ట్రాఫిక్ అస్తవ్యస్తం
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:58 AM
మంత్రాలయంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పోలీసులు ట్రాఫిక్‌ను ఎంత నియంత్రణ చేసినా అదుపు కావడం లేదు. దీంతో భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మంత్రాలయంలో హైవే రోడ్డు మీదే వాహనాల పార్కింగ్
ఇష్టారాజ్యంగా ఆటోలు
పార్కింగ్ స్థలాలు లేని ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లు
ఆక్రమణకు గురైన ఆర్‌అండ్ బీ రోడ్లు
మంత్రాలయం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. పోలీసులు ట్రాఫిక్‌ను ఎంత నియంత్రణ చేసినా అదుపు కావడం లేదు. దీంతో భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శక్ర, శనివారాలు రంజాన్, ఆదివారాలు వరుసగా సెలవు దినాలు కావడం, శ్రీశైలం పాదయాత్ర భక్తులు పెద్దఎత్తున రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వస్తుండటంతో మంత్రాలయంలో రద్దీ పెరిగింది. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ముఖద్వారం, శ్రీమఠానికి వెళ్లే ప్రధాన రహదారి, రాఘవేంద్ర సర్కిల్, మాధవరం హైవే రోడ్డు, పోలీసు స్టేషన్ ఎదురుగా, నాగలదిన్నె రోడ్డు, ఆర్‌టీసీ బస్‌స్టాండ్ రోడ్డుకు ఇరువైపులా భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు తలెత్తాయి. దీనికి తోడు ఆటోలు ఇష్టారాజ్యంగా తిప్పడం, భారీ వాహనాలు రవాణాతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంత్రాలయం సీఐ రామాంజులు, మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయ్‌కుమార్, మల్లికార్జునలతో పాటు పోలీసులు అయా గ్రామాల పోలీసు స్టేషన్ నుంచి అదనపు సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేసిన ఫలితం లేకుండా పోయింది. ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లకు పార్కింగ్ స్థలాలు లేకపోవడం, ఆర్‌అండ్‌బీ రోడ్లు, శ్రీమఠం రోడ్లు, గ్రామ పంచాయతీ రోడ్డు కూడా కబ్జాకు గురికావడంతో ట్రాఫిక్‌కు ప్రధాన సమస్యగా మారింది. దీన్ని క్రమబద్ధీకరించాల్చిన అధికారులు పట్టించుకోవడం లేదు. సెలవురోజుల్లో ట్రాఫిక్ వ్యవస్థపై వివిధ రాష్ట్రాల భక్తులు, గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. శ్రీమఠానికి వెళ్లే ప్రధాన రహదారులు, ముఖద్వారం వద్దకు ఆటోలకు అనుమతిలేక పోయిన ఎక్కడపడితే అక్కడ ఆటోలను నిలిపి భక్తులను ఎక్కించుకోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. లాడ్జీలు, హోటళ్లు యజమానులు పార్కింగ్‌కు స్థలాలు లేకపోవడం ప్రధాన రహదారులకు ఇరువైపుల పార్కింగ్ చేయించ డంపై భక్తులు మండిపడుతున్నారు. ఆర్‌టీసీ బస్‌స్టాండ్, ఉన్నతపాఠశాల, సంతమార్కెట్ హెల్త్‌క్లీనిక్ మైదానం, తహశీల్దార్ కార్యాలయం ముందు, రాఘవేంద్ర సర్కిల్ నుంచి మూడురోడ్లు దాదాపు రెండు కి.మీ మేర ఇరువైపుల వాహనాలు పార్కింగ్ చేయడంతో ఆయా కార్యాలయాలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా కబ్జాకు గురైన అర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్లు, ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకొని పోలీసు అధికారులకు సహకరించి ట్రాఫిక్ వ్యవస్థను చక్కదిద్దాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.