Share News

పెళ్లింట విషాదం!

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:23 AM

అంతవరకూ సంతోషంగా జరిగిన కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య గడిపిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. బావమరిది పెళ్లిలో ఉత్సాహంగా గడిపిన ఇద్దరు బావలు మృతి చెందడంతో పెళ్లింట పెను విషాదం అలుముకుంది

పెళ్లింట విషాదం!
ధ్వంసమైన కారు

బావమరిది పెళ్లికి వచ్చి ఇద్దరు మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

అతివేగంతో దూసుకెళ్లిన కారు

రుద్రవరం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అంతవరకూ సంతోషంగా జరిగిన కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య గడిపిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. బావమరిది పెళ్లిలో ఉత్సాహంగా గడిపిన ఇద్దరు బావలు మృతి చెందడంతో పెళ్లింట పెను విషాదం అలుముకుంది. ఈ విషాద సంఘటన రుద్రవరం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో శిరివెళ్ల మండలం ఖాదర్‌బాదర్‌కు చెందిన చెన్నమ్మ, చెన్నప్ప కుమారుడు కృష్ణ(40) మృతి చెందగా, ఆర్‌.నాగులవరం గ్రామానికి రవి, లచ్చమ్మ కుమారుడు చిన్న నరసింహులు(21) మృతి చెందారు. ఇదే ప్రమాదంలో ఖాదర్‌బాదర్‌ గ్రామానికి చెందిన మద్దిలేటి, మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా... రుద్రవరం మండలంలోని నరసాపురం మెట్ట సమీపంలో జీహెచ్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో దస్తగిరి, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు దస్తగిరి వివాహం ఘనంగా జరిగింది. ఆ వివాహాన్ని చూసుకుని ద్విచక్ర వాహనంపై దస్తగిరి బావలు కృష్ణ, మద్దిలేటి, శ్రీనివాసులు కలసి ఫంక్షన్‌హాలు నుంచి బయల్దేరారు. అదే సమయంలో వివాహాన్ని చూసుకుని బయటకు వచ్చి చిన్ననరసింహులు నిలబడి ఆటో కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ వైపు నుంచి ఓ కారు వేగంగా వచ్చి ముందుగా చిన్న నరసింహులును ఢీకొంది. ఆ వెంటనే ముగ్గురు వెళ్తున్న బైక్‌ను కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తించి వారిని ముందుగా ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్న నరసింహులు మృతి చెందాడు. తర్వాత వారి పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాలకు తరలించారు. నంద్యాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కృష్ణ కూడా మృతి చెందగా, మద్దిలేటి, శ్రీనివాసులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా కారు అతివేగంతో పాటు రాంగ్‌రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమైంది. ఈ కారు నరసాపురం గ్రామానికి చెందిన నడిపి దస్తగిరి రెడ్డిదిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారును నడిపింది దస్తగిరి రెడ్డి కుమారుడు రామ మస్తాన్‌రెడ్డి అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయన్న తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - Jul 02 , 2026 | 12:23 AM