Share News

ఆ'వేదన ' తీరనిది

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:27 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉలిందకొండ బస్సు ప్రమాదం జరిగి సరిగ్గా నేటికి ఏడాది. అయినా మృతుల కుటుంబాల్లో తీరని శోకం. వారి కళ్లలోని కన్నీళ్లు ఇంకా ఇంకి పోలేదు. తమ వారికోసం కుమిలి కుమిలి ఏడవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఒకరి మద్యం మత్తు.. మరొకరి అతివేగం.. నిర్లక్ష్యం.. వెరసి 19 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఘటన. ఏడాది పాటు బాధితులు పడిన వ్యథ వర్ణణాతీతం. ఆనందంగా సాగాల్సిన కుటుంబాల్లో బస్సు ప్రమాదం కన్నీళ్లనే మిగిల్చింది. ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

ఆ'వేదన ' తీరనిది
ఉలిందకొండ వద్ద దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు (ఫైల్‌)

బస్సు ప్రమాదానికి ఏడాది పూర్తి

శోకంలోనే మృతుల కుటుంబాలు

ఇంకా కొందరికి అందని పరిహారం

చొరవ చూపని యంత్రాంగం

ప్రమాద బీమా కోసం మార్గదర్శకం చూపని అధికారులు

ట్రావెల్స్‌ బస్సులపై చర్యలు శూన్యం

కర్నూలు క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): గతేడాది అక్టోబరు 24న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కావేరీ ట్రావెల్స్‌ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. అప్పటికే బస్సులో డ్రైవర్‌తో కలిపి 42మంది ప్రయాణీకులున్నారు. శివశంకర్‌ అతని మిత్రుడు ఎర్రిస్వామితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఉలిందకొండ వద్ద జరిగిన ప్రమాదంతో శివశంకర్‌ మృతి చెం దాడు. ఈప్రమాదమే మరో 19మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. బైక్‌ ప్రమా దం తర్వాత నాలుగైదు వాహనాలు ఆ మార్గంలో వెళ్లినా కావేరి ట్రావెల్స్‌ ప్రైవేటు బస్సు డ్రైవర్‌ అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం పెను ప్రమాదంగా మారింది. డ్రైవర్‌ మాత్రం కాస్త స్పృహతో ఉండి బస్సును ఆపగలిగి ఉంటే 19మంది కు టుంబాల్లో కన్నీటి ఆవేదన ఉండేది కాదు. కొందరు ఈప్రమాదాన్ని డ్రైవర్‌ నిర్లక్ష్యంగా పరిగనిస్తే.. మరి కొంత మంది ఇది కర్మ అని చెబుతున్నప్పటికీ ఆ కుటుంబాల్లో మాత్రం తీరని విషాదమే నింపింది.

అధికారుల హడావుడి..

ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర హోంమంత్రితో సహా పలు మంత్రులు, అధికారులు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఎన్నో హామీలిచ్చారు. ప్రగల్బాలు పలికారు. నిబంధనలను విరుద్దంగా ఉన్న ఒక్క బస్సును తిరగబోనివ్వమని చెప్పారు. ఏడాది గడిచిపోయినా కూడా ఒక్కటంటే ఒక్క బస్సును కూడా ఆపలేకపోయారు. ఏపీలోనే సుమారు 5వేలు పైగా ట్రావెల్స్‌ బస్సులు తిరుగుతున్నట్లు అధికారుల అంచనా. అధికా రులు ఈ ప్రమాద సంఘటన తర్వాత అప్రమత్తమై ట్రావెల్స్‌ ఫిట్‌నెస్సులు, సేఫ్టీ, పర్మిట్ల విషయంలో వరుసగా దాడులు నిర్వహించారు. ఆతర్వాత దీపావళికి అంతా మరిచి పోయారు. బస్సుల యజమానులు నిబంధనలను యథావిధిగా తుంగలో తొక్కేశారు. ఎమర్జెన్సీ అద్దాలు పగలకొట్టేందుకు ఉండాల్సిన సుత్తెలు కూడా ఇప్పటికీ పెట్టుకోవడం లేదంటే అధికారుల నిద్రమత్తు ఎలాంటిదో తెలుసుకోవచ్చు.

ప్రకటనలకే పరిమితం..

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి జాతీయ సంక్షేమ నిధి కింద మృతులకు, క్షతగాత్రులకు పరిహారం అందిస్తామని ప్రకటించారు. అది ప్రకటనలకే పరిమితమైంది. వేమూరి కావేరి ట్రావెల్స్‌ యాజమాన్యం ఇచ్చిన పరిహారం మాత్రమే అందరికీ అందింది. పీఎంఎన్‌ఆర్‌ఎ్‌ఫ నుంచి అందాల్సిన రూ.2లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెందాల్సిన రూ.5 లక్షల పరిహారం ఇంకా చేరలేదు. మరోవైపు బస్సుకు సంబంధించిన బీమా రాబట్టుకునేందుకు ఏ ప్రభుత్వ అఽధికారి సైతం చొరవ చూపకపోవడం విశేషం. మొదటి వారం రోజులు వీరందరికి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి ఏసమస్య ఉన్నా సంప్రదించాలని చెప్పారే తప్ప.. ఆ తర్వాత పది రోజులకే అంతా మరిచిపోయారు బాధిత కుటుంబాలు బస్సుకు సంబంధించి ఇన్సూరెన్స్‌ కోసం క్లెయిమ్‌ చేసుకునేందుకు ఆరు నెలల సమయం గడిచాక కోర్టులో కేసు ఫైల్‌ చేశారు.. వారికి సరైన మార్గదర్శకం లేకపోవడంతోనే ఇది ఆలస్యమైందని వాపో తున్నారు. ఇన్సూరెన్స్‌ నిర్వాహకులు మాత్రం కోర్టులో ఈక్లెయిమ్‌ తిరస్కరించేందుకు పిటిషన్‌ దాఖలు చేశారు.

నివేదికలు ఇచ్చారే తప్ప..

ప్రమాదానికి సంబంధించిన కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివేదికలు కోరాయి. రవాణా, పోలీసు, అగ్నిమాపక శాఖలు, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ సంస్థ ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించి నివేదికలు తయారు చేశారు. ఎవరికి వారు నివేదికలు ఇచ్చారే తప్ప.. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా సూచనలు చేయలేకపోయారు. ఇది కేవలం ఓ కర్మ అంటూ వదిలేశారు. ఇందులో డ్రైవర్‌ నిర్లక్ష్యం కూడా ఏమీ లేదంటూ తేల్చేశారు. వాహన యజమాని తప్పేం లేదంటూ నివేదిక ఇచ్చారు. ఇంకేముంది అందరికీ బెయిల్‌ వచ్చింది. కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. ఈఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక అందించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ గత ఆగస్టులో ఎస్పీని ఆదేశించింది. మరో వైపు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖలు సమర్పించిన నివేదికలో కీలకమైన కారణాలు, లోపాలపై స్పష్టత లేకపోవడంతోనే ఈ ఆదేశాలు జారీ అయినట్లుగా సమాచారం.

Updated Date - Oct 24 , 2026 | 12:27 AM