రాప్తాడు నిందితుడికి మెరుగైన చికిత్స
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:53 PM
రాప్తాడు ఘటన నిందితుడికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
కార్డియాలజీ ఐసీయూలో రోగిని ఉంచి చికిత్స
కర్నూలు హాస్పిటల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాప్తాడు ఘటన నిందితుడికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 13 రోజులుగా అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నిందితుడు రెండు రోజుల నుంచి పల్మనరీ ఎంబాలిజంతో బాధపడుతుండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం నిందితుడికి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు ప్రత్యేక పోలీసు భద్రత మధ్య అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్యాజువాల్టీలో సీఎంవో, ఆర్థోపెడిక్, కార్డియోథోరాసిక్ సర్జన్, కార్డియాలజీ డ్యూటీ అసిస్టెంట్లు వైద్యబృందం రోగిని పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితుడికి కార్డియాలజీ ఐసీయూకు తరలించారు. శనివారం ఉదయం కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కే.వెంకటే శ్వర్లు కార్డియాలజి ఐసీయూ యూనిట్‌కు వెళ్లి రోగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని, అనంతపురం నుంచి వచ్చినప్పుడు కొంత ఆయాసం ఉన్నప్పటికీ కర్నూలు జీజీహెచ్‌కు చేరుకున్న తర్వాత వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అం దిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్డియాలజీ ఇన్‌చార్జి హెచ్‌వోడీ డాక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో రోగికి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. సర్జరీ, కార్డియాలజి, ఆర్థో వైద్యబృందం సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణలో ఉంచి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆయన ఆదేశించారు.