Share News

భక్తుల చెంతకు...

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:44 PM

ఎక్కడైనా స్వామి వద్దకే భక్తులు వెళ్తుంటారు. కానీ పుణ్య వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న అహోబిలంలో మాత్రం సాక్షాత్తు ఆ నారసింహుడే కొండలు దిగి భక్తుల చెంతకు వెళ్తారు.

భక్తుల చెంతకు...
ఎగువ అహోబిలం నుండి కిందికి వచ్చిన జ్వాలా నరసింహా స్వామి పల్లకి

కొండదిగి వచ్చిన అహోబిల నారసింహుడు

కల్యాణోత్సవానికి స్వయంగా ఆహ్వానం పలికే సంప్రదాయం

ఆళ్లగడ్డ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా స్వామి వద్దకే భక్తులు వెళ్తుంటారు. కానీ పుణ్య వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న అహోబిలంలో మాత్రం సాక్షాత్తు ఆ నారసింహుడే కొండలు దిగి భక్తుల చెంతకు వెళ్తారు. తన కల్యాణోత్సవానికి రారండని స్వయంగా ఆ దేవదేవుడై భక్త జనులను ఆహ్వానం పలకడం ఇక్కడి విశేషం. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాతి రోజు కనుమ సందర్భంగా శ్రీవారు అహోబిలం కొండ దిగి ప్రతి పల్లెకు పయనమవుతారు. దీనినే పార్వేట ఉత్సవంగా పిలుస్తారు. ఎక్కడా లేని విధంగా అహోబిలం క్షేత్రంలో 45 రోజుల పాటు ఈ పార్వేట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ప్రహ్లాద వరదుడితో కలసి జ్వాలా నరసింహస్వామి ఒకే పల్లకిపై విహరిస్తూ భక్తుల వద్దకు వెళ్తారు. ఇలా ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాల వాడ మండలాల్లోని 33 గ్రామాల ప్రజలకు స్వామివారు దర్శనమిస్తూ నెలన్నర రోజుల తర్వాత తిరిగి కొండకు చేరుతారు.

కనుమ సందర్భంగా అహాబిలంలో శుక్రవారం పార్వేట ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఎగువ అహోబిలం నుంచి జ్వాలా నరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని రోడ్డు మార్గాన దిగువ అహోబిలానికి పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారు కొండదిగి రావడంతో చెంచులు ఆనందంతో సంప్రదాయ గిరిజన నృత్యాలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాద వరద స్వామి పార్వేట ఉత్సవానికి బయలు దేరారు. దిగువ అహోబిలంలో లక్ష్మినరసింహస్వామికి ఆలయ ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్‌ స్వామి ఆధ్వర్యంలో పూజారుల బృందం ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ పూజల్లో ఎమ్మె ల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. డీఎస్పీ ప్రమోద్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jan 16 , 2026 | 11:44 PM