Share News

నల్లమలలో పాడి గేదెలపై పెద్దపులి పంజా..!

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:10 PM

ఆత్మకూరు మండలంలోని కొట్టాలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌పై ఓ పెద్దపులి పాడిగెదెలను పంజా విసిరిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

నల్లమలలో పాడి గేదెలపై పెద్దపులి పంజా..!
పాడి గేదెను పులి హతమార్చిన దృశ్యం (ఫైల్‌)

ఆత్మకూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు మండలంలోని కొట్టాలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌పై ఓ పెద్దపులి పాడిగెదెలను పంజా విసిరిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 16వ తేదిన కొట్టాలచెరువు గ్రామానికి చెందిన రామునాయక్‌ తన పాడిగేదెలను మేపేందుకు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌ సమీపం వద్దకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఓ పెద్దపులి గేదెల మందపై దాడి చేసి అక్కడికక్కడే ఓ గేదెను హతమార్చింది. అంతేకాకుండా ఓ పులి తలభాగంపై ఎక్కి తీవ్రంగా దాడి చేసింది. అయితే అప్పటికే దూరంగా ఉన్నటువంటి గేదెల కాపరి పెద్దపులి బీభత్సాన్ని చూసి భయపడి ఇంటికి వెళ్లిపోయాడు. విషయాన్ని అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆదివారం రాత్రి అటవీ సిబ్బంది సంఘటనా ప్రదేశంలో కెమెరా ట్రాప్స్‌ ఏర్పాటు చేయాలని అక్కడకు చేరుకున్నారు. అయితే అక్కడ మృతిచెందిన పాడిగేదె లేకపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. అయితే పెద్దపులి సుమారు 100 మీటర్ల దూరానికి గేదె కళేబరాన్ని లాక్కుని వెళ్లినట్లు గుర్తించారు. ఈ పరిసరాల్లో పులి సంచారం తెలుసుకునేందుకు టార్చ్‌లైట్‌ వేయగా సరిగ్గా 5 మీటర్ల దూరం వ్యవధిలో గేదె కలేబరాన్ని పులి తింటున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అటవీ సిబ్బంది ఒక్కసారిగా భయపడి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఈ విషయంపై మంగళవారం ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ అప్పావ్‌ను వివరణ కోరగా పాడిగేదెలపై పెద్దపులి దాడి వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే ఈ ఘటన కోర్‌ అటవీ ప్రాంతంలో జరగడం వల్ల ఎలాంటి సమస్య లేదని తెలిపారు. అయినప్పటికీ పులి కదలికలపై నిఘా ఉంచామని, పాడి గేదెలను చంపిన పులి చాలా ఆరోగ్యంగానే ఉందన్నారు. అందువల్లే సుమారు 400 కిలోల పైగా బరువు ఉండే గేదెను 100 మీటర్ల దూరం లాక్కెళ్లిందని అన్నారు. పశువుల కాపర్లు కూడా కోర్‌ అటవీ ప్రాంతంలోకి పాడి పశువులను తీసుకెళ్లవద్దని ఆయన సూచించారు.

Updated Date - Aug 18 , 2026 | 11:10 PM