తుంగ.. బెంగ..!
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:34 PM
కృష్ణా, తుంగభద్ర నదులు ఎల్‌నినో ప్రభావంతో కళాహీనంగా మారాయి. జలాశయాలకు వరద చేరకపోవడంతో బోసిపోతున్నాయి
పెరగని ఇన్‌ఫ్లో
శ్రీశైలం చేరని వరద
వెలవెలబోతున్న ఉమ్మడి జిల్లా జలాశయాలు
జిల్లాలో కురుస్తున్న వర్షాలపైనే ఆశలు
కృష్ణా, తుంగభద్ర నదులు ఎల్‌నినో ప్రభావంతో కళాహీనంగా మారాయి. జలాశయాలకు వరద చేరకపోవడంతో బోసిపోతున్నాయి. నీళ్లు పారని కాలువలను చూసి కష్టజీవుల కళ్లల్లో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. బిరబిరా కృష్ణమ్మ పరుగులు కాదు కదా.. అడుగులు కూడా వేయడం లేదు. తుంగభద్ర బెంగ మిగిల్చింది. జిల్లాలో కురిసే వర్షాలపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ఇదే సమయంలో శ్రీశైలం, తుంగభద్ర, సుంకేసుల జలాశయాల గేట్లెత్తి దిగువకు వరద వదిలేస్తే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచిపోయినా వరద జాడ లేక వెలవెలబోతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు కరువు రైతుల్లో ఆందోళన కలిగిస్త్తోంది. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణా, తుంగభద్ర జలాలు ఆధారంగా నిర్మించిన జలాశయాలు పది ఉన్నాయి. వాటి సామర్థ్యం 44.19 టీఎంసీలు. ప్రతిఏటా శ్రీశైలం జలాశ యానికి వరద ప్రారంభమై, డ్యాంలో కనీస నీటి నిల్వలు చేరగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ నీవా ఎత్తిపోతల ద్వారా వరద జలాలను మళ్లించి వివిధ జలాశ యాలు నింపేవారు. గత ఏడాది ఈ సమ యానికి కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొం గాయి. రాయలసీమ జీవనాడులైన శ్రీశైలం, తుంగభద్ర డ్యాంల గేట్లెత్తి దిగువకు నీరు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నీటి మట్టానికి వరద చేరడం, భారీగా వరద ఉండడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వరద నీటిని మళ్లించి జలాశయాలు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా నదులు ఒట్టిపోగా, జలా శయాలు కన్నీరు కారుస్తున్నాయి. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నీటి మట్టం 855 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.807టీఎంసీలు కాగా.. సోమవారం 820.90అడుగుల వద్ద 41.452 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఒక్క చుక్క వరద కూడా ఇన్‌ఫ్లో లేదు. గతేడాది జూలై 20న 883అడుగుల వద్ద 204.79 టీఎంసీలు నీటి నిల్వ చేరింది. 1,27,201 ఇన్‌ఫ్లో కొనసాగితే, క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు 90,087 క్యూసెక్కులు విడుదల చేశారు.
వరద లేని తుంగభద్ర
శ్రీశైలం డ్యాంతో పోలిస్తే తుంగభద్ర జలాశయం వరద పరిస్థితి కొంత పర్వాలేదు అనిపిస్తోంది. కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలకు కొంతలో కొంతైనా వరద చేరింది. సాగునీరు ఇచ్చేంత వరద చేరకపోవడంతో ఈ ఏడాది సాగునీరు ఇస్తారా? టీబీపీ ఎల్లెల్సీ రైతుల్లో బెంగ మొదలైంది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1603.10 అడుగుల వద్ద 25.796 టీఎంసీలు వరద చేరింది. మంగళవారం 3,667 క్యూసెక్కుల వరద డ్యాంలో చేరితే, ఏపీ, కర్ణాటకలో తాగునీటి కోసం కాలువల ద్వారా 3,254 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున 1625.96 అడుగుల వద్ద 79.665 టీఎంసీలు నిల్వ చేరింది. 36,813 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే.. క్రస్ట్‌గేట్లు ఎత్తి 39,228 క్యూసెక్కులు దిగువకు వదిలారు. తుం గభద్ర డ్యాం గత పదేళ్ల వరద రికార్డులు పరిశీలిస్తే.. సగటున 51.492 టీఎంసీలు వరద చేరడమే కాకుండా 47,247 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగేది. ప్రస్తుతం కాస్తో కూస్తో వరద ప్రారంభమైన సాగునీరు ఇచ్చేంత వరద డ్యాంలో చేరలేదని టీబీపీ బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. జిల్లాలో సుంకేసుల బ్యారేజీ గరిష్ఠ నీటి మట్టం 292 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 1.290 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 290.40 మీటర్ల వద్ద 0.661 టీఎంసీలు ఉన్నాయి. చుక్క నీరు కూడా జలాశయంలో చేరకపోగా కర్నూలు నగరం తాగునీటి అవసరాల కోసం 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోయినేడాది ఇదే రోజు 1.152 టీఎంసీలు చేరడమే కాకుండా, ఇన్‌ఫ్లో 46 వేల క్యూసెక్కులు ఉంటే గేట్లెత్తి దిగువకు విడుదల చేశారు. కేసీ కాలువకు సాగునీరు వదిలారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల జలాశయాలు, నదులు కన్నీరు పెడుతున్నాయి. సాగు ప్రశ్నార్థకంగా మారడంతో కష్టజీవులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లలో జలాశయాల్లో నాడు-నేడు నీటి నిల్వల వివరాలు (సామర్థ్యం, నీటి నిల్వ టీఎంసీల్లో)
జలాశయం సామర్థ్యం ప్రస్తుత నిల్వ గతేడాది నిల్వ
అంతర్రాష్ట్ర జలాశయాలు:
శ్రీశైలం 215.807 41.452 204.79
తుంగభద్ర 105.788 25.796 79.665
కర్నూలు జిల్లా జలాశయాలు:
సుంకేసుల 1.290 0.661 1.152
గాజులదిన్నె 4.50 2.390 1.650
కృష్ణగిరి 0.164 0.013 0.037
పందికోన 1.126 0.637 0.439
పులికనుమ 1.232 0.100 --
నంద్యాల జిల్లా జలాశయాలు:
అలగనూరు 2.970 -- 1.650
వెలుగోడు 16.95 1.750 0.037
వరదరాజ స్వామి 0.389 0.027 0.112
జుర్రేరు 0.266 0.110 0.120
గోరుకల్లు 12.440 2.562 3.500
అవుకు 4.148 0.767 1.553