Share News

ట్రాన్స్‌జెండర్లకూ హక్కులున్నాయి

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:09 AM

సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు కూడా హక్కులు ఉన్నాయనీ వాటిని పరీరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలిపారు

ట్రాన్స్‌జెండర్లకూ హక్కులున్నాయి
ఐడీ కార్డులు అందజేస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

కర్నూలు లీగల్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు కూడా హక్కులు ఉన్నాయనీ వాటిని పరీరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలిపారు. సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్‌ భవనంలో ట్రాన్స్‌జెండర్ల హక్కులపై జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ట్రాన్స్‌జెండర్లను కోరారు. ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్షత తగదని, ఎవరైనా వారి పట్ల వివక్షత చూపితే ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ యాక్ట్‌ 2019 చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్‌జెండర్లకు ఐడీ కార్డులను అందజేశారు. అనంతరం ట్రాన్స్‌జెండర్లకు ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లకు ఐడీ కార్డులు, రేషన్‌ కార్డులు ప్రభుత్వం అందజేస్తుందని, అర్హత కలిగిన వారు పేర్లను, చిరునామాలను తమ కార్యాలయంలో అందజేస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి వాటిని పొందడానికి ప్రయత్నిస్తామన్నారు. ట్రాన్స్‌జెండర్స్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రయీస్‌ ఫాతిమా మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లందరూ ఐడీ కార్డుల కోసం నేషనల్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే ట్రాన్స్‌జెండర్ల ఐడీ కార్డులు వస్తాయనీ తెలిపారు. అనంతరం డాక్టర్‌ రామశిరీష ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించి మందులను అందజేశారు. ట్రాన్స్‌జెండర్ల ప్రతినిధులు వీణారెడ్డి, శ్రీవాణి, పావని పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 12:09 AM