాల్‌ లోని వినాయక ఘాట్‌తో పాటు నన్నూరు టోల్‌గేట్‌ వద్ద హం ద్రీనీవా ప్రాంతాలను వేర్వేరుగా మంత్రి భరత్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పరిశీలించారు. వారు మా ట్లాడుతూ వినాయక ఘాట్‌ వద్ద కేసీ కెనాల్‌కు రెండు వైపులా గోడలు నిర్మించి ట్యాంక్‌ తరహాలో నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. పంప్‌హౌస్‌ నుంచి ప్రతిరోజూ వెలువడే సూమారు 20లక్షల లీటర్ల వాష్‌ వాటర్‌ను వినాయక ఘాట్‌ వద్ద నిల్వ చేసి, భక్తులు సంప్రదాయబద్ధంగా గణేష్‌ నిమజ్ఞనం చేసు కునేలా ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. పెద్ద విగ్రహాలను నిమజ్ఞనం చేసేందుకు నన్నూరు టోల్‌ప్లాజా గేట్‌ వద్ద హం ద్రీనీవాలో నీటిప్రవాహం అనుకూలంగా ఉందన్నారు. భక్తులు తమకు అనుకులమైన ప్రాంతాల్లో వినాయక నిమజ్ఞనం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జే.రమణమూర్తి, ఎంఈ మనోహర్‌రెడ్డి, డీఈ నరేష్‌, శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక విధుల కేటాయింపు

ఈ నెల 22న జరిగే గణేశ్‌ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేసే విధంగా ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయిస్తూ నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం నాలుగు చోట్ల విధులను కేటాయిం చారు. వినాయక ఘాట్‌ సత్యనారాయణ ఆలయం వద్ద డీఈ ఎం.పవన్‌కు మార్‌రెడ్డి, ఏఈ వైష్ణవితో పాటు అమ్యూనిటీ సెక్రటరీ సి.శశి కిరణ్‌ను నియమించామ న్నారు. నన్నూరు టోల్‌గేట్‌ హంద్రీ నది వద్ద ఈఈ గిరిరాజు, డీఈ సి.నరేష్‌తో పాటు అమ్యూనిటీ సెక్రటరీ హరికిరణ్‌, ఉలిందకొండ హంద్రీ నది వద్ద ఏఈలు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, జనార్ధన్‌తో పాటు అమ్యూనిటి సెక్రటరీ బి.సాయికుమార్‌ విధులు నిర్వహిస్తారన్నారు. తడకనపల్లి హంద్రీ నది వద్ద ఈఈ మనోహర్‌రెడ్డి, టీఏఈ రామ్మోహన్‌తో పాటు అమ్యూనిటి సెక్రటరీ ఖాజామోహీద్దీన్‌కు విధులు కేటాయించారు. వీరం దరూ నిమజ్జనానికి సంబంధించి క్రేన్లు, లైటింగ్‌, నీటి సరఫరా, పారిశుధ్య, మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 18 , 2026 | 11:25 PM