Share News

రైలు ఢీకొని చిరుత మృతి

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:09 AM

రైలు ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కోసిగి రైల్వే స్టేషన్‌ సమీపంలో కోసిగి-పీకలబెట్ట మధ్య గురువారం చోటుచేసుకుంది.

రైలు ఢీకొని చిరుత మృతి
రైలు పట్టాల పక్కన చిరుత కళేబరం

కోసిగి-పీకలబెట్ట మధ్యలో ఘటన

కోసిగి/ఆదోని, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): రైలు ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కోసిగి రైల్వే స్టేషన్‌ సమీపంలో కోసిగి-పీకలబెట్ట మధ్య గురువారం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న ఆదోని రైల్వే పోలీసులు జిల్లా ఫారెస్టు అధికారిణి శ్యామలాదేవి, ఆదోని ఫారెస్టు రేంజ్‌ అధికారిణి తేజశ్వినికి సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి చేరుకొని చిరుత మృతదేహన్ని పరిశీలించారు. చిరుతను గవిగట్టు ఫారెస్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పెద్దకడుబూరు వెటర్నరీ సర్జన్‌ డా.పి.జ్యోష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి సమీపంలో చిరుతకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబరు 23న కోసిగి-కుప్పగల్‌ మద్యలో రైలు ఢీకొని చిరుత పులి మృతి చెందిన సంఘటన మరువకముందే గురువారం రైలు ఢీకొని మరో చిరుత పులి మృతి చెందడంతో వన్యప్రాణుల ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిరుత మృతిపై అనుమానాలు

చిరుత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి రక్తగాయాలు లేకుండా చిరుత మృతి చెందింది. ఇదే విషయాన్ని ఫారెస్టు రేంజ్‌ అధికారిణి తేజశ్వి ని వివరణ కోరగా.. పోస్టు మార్టంలో చిరుతకి ఎడమ వైపు బాగా బ్లీడింగ్‌ అయి పక్కటెముకలు విరిగిపోయాయని, వేగంగా పరుగెత్తే క్రమంలో రైలు బలంగా ఢీకొట్టడంతోనే మృతి చెంది ఉండవచ్చని తెలుపుతున్నారు. అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు కర్నూలు రాయలసీమ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు, చెన్నై ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు మృతి చెందిన చిరుత శాంపుల్స్‌ను పంపిస్తున్నట్లు తెలిపారు. రిపోర్టులు వచ్చాకనే దీని మృతి వివరాలు తెలుస్తాయన్నారు. ఎఫ్‌ఎ్‌సవో భాస్కర్‌ రెడ్డి, ఎఫ్‌బీవో షమీవుల్లా, రీసెర్చ్‌ పెటికోస్ట్‌ హైదరాబాదుకు చెందిన శ్రీధర్‌, కోసిగి గ్రామ పెద్దలు మాణిక్య రాజు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:09 AM