రూ.కోట్ల స్థలంపై రియల్ ముఠా కన్ను
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:10 AM
రూ.కోట్లు విలువ చేసే స్థలంపై ఓ రియల్ ముఠా కన్ను వేసింది. 30 ఏళ్లుగా ఓ వైద్యుడి పేరిట ఉన్న ఆ స్థలాన్ని కబ్జాకు యత్నించింది
ఫెన్సింగ్ తొలగించి కబ్జాకు యత్నం
మంత్రి జోక్యంతో కేసు నమోదు
నంద్యాల క్రైం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రూ.కోట్లు విలువ చేసే స్థలంపై ఓ రియల్ ముఠా కన్ను వేసింది. 30 ఏళ్లుగా ఓ వైద్యుడి పేరిట ఉన్న ఆ స్థలాన్ని కబ్జాకు యత్నించింది. ప్రస్తుతం మార్కెట్లో ఆ స్థలం రూ.కోట్లు ఖరీదు చేస్తుందని తెలిసిన ఆ రియల్ ముఠా తమకు కూడా ఆ స్థలంలో హక్కు ఉందంటూ ఫెన్సింగ్ తొలగించి ఆ స్థలం చుట్టూ ఉన్న గోడను కూల్చివేసింది. అయితే మంత్రికి సదరు స్థలం యజమాని అత్యంత సన్నిహితుడు, మిత్రుడు కావడంతో రియల్ ముఠా ప్లాన్ బెడిసి కొట్టింది. పట్టణంలో ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ సత్యనారాయణ మున్సిపల్ వైద్యాధికారిగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో సింగ్ అపార్ట్‌మెంటు సమీపంలోని 12 సెంట్లు స్థలాన్ని వైద్యుడు సత్యనారాయణ 30ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ స్థలం ఆ వైద్యుడి ఆధీనంలోనే ఉంది. ఈ స్థలం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.3కోట్ల పైమాటే.
ఘటనపై మంత్రి సీరియస్:
రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఎస్‌బీఐ కాలనీలోని 12 సెంట్ల స్థలం యజమాని అత్యంత సన్నిహితుడు. దీనికితోడు మంత్రికి వ్యక్తిగత వైద్యుడు కూడా. తన స్నేహితుడి కి చెందిన రూ.కోట్ల విలువ చేసే 12 సెంట్ల స్థల వివాదం తెలుసుకున్న మంత్రి ఫరూక్ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. స్థల వివాదంలో నిజమైన భూ యజమాని సత్యనారాయణ అని తెలుసుకున్న మంత్రి జోక్యం చేసుకోవడం, యజమాని వైద్యుడు సత్యనారాయణ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. తొలుత 12 సెంట్ల స్థలంలో 2.50 సెంట్ల స్థలం తమదేనని, ఆ స్థలంలో తమకు కూడా హక్కు ఉందంటూ రంగంలోకి దిగిన ముఠాకు పత్రాలు లేకపోవడంతో అభాసుపాలయ్యింది. అసలు యజమాని స్థలానికి చెందిన అసలు పత్రాలతో స్థానిక రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై స్పందించిన పోలీసులు డాక్యుమెంట్లతో స్టేషన్‌కు రమ్మంటూ రియల్ ముఠాకు ఆదేశించినా రాకపోవడం గమనార్హం.
కేసు నమోదు చేసిన పోలీసులు:
ఎస్‌బీఐ కాలనీలోని 12 సెంట్ల స్థలంలో వేసిన కంచెను తొలగించి ప్రహరీ కూల్చివేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాక్టర్ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ సీఐ అస్రార్ బాషా మీడియాకు తెలిపారు.