Share News

సీఎం ఆశీస్సులు ఎవరికో?

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:17 AM

జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ పీఠం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు రాష్ట్ర నాయకత్వంతో తమకున్న పరిచయాలు ద్వారా ప్రయత్నాలు తీవ్రం చేశారు. అదే క్రమంలో అధిష్ఠానానికి, జిల్లా నాయకత్వానికి మధ్య వారధిగా.. అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు దూతగా ఉంటున్న జోనల్‌ ఇన్‌చార్జి జిల్లా ముఖ్య నాయకులతో చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు పేర్లు అధిష్ఠానం పరిశీలనకు పంపుతున్నట్లు సమాచారం. ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. అంతిమంగా అధినేత, యువనేతల నిర్ణయమే కీలకం కావడంతో వారి మనసులో ఎవరున్నారు? అన్నది పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.

సీఎం ఆశీస్సులు ఎవరికో?

ఆశావహుల్లో ఉత్కంఠ

జడ్పీ పీఠం.. అధినేత నిర్ణయం

చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై టీడీపీ కసరత్తు

ముఖ్య నేతలతో సమాలోచన

ఒకే పదవి.. నలుగురు పోటీ

20న జిల్లా పరిషత్‌ అధ్యక్షుడి ఎంపిక

కర్నూలు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 20వ తేదీ జిల్లా ప్రథమ పౌరుడైన జడ్పీ చైర్మన్‌ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ముహూర్తం. నేటితో నాలుగు రోజులే మిగిలింది. కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఆశావహుల్లో టెన్షన్‌. కీలకమైన జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుంది? సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించిన సీనియర్లకు పట్టం కడుతారా.? సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటారా? కొత్త తరానికి బాధ్యతలు అప్పగిస్తూ యువ నాయకత్వానికి బాటలు వేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఐదుగురు ఆశావహులు దరఖాస్తులు..

చైర్మన్‌ పీఠం ఆశిస్తూ టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జి పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మకు ఐదుగురు ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. వాటిని అధిష్ఠానానికి పంపారు. హోళగుంద జడ్పీటీసీ సభ్యుడు ఈడిగ గోవిందగౌడ్‌ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆయన పార్టీలో కొనసాగుతానని అధిష్టానికి విన్నవించినా, సస్పెన్షన్‌ ఎత్తివేయకపోవడంతో ఆయనకు జడ్పీ చైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని టీడీపీ ముఖ్య నాయకుడు ఒకరు తేల్చిచెప్పారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు పేర్లు అధిష్టానం పరిశీలనకు పంపించేందుకు కర్నూలు కేంద్రంగా కరసత్తు చేస్తున్నారు. ఇదే విషయంపై పార్టీ జోనల్‌ ఇన్‌చార్జి పి.శ్రీనివాసరెడ్డి ముఖ్య నాయకులతో సోమవారం సమాలోచన చేసినట్లు విశ్వాసనీయ సమాచారం.

సీనియార్టీకా.. యువతకా..?:

కర్నూలు జడ్పీ చైర్మన్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఆ సామాజికివర్గం నుంచి చైర్మన్‌ పదవిని కౌతాళం జడ్పీటీసీ చుడి ఉలిగయ్య ఆశిస్తున్నారు. మొదట ఆయన పేరు తెరపైకి వచ్చింది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఈయన టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ఎన్నికలు ఏవైనా టీడీపీ అభ్యర్థుల విజయం కృషి చేస్తూ వస్తున్నారు. తుగ్గలి జడ్పీటీసీ సభ్యురాలు మిద్దె గీతాకుమారి, దేవనకొండ జడ్పీటీసీ సభ్యురాలు షేక్‌ సాదిక కూడా జడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్నారు. వీరిద్దరు రాజకీయాలకు కొత్తైనా వీరి కుటుంబాలకు రాజకీయ నేపథ్యం ఉంది. గీతాకుమారి డిప్లమా ఇన్‌ ఎడ్యూకేషన్‌ (డీఈడీ) చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. షేక్‌ సాదిక ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ చదువుతున్న మైనార్టీ నాయకురాలు. ఈ ముగ్గురిలోనే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో ఇద్దరు పేర్లు అధిష్ఠానం పరిశీలనకు పంపించేందుకు సమాలోచన చేస్తున్నారు. సీనియారిటీ, జిల్లాలో బలమైన వాల్మీకి సామాజికవర్గాన్ని పరిగణలోకి తీసుకొని ఉలిగయ్యకు జడ్పీ పీఠం కట్టుబెడతారా? కొత్త తరం యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ మిద్దె గీతాకుమారి, షేక్‌ సాదిక ఇద్దరిలో ఒకరికి అవకాశం ఇస్తారా..? టీడీపీలో ఏ ఇద్దరిని కదిపినా ఇదే హాట్‌ టాపిక్‌. ఆదోని జడ్పీటీసీ సభ్యురాలు కురవ శంకరమ్మ కూడా ఆశిస్తున్నారు.

పెరిగిన పోటీ..

జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలున్నాయి. టీడీపీ 18, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించారు. కృష్ణగిరి జడ్పీటీసీ సభ్యుడు మర్రి శ్రీరాములు టీడీపీ మద్దతుతో గెలుపొందారు. టీడీపీ రెబల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా హోళగుంద జడ్పీటీసీ సభ్యుడు ఈడిగ గోవింద్‌గౌడ్‌ విజయం సాధించారు. తాను టీడీపీలోనే కొనసాగుతున్నానని ఆ పార్టీ ముఖ్య నాయకులను కలసి స్పష్టత ఇచ్చారు. కూటమి జడ్పీటీసీల బలం 21 అవుతుంది. వైసీపీ కేవలం ఐదు స్ధానాలతో సరిపుచ్చుకుంది. జడ్పీ చైర్మన్‌ పీఠం దక్కించుకునేందుకు స్పష్టమైన ఆధిక్యత సాధించడంతో టీడీపీలో చైర్మన్‌ పీఠం కోసం పోటీ పెరిగింది.

సమాలోచనలు..

ఈ నెల 19న మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. 20వ తేదీన జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ సహా కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక ఉంటుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ.సిరి ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, జడ్పీ సీఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు విప్‌ జారీకి అనెక్జర్‌-2 కోసం ఏ.సిరికి సోమవారం ఫారం-ఏ అందజేశారు. అదే క్రమంలో జోనల్‌ ఇన్‌చార్జి పి.శ్రీనివాసరెడ్డి జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక కోసం జిల్లా ముఖ్య నాయకులతో సమాలోచన చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది.

Updated Date - Nov 17 , 2026 | 12:17 AM