Share News

భారీగా పతనమైన టమోటా ధరలు

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:48 AM

టమోటా రైతు పరస్థితి దయనీయంగా మారింది. కరువు కాలంలో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతు దిగాలు చెందుతున్నాడు.

భారీగా పతనమైన టమోటా ధరలు
ఎమ్మిగనూరు మార్కెట్‌లో పశువుల పాలు

30 కిలో బాక్సు రూ 50 లోపే

ఎమ్మిగనూరు, మార్చి 2(ఆంధ్రజ్యోతి): టమోటా రైతు పరస్థితి దయనీయంగా మారింది. కరువు కాలంలో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పోవడంతో రైతు దిగాలు చెందుతున్నాడు. ప్రస్తుతం ధరలు ఇలాగే కొనసాగితే పెట్టుబడులు కూడా చేతికి అందవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఎంతో ఆశతో రైతులు టమోటా సాగుచేశారు. సాగు ప్రారంభంలో ధరలు బాగా ఉండటంతో కంటికి రెప్పలా పంటను కాపాడుకున్నారు. పంట చేతికి అందే సమయానికి వ్యాపారుల మాయాజానికి రైతులు బలవుతున్నారు. ధరలు పూర్తిగా పడిపోయాయి. మార్కెట్‌ లో 30 కేజీల బాక్స్‌ ధర రూ.30 నుంచి రూ.50 లోపే ధర పలుకుతోంది. దీంతో రవాణా ఖర్చులు, ఇతరత్ర ఖర్చులు కలిపి బాక్స్‌కు రూ. 50 అవుతుంది. దీంతో పెట్టబడులు కూడా చేతికి అందే పరస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో రవాణ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు సోమవారం ఎమ్మిగనూరు మార్కెట్‌లో పారబోశారు.

రైతుల దిగాలు

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు, తెర్నేకల్లు, మండలాల్లో దాదాపు బావులు బోర్లు కింద టమోటా పంటను సాగు చేశారు. ఎకరం పంట పెట్టబడికి దాదాపు రూ. 30వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుంది. పండిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే 30 కేజీల బాక్స్‌ కేవలం రూ. 30 నుంచి రూ. 50 దాటడం లేదని టమోటా రైతులు వాపోతున్నారు. ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

ద ళారులదే రాజ్యం

రైతు నుంచి వ్యాపారులు కిలో రూ. 1.50కు కొనుగోలు చేసి వారు కిలో రూ. 10లకు అమ్ముకుంటున్నారు. దీంతొ వారికి కిలోకు రూ. 8.50 పైసలు లాభం సంపాదించుకుంటున్నారు. అయితే కష్టపడి పండించి రైతులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి.

అయ్యే ఖర్చులు

గోనెగండ్ల నుంచి ఎమ్మిగ నూరుకు రవాణా ఖర్చు బాక్స్‌కు రూ. 30 అవుతుంది. కమీషన్‌ ఏజెంట్‌కు రూ. 100కు రూ. 10., హమాలీకి బాక్స్‌కు రూ. 5, మున్సిపాలిటీకి బాక్స్‌కు రూ. 5, టమోటాలు కోయడానికి ఒకరికి రూ. 300, పొలం నుంచి ఆటోలో వేయడానికి కూలి ఒక్కరికి.. రూ. 250, మార్కెట్‌కు తరలించడానికి రూ.50 ఖర్చు అవుతుంది. అలాగే టమోటా కోయడానికి కూలీలు రైతునే భరించాల్సి ఉంది. దీంతో టమోటా రైతుకు పెట్టుబడిపోయి అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

దిగుబడి ఉన్నా ధర లేదు

ఎకరా పొలంలో టమోటా పంటను సాగు చేశాను. పంట దిగుబడి బాగానే ఉంది. అయితే పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. దీంతో రైతులు అప్పుల పాలు కావాల్సి వస్తోంది. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కోత కోయాల్సిన కూలీలకు రూ. 250 నుంచి రూ. 300 వరకు ఇవ్వాల్సి వస్తోంది. మొత్తం ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేశాను. ధర లేక పోవడంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. - మల్లికార్జున, టమోటా రైతు, సంతనాగలాపురం.

గిట్టుబాటు ధర కల్పించాలి

ప్రస్తుతం టమోటా రైతు పండించిన పంటకు గిట్టు బాటు ధరలేదు. దీంతో టమోటా రైతు అమ్మకాలు జరపడానికి వచ్చి ధర లేక పోవడంతో మార్కెట్‌లోనే పారబోసి వెళ్తున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వం టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. - గోవిందు, సీపీఎం నాయకుడు, ఎమ్మిగనూరు.

Updated Date - Mar 03 , 2026 | 12:48 AM