Share News

సాకారం దిశగా...

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:19 PM

చుక్క నీటి కోసం ఎదురు చూసిన కళ్లల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సీమ వాసుల ఎన్నో ఏళ్ల కళకు అడుగులు పడుతున్నాయి.

సాకారం దిశగా...
గుండ్రేవుల నిర్మాణానికి ప్రతిపాదించిన తుంగభద్ర నది ప్రాంతం

కరువు రైతుల సుదీర్ఘ నిరీక్షణ

తుంగభద్ర జలాల వినియోగంపై ‘హైలెవల్‌ కమిటీ’

ప్రాజెక్టు అంచనా రూ.6,500 కోట్లకు చేరిన వైనం

గుండ్రేవుల ప్రాజెక్టుపై కదలిక

చుక్క నీటి కోసం ఎదురు చూసిన కళ్లల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సీమ వాసుల ఎన్నో ఏళ్ల కళకు అడుగులు పడుతున్నాయి. తుంగభద్ర తీరంలో సువర్ణ అధ్యాయానికి మరో నాంది మొదలు కానుంది. మూడు రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం హోస్పెట్‌ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్‌, ఎ.రేవంత్‌రెడ్డిలు తంగభద్ర జలాల సమర్థవంతమైన వినియోగం కోసం హైలెవల్‌ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కరువుసీమ పల్లె రైతుల జీవనాడి గుండ్రేవుల ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్లాల్లో చర్చించామని సీఎం చంద్రబాబు వెల్లడించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కడలిపాలు అవుతున్న తుంగభద్ర జలాలను ఒడిసి పట్టి, గుండ్రేవుల జలాశయం నిర్మాణం ద్వారా కేసీ కాలువ, పశ్చిమ మెట్టచేలకు మళ్లించాలనే సంకల్పంతో దివంగత రిటైర్డ్‌ ఇంజనీరు సుబ్బరాయుడు డిజైన్‌ చేసిన ఈ ప్రాజెక్టుపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిపై కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పెట్‌ దగ్గర 105.87 టీఎంసీల సామర్థ్యంతో తుంగభద్ర జలాశయం (టీబీపీ డ్యాం) నిర్మించారు. అక్కడి నుంచి తుంగభద్ర 255 కిలోమీటర్లు ప్రవహించి కర్నూలు నగరానికి 15-20 కిలోమీటర్ల దూరంలో శాతనకోట వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. తుంగభద్ర డ్యాంను దాటి ప్రతియేటా సగటున 180-200 టీఎంసీలు కృష్ణా నదిలో కలుస్తున్నాయి. 255 కి.మీల మధ్యలో 1.20 టీఎంసీల సామర్థ్యంలో కర్నూలు నగరానికి 20 కి.మీల దూరంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజీ తప్పా ఏ ఒక్క జలాశయం లేదు. కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)-1 ప్రకారం సుంకేసుల బ్యారేజీ దిగువన 37.5 టీఎంసీలు మాత్రమే కృష్ణా నదికి ఇవ్వాలి. ఏటేటా వందల టీఎంసీలు కృష్ణా నదిలో కలసి కడలిపాలు అవుతున్నాయి. సముద్రంలో కలుస్తున్న తుంగభద్ర జలాలు ఎలా ఉపయోగించుకోవాలి..? నీటి వినియోగంలో మూడు రాష్ట్రాల మధ్య తెలెత్తిన జల వివాదాలు ఎలా పరిష్కరించుకోవాలి..? రాజకీయాలకు అతీతంగా భావితరాలకు జల ప్రయోజనాలు ఎలా అందించాలి..? ఆయా రాష్ట్రాల సాగునీటి నిపుణులను వేదిస్తున్న ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానంగా గురువారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, డీకే శివకుమార్‌, ఎ.రేవంత్‌రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరిం చుకుంది. ఈ సమయంలో తంగభద్ర జలాల వినియోగం కోసం హైలెవల్‌ కమిటీ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆయా రాష్ట్రాల రైతులకు, ముఖ్యంగా ఏటా కరువు, వలసలతో తల్లడిల్లే రాయలసీమ రైతులకు ఇది శుభవార్తే.

‘గుండ్రేవుల’ ఒక్కటే పరిష్కారం

హోస్పెట్‌ - సుంకేసుల మధ్య దాదాపు 225 కిలోమీటర్ల పరిధిలో ఒక్క రిజర్వాయర్‌ కూడా లేదు. ఆర్డీఎస్‌ ఆనకట్ట ఉన్నా.. అది కేవలం మళ్లింపు పథకమే తప్పా నీటి నిల్వ చేసే సామర్థ్యం లేదు. తుంగభద్ర డ్యాంకు ఏదైనా ప్రమాదం వాటిల్లినా..? కృష్ణా నదికి వరద పోటెత్తి, తుంగభద్ర నుంచి ఇచ్చే వరద అవరసం లేకున్నా, ఆ నీటిని నిలువు చేసుకోవడానికి మరో జలాశయం అవసరం ఉంది. లేదంటే వృథాగా సముద్రంపాలు కాకతప్పదు. అంతేకాదు.. కృష్ణా నదికి వచ్చే వరద, తుంగభద్ర నదితీర గ్రామాల నీటి అవసరాలు పరిగణలోకి తీసుకున్న కేడబ్ల్యూడీటీ-1 కృష్ణాకు తుంగభద్ర వాటా (షేర్‌) 37.5 టీఎంసీలే కేటాయించింది. ఆపై వచ్చే వరదను సుంకేసుల బ్యారేజీ ఎగువున ఉపయోగించుకునే హక్కు ఉంది. పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఏటా సగటున 180-200 టీఎంసీలు కృష్ణాలో కలసి, అక్కడి నుంచి సముద్రంపాలు అవుతున్నాయని సాగునీటి నిపుణులు ఘోషిస్తున్నారు.ఆ నీటిని నిలుపుకోవడానికి ఉన్న ఏకైక పరిష్కారం 20 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించిన ‘గుండ్రేవుల జలాశయం’ ఒక్కటే. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీ కాలువ ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు, కర్నూలు నగరానికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంతో పాటు ఎగువన ఉన్న ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పలు గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా సాగు, తాగునీరు ఇవ్వవచ్చు. అదే క్రమంలో నది ఆవల ఒడ్డున ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ఆర్డీఎస్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

కరువు రైతుల సుదీర్ఘ పోరాటం

తుంగభద్ర నుంచి కేసీ కాలువకు 31.90 టీఎంసీలు నీటివాటా ఉన్నా నీటిని నిలుపుకునే జలాశయం లేదు. ఆ నీటిని నిలువ చేసుకుంటే కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ఆయకట్టు రైతులకు పుష్కలంగా సాగునీరు ఇవ్వవచ్చని సీమ సాగునీటి నిపుణుడు, దివంగత రిటైర్డ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీరు సుబ్బరాయుడు ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మాణానికి డిజైన్‌ చేశారు. 2013 నవంబరు 1న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డీపీఆర్‌ తయారీకి రూ.51.95 లక్షలు మంజూరు చేస్తూ జీవో ఎంఎస్‌ నం. 100 ఐ అండ్‌ కాడ్‌ను జారీ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్వే అసోసియోట్స్‌ సంస్థ సర్వే పనులు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో అడ్డంకులు ఎదురైనా సర్వేను పూర్తి చేసి రూ.2,980 కోట్ల అంచనాతో 2015 అక్టోబరు 13న డీపీఆర్‌ ప్రభుత్వానికి అందజేసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే.. గుండ్రేవుల సాధన కోసం రాయలసీమ సాగునీటి సమితి అధ్వర్యంలో కర్నూలు నుంచి గుండ్రేవుల వరకు పాదయాత్ర చేశారు. 2019 జనవరిలో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి గుండ్రేవులపై పట్టుపట్టడంతో అదే ఏడాది ఫిబ్రవరి 21న నాటి చంద్రబాబు ప్రభుత్వం రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీఓ ఎంఎస్‌ నం.153 జారీ చేసింది. ఆ తరువాత జగన్‌ సారథ్యంలో వచ్చిన వైసీపీ ప్రభు త్వం అంతర్‌రాష్ట్ర సమస్య అంటూ ఐదేళ్లు అటకెక్కించింది. ఈ ప్రాజెక్టు కోసం రైతులు, సాగునీటి నిపుణులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు వివిధ వేదికలపై పోరాటం చేస్తూ వచ్చారు.

గత 15 ఏళ్ల నుంచి సుంకేసుల బ్యారేజీ నుంచి శ్రీశైలం డ్యాంకు విడుదల చేసిన తుంగభద్ర వరద జలాలు (టీఎంసీల్లో)

సంవత్సరం వరద నీరు

2010-11 244

2011-12 132

2012-13 46

2013-14 286

2014-15 257

2015-16 33

2016-17 11

2017-18 62

2018-19 202

2019-20 289

2020-21 229

2021-22 253

2022-23 599

2023-24 10

2024-25 353

2025-26 407

ఇదే సరైన సమయం

గుండ్రేవుల జలాశయం నిర్మాణ అంచనా వ్యయం రూ.2,890 కోట్ల నుంచి రూ.6,500 కోట్లకు చేరింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరిలు పలుమార్లు అసెంబ్లీ వేదికగా గళమెత్తారు. మొదట్లో అంతర్‌రాష్ట్ర సమస్య అంటూ వైసీపీ పాటనే అందుకున్న కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు సీమ కరువు రైతుల ఆకాంక్షను గుర్తించింది. తుంగభద్ర జలాల వినియోగంపై హోస్పెట్‌ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సమక్షంలో కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించడం, మూడు రాష్ట్రాల ఆమోదయోగ్యం కోసం హైలెవల్‌ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపడం శుభపరిణామని నిపుణులు అంటున్నారు. గుండ్రేవుల కార్యరూపం దాల్చేందుకు ఇదే సరైన సమయం. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజకీయాలకు అతితంగా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకురావాలి. హైలెవల్‌ కమిటీ గుండ్రేవుల నిర్మాణంపై ఆమోదయోగ్యమైన సూచనలు చేసేలా అవరమైన నివేదికలు, వినతి పత్రాలు ఇవ్వాలి. అంతేకాకుండా.. సరిహద్దు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్టు వల్ల జల ప్రయోజనాలు ఉండడంతో ఆ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలను ఒప్పించి గుండ్రేవుల సాకారం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Jun 27 , 2026 | 11:19 PM