Share News

కర్నూలు జీజీహెచ్‌లో క్షతగాత్రులకు చికిత్స

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:24 AM

చిలకలడోన గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 12 మందిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి క్యాజువాల్టీలో చికిత్స అందిస్తున్నారు.

 కర్నూలు జీజీహెచ్‌లో క్షతగాత్రులకు చికిత్స
పెద్దాసుపత్రిలో క్షతగాత్రురాలిని పరామర్శిస్తున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): చిలకలడోన గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన 12 మందిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించి క్యాజువాల్టీలో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం 12 మందిని కర్నూలుకు తరలించగా.. ఇందులో ఇద్దరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా.. మిగిలిన 10 మంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రైవేటులో చికిత్స పొందుతున్న తల్లి, కుమారుడు భారతి, సునీల్‌ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. క్షతగాత్రులు కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌ మంగళూరు, హాసన్‌, దావణగేరి జిల్లాకు చెందిన వారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు, వారి తాలుకా బంధువుల రోదనలు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద మిన్నంటాయి.

వార్డులకు షిప్టు

ఆసుపత్రికి వచ్చిన 12 మంది క్షతగాత్రుల్లో అమృత(11), దీక్షిత (16) ఆర్థో మూడో యూనిట్‌లో తేజశ్విని(15), సుబ్బమ్మ(34) న్యూరో సర్జరీ, జయమ్మ(60) ఫీమేల్‌ సర్జికల్‌-3 యూనిట్లకు తరలించారు. మిగిలిన వారిని క్యాజువాల్టీలో ఉంచి చికిత్స పొందు తున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన భారతి(40), సునీల్‌(24) తల్లి కుమారుడు తిరిగి కర్నూలు జీజీహెచ్‌లోని క్యాజువాల్టీలో చికిత్స పొందుతున్నారు. 12 మంది క్షతగాత్రుల్లో తేజశ్విని, సుబ్బమ్మ, ఇద్దరు...ఇద్దరు... కోమాలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.

మంత్రి టీజీ భరత్‌ పరామర్శ

గాయపడిన వారిని గురువారం ఉదయం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి భరత్‌ పరామర్శించారు. క్షతగాత్రులకు మెరు గైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

బాధితులకు పరామర్శించిన కలెక్టర్‌

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ డా.ఏ. సిరి ఆదేశించారు. గురువారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న క్షతగాత్రులకు కలెక్టర్‌ పరామర్శించారు. ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి వారిని స్వస్థలమైన స్థలాలకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

నిద్ర మత్తులో వాహనం నడపవద్దు : ఎస్పీ

డ్రైవర్లు నిద్రమత్తులో వాహనం నడపరాదని, నిద్రవస్తే పక్కకు వాహనం ఆపి చల్లటి నీటితో ముఖం కడుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎస్పీ పరామమర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

నిద్రపోయాను

కుటుంబసభ్యులతో, బంధువులతో మంత్రాలయం దైవదర్శనం కోసం వాహనంలో వచ్చాము. 10 నిమిషాల్లో చేరుకునే సమయం లో పెద్ద శబ్దం వచ్చింది. మెలకువలోకి వచ్చేసరికి కుడికాలు విరిగింది. తలకు గాయమైంది. - ధన్యశ్రీ, హడేవా, చిక్‌ మంగళూరు జిల్లా

భయమేసింది

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాహనం వెనుక ఉన్నాను. శబ్దం రావడంతో భయమేసింది. ముందర కూర్చున్న వారు చనిపోయి రక్తపు మడుగులో ఉన్నారు. చాలా భయమేసింది. మొదట ఎమ్మిగనూరు ఆసుపత్రికి తీసుకునివచ్చారు. తర్వాత కర్నూలుకు వచ్చారు. కుడి చేతికి చిన్న గాయమైంది. - అమృత, చిక్‌ మంగళూరు

ఆరుగురిని బయటకు తీశాను

తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదానికి గురైన వాహనం నుంచి ఆరుగురిని బయటకు తీశాను. అమ్మ భారతికి కుడి చేయి విరిగిపోయి తలకు గాయమైంది. లోపల ఉన్న వారిని బయటకు తీయగానే రక్తం చూసి భయమేసింది. - సునీల్‌, క్షతగాత్రుడు, ఉబ్రాణి, దావణగేరి జిల్లా, కర్ణాటక

Updated Date - Apr 17 , 2026 | 12:24 AM