పారదర్శకంగా సహకార సంఘాలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:29 PM
జిల్లాలోని సహకార సంఘాల పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
సాంకేతికతను అమలు చేయాలి
హెచ్‌ఆర్‌ఎంఎస్ ద్వారా జీతాల చెల్లింపులు
కలెక్టర్ ఏ. సిరి
కర్నూలు అగ్రికల్చర్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సహకార సంఘాల పరిపాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్ర వారం కలెక్టరేట్‌లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్ట ర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో సహకార సంఘాల పనితీరు, హెచ్‌ఆర్‌ఎంసీ అమలు, డైనమిక్ ఈవోడీ విధానం, ఉద్యోగుల జీతాల చెల్లింపులు, గోదాముల నిర్మాణం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు చెందిన ఉద్యోగులందరినీ తప్పనిసరిగా హెచ్‌ఆర్ ఎంఎస్ మాడ్యూల్‌లో అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల సేవా వివరాలు, హాజరు, వేతనాల నిర్వహణ, ఇతర పరిపాలన అంశా లన్నీ ఇకపై ఈ వ్యవస్థ ద్వారానే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగుల జీతాలను కూడా హెచ్‌ఆర్‌ఎంఎస్ మాడ్యుల్ ద్వారానే చెల్లించే విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశిం చారు. ఆధునిక, సాంకేతిక విధానాలను పూర్తి స్థాయిలో అమలు చేసి పారదర్శకంగా సహకార సంఘాలను నడిపించాలని అన్నారు. జిల్లా జిల్లాలోని 43 సహకార సంఘాల్లో బ్యాంకుల తరహాలో ప్రతి రోజు డైనమిక్ అండ్ ఆఫ్ ద డే ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీని వల్ల రోజువారి లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందనీ, ఆర్థిక నిర్వహణ మరింత క్రమబద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 114 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 103 మందికి డీఎల్‌ఐసీ ఆమోదం లభించిందన్నారు. అయితే ఈ 103 మందిలో ఇప్పటి వరకు కేవలం 9 మందికి మాత్రమే హెచ్‌ఆర్‌ఎంఎస్ మాడ్యుల్ ద్వారా జీతాలు చెల్లించడం సంతృప్తికరంగా లేదన్నారు. మిగిలిన అర్హులైన ఉద్యోగులందరికీ రాబోయే రెండు రోజుల్లో హెచ్‌ఆర్ ఎంఎస్ ద్వారా జీతాలు చెల్లించాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవోను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీవో శిరీష, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈవో బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.