Share News

అవినీతి లెక్క తేల్చారు

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:44 AM

గత వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలింది. అధికారులు అక్రమార్కులతో ఏకమై ప్రభుత్వ నిధులను దోచేశారు. రుద్రవరం మేజర్‌ పంచాయతీలో పెద్దఎత్తున జరిగిన అవినీతి అక్రమాలే ఇందుకు నిదర్శనం. ‘ఆంధ్రజ్యోతి’లో గతేడాది ప్రచురితమైన వరుస కథనాలపై కలెక్టర్‌ స్పందించారు. మూడు విడతలుగా విచారణ చేయడంతో పంచాయతీ సర్పంచ్‌, ఆ కాలంలో పనిచేసిన కార్యదర్శులందరూ కలిసి ఏకంగా రూ.1.52కోట్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు సమగ్ర నివేదికను పంచాయతీరాజ్‌ శాఖకు అందజేశారు. దీంతో ఆ శాఖ ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలుగుతోంది.

అవినీతి లెక్క తేల్చారు

2021-25 వరకు రూ.1.52 కోట్ల నిధులు దుర్వినియోగం

మూడుసార్లు విచారణ చేసినా అదే అవినీతి

ఇప్పటికే ఓ కార్యదర్శి సస్పెన్షన్‌

మరో నలుగురిపై చార్జ్జెస్‌.. సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దు

ఆ ఐదుగురు 15 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు

నంద్యాల, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రుద్రవరం మేజర్‌ పంచాయతీలో జరిగిన అవినీతికి సంబంధించిన లెక్కను అధికారులు తేల్చారు. ‘ఆంధ్రజ్యోతి’లో గత ఏడాది ఫిబ్రవరి1న ‘ఏకమై కాజేశారు..!’, మార్చి5న ‘వేటుకు రంగం సిద్ధం’, ఏప్రిల్‌ 4న ‘అక్రమార్కులపై చర్యలకు సిద్ధం?’, జూలై12న ‘అక్రమార్కుల్లో అలజడి’ అనే శీర్షికలన వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. కలెక్టర్‌ స్పందించి సమగ్ర విచారణ చేపట్టి నివేదికను పంచాయతీరాజ్‌ శాఖకు అందజేశారు. తాజాగా ఆశాఖ కమిషనర్‌ సర్పంచ్‌తో పాటు నలుగురు పంచాయతీ కార్యదర్శలు 15 రోజుల్లో తగిన సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఇదే క్రమంలో సదరు నలుగురు కార్యదర్శులపై చార్జ్జెస్‌ ఫ్రేమ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా త్వరలోనే వారిచ్చే సంజాయిషీ తర్వాత ఆశాఖ కమిషనర్‌ సదరు అధికారులపై చర్యలు తీసుకునే అవ కాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వ నిధులను ఫేక్‌ బిల్లులు సృష్టించి సర్పంచ్‌తో అధి కారులు కుమ్మక్కై కాజేయడంపై విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా పంచాయతీలో అవినీతి లెక్కను తేల్చినట్లైంది.

ప్రత్యేక కమిటీ అందజేసిన నివేదిక ప్రకారం..

ప్రత్యేక కమిటీ అందజేసిన నివేదిక ప్రకారం.. సదరు పంచాయతీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.1.52కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. ఆయా కార్యదర్శుల హయాంలో జరిగిన నిధులు దుర్విని యోగం వివరాలు

పంచాయతీ కార్యదర్శుల వారీగా జరిగిన నిధుల దుర్వినియోగం

కార్యదర్శి పేరు: మొత్తం నిధులు

నూనె వెంకట సుబ్బారావు : రూ65,05,878

సుబ్బారావు: రూ.25,28,162

మహమ్మద్‌ రఫీక్‌ అక్తర్‌: రూ.30,04,872

పట్టం చెన్నయ్య: రూ.30,35,487

భాగ్యలక్ష్మి(ప్రస్తుతం ఎంపీడీవో): రూ.1,52,366

మొత్తం : రూ. 1,52,26,765

సమగ్ర నివేదికను గతేడాది ఏప్రిల్‌ 23న..

కలెక్టర్‌ సైతం ఒకటి.. రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు విచారణ చేయించి మరీ తదుపరి చర్యలు నిమిత్తం సమగ్ర నివేదికను గతేడాది ఏప్రిల్‌ 23వ తేదీన ఆశాఖ కమిషనర్‌కు పంపారు. సదరు పంచాయతీలో రూ.1.52కోట్లు నిధులు దుర్వినియోగమైనట్లు భావించి సదరు కమిషనర్‌ గత ఏడాది జూలై1న ఉత్తర్వులు జారీ చేయడం ఆశాఖ ఉద్యోగులతో పాటు అక్రమార్కుల్లో ఆలజడి మొదలైంది. పైన పేర్కొన్న వారందరితో పాటు సర్పంచ్‌ను సైతం ఆశాఖ కమిషనర్‌ తాజాగా సంజాయిషీ నోటీసులు జారీ చేయడంతో ఆ వర్గాల్లో భయోందోళన మొదలైంది. 15 రోజుల్లో వారందరూ తగిన సంజాయిషీ ఇవ్వాలని అదేశించారు. త్వరలోనే వీరందరిపై ఆశాఖ కమిషనర్‌ శాఖ పరమైన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సదరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయడంతో పాటు వీరిలో పంచాయతీ కార్యదర్శి సుబ్బారావును సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. నిధుల రికవరీకి సైతం ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.

కమిషనర్‌ ఆదేశాలను అమలుచేస్తాం

రుద్రవరం పంచాయతీలో జరిగిన వ్యవహరాలపై కమిషనర్‌ ఆదేశాలను పక్కాగా అమలు చేస్తాం. తప్పుచేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో ఏ పంచాయతీలోనూ అవినీతి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతాం. - రాజకుమారి, కలెక్టర్‌, నంద్యాల

Updated Date - Feb 15 , 2026 | 12:44 AM