Share News

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:24 AM

సరదాగా ఆరుగురు స్నేహితులు కర్నూలు నుంచి ద్విచక్రవాహనంపై పాలకొలను గ్రామానికి గురువారం చేరుకున్నారు. గ్రామ సమీపాన ఉన్న గుండమయ్య చెరువు వద్ద ఈతకు వచ్చారు. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
రోదిస్తున్న పిల్లల తల్లి, బంధువులు

ఓర్వకల్లు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): సరదాగా ఆరుగురు స్నేహితులు కర్నూలు నుంచి ద్విచక్రవాహనంపై పాలకొలను గ్రామానికి గురువారం చేరుకున్నారు. గ్రామ సమీపాన ఉన్న గుండమయ్య చెరువు వద్ద ఈతకు వచ్చారు. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మండలంలోని పాలకొలను గ్రామ సమీపాన ఉన్న గుండమయ్య చెరువులో ఓ విద్యార్థి ఈత కొట్టాలని చెరువులోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేక కేకలు వేయడంతో మరొక విద్యార్థి స్నేహితుడ్ని రక్షించేందుకు చెరువులోకి దిగాడు. ఇద్దరు విద్యార్థులు ఈత కొట్టలేక, బయటకు రాలేక మృతి చెందారు. గమనించిన మరో నలుగురు విద్యార్థులు సమీపంలోని పొలాల్లో ఉన్న స్థానికులకు విషయం తెలపడంతో వారు చెరువులోకి దిగి ఇద్దరిని బయటకు తీశారు. కర్నూలు చెందిన వినయకుమార్‌ (14), మరో విద్యార్థి అస్లాం (14) లుగా గుర్తించారు. పాలకొలను గ్రామానికి చెందిన లాల్‌ అహ్మద్‌ కర్నూలులో స్థిరపడ్డారు. ఆయన కుమారుడు అస్లాం తన స్నేహితులతో గ్రామంలో చెరువు ఉందని చెప్పి ఆరుగురు తోటి విద్యార్థులతో గుండమయ్య చెరువుకు ఈత కోసం వెళ్లారు. గ్రామస్థులు చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌, హుశేనాపురం సొసైటీ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చి మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లాల్‌ మహ్మద్‌, రేష్మా దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండగా.. అస్లాం 8వ తరగతి చదువతున్నాడు. కొమ్ము సుంకన్న, శాంతిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వినయ్‌కుమార్‌ మృతి చెందాడు. ఈ విద్యార్థులందరూ కర్నూలు నగరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో చదువుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 02 , 2026 | 12:24 AM