అటవీ భూముల కబ్జాకు యత్నం
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:10 AM
కూటమికి చెందిన చోటా నాయకులు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖ భూములపై కన్నేశారు. ఇదే అదునుగా భావించిన వారు గుట్టుచప్పుడు కాకుండా చీకట్లో ఎవరికి కనిపించకుండా ఎక్స్‌కవేటర్లతో చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా ఎక్స్‌కవేటర్లతో చదును
8 మందిపై కేసు నమోదు
ఆలూరు/హాలహర్వి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): కూటమికి చెందిన చోటా నాయకులు బరి తెగించారు. ఏకంగా అటవీశాఖ భూములపై కన్నేశారు. ఇదే అదునుగా భావించిన వారు గుట్టుచప్పుడు కాకుండా చీకట్లో ఎవరికి కనిపించకుండా ఎక్స్‌కవేటర్లతో చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఆలూరు నియోజకవర్గంలోని హాల హర్వి మండలం గూళ్యంలో 718 ఎకరాల అటవీశాఖ భూములపై స్థానికంగా ఉన్న కొందరు కూటమి నాయకుల అండదండలతో ఆభూములపై కన్నేశారు. బుధ వారం అర్ధరాత్రి ఎక్స్‌కవేటర్లను తీసుకెళ్లి భూములను చదును చేయడం ఆరంభిం చారు. గురువారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న ఆలూరు రేంజ్ అటవీ శాఖ సెక్షన్ అధికారి శ్రీనివాసులు, బీట్ అధికారులు విమల్, బాలకృష్ణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అధికారులతోనే బేరం పెట్టినట్లు సమాచారం. యంత్రాలను వదిలిపెడితే ఒక్కో ఎక్స్‌కవేటర్‌కి రూ.లక్ష చొప్పున ఇస్తామని ఒత్తిళ్లు చేసినట్లు తెలిసింది. సాయంత్రం వరకు విచారణ చేసిన అధికారులు మరోసారి సంఘటనా స్థలానికి వెళ్లి హద్దులు పరిశీలించారు. అటవీ భూముల ఆక్రమణల కేసులో విచారణ జరిపిన అధికారులు గూళ్యంకి చెందిన గాదిలింగ, పాండురంగతో పాటు ఎక్స్‌కవేటర్ల డ్రైవర్లు దాసరి తిమ్మరాజు, దాసరి అమ్రేష్, అశోక్, ఆనంద్, సందేశ్‌కుమార్, నవీన్‌కుమార్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఆలూరు ఫారెస్ట్ సెక్షన్ అధికారి శ్రీనివాసులు తెలిపారు.