Share News

నేడు పసుపు పండుగ

ABN , Publish Date - May 26 , 2026 | 11:19 PM

మహానాడు.. తెలుగు తమ్ముళ్లు జరుపుకునే మహా పండుగ.

నేడు పసుపు పండుగ

మహానాడుకు ఏర్పాట్లు పూర్తి

73 క్లస్టర్లుగా విభజన

హైబ్రిడ్‌ విధానంలో తొలిసారి నిర్వహణ

జిల్లా నుంచి పలు తీర్మానాలు

కర్నూలు, మే 26 (ఆంధ్రజ్యోతి): మహానాడు.. తెలుగు తమ్ముళ్లు జరుపుకునే మహా పండుగ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా మే 27 నుంచి 29 వరకు మూడు రోజులు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది నెల్లూరు వేదికగా నిర్వహించాలని సన్నాహాలు చేశారు. అయితే ఇంధనం, గ్యాస్‌ కొరత నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. లక్షాలది మంది తెలుగుతమ్ముళ్లు హాజరయ్యే మహనాడుకు టీడీపీ శ్రేణులు హాజరు కావాలంటే భారీ మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ కావాలి. దీంతో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రీడ్‌ విధానంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో 73 క్లస్టర్లలో ఈ వేడుక బుధవారం ప్రారంభం కానుంది. టీడీపీ కార్యకర్తలు వర్చువల్‌గా భాగస్వామ్యులవుతారు. కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం, మౌర్యఇన్‌ హోటల్‌, తనిష్క ఫంక్షన్‌ హాల్‌, టీటీడీ ఫంక్షన్‌ హాల్‌, ఉర్దూ ఘర్‌, కమ్యూనిటీ హాల్స్‌, విశ్వక్‌ గార్డెన్‌.. ఇలా 12 క్లస్టర్‌ పరిధిలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ముస్తాబు చేశారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, పాణ్యం, ఆదోని, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, గౌరు చరతి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, వైకుంఠం జ్యోతి, ఎన్‌.రాఘవేంద్రరెడ్డిల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్చువల్‌గా కార్యకర్తలు హాజరయ్యేందుకు గాను ఎల్‌ఈడీ భారీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ సహా ముఖ్య నేతలు వర్చువల్‌గా మాట్లాడుతారు. జిల్లా నుంచి కూడా నాయకులు వర్చువల్‌గా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సంబంధించి వివిధ తీర్మానాలు ప్రవేశ పెడతారు.

జిల్లా నుంచి తీర్మానాలు ఇవే...

రైతుల సంక్షేమం, వ్యవసాయ, సాగునీరు, రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తీర్మానం ప్రవేశ పెడుతారు.

రాయలసీమలో హార్టికల్చల్‌ హబ్‌ అభివృద్ధి, పత్తికొండలో హార్టికల్చర్‌, పారిశ్రామిక అభివృద్ధి తీర్మానాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రవేశపెడుతారు.

పశ్చిమ ప్రాంతమైన ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాలను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న వలసలు, తాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టే కార్యచరణపై ఒక తీర్మానం ఉంటుంది.

కరువు, వలసల నివారణే లక్ష్యంగా చేపట్టిన వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ సహా అసంపూర్తిగా ఉన్న పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయడం, గుండ్రేవుల జలాశయంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే తీర్మానం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Updated Date - May 26 , 2026 | 11:19 PM