Share News

ప్రజల్లో ఉండే వారికే టికెట్లు..!

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:28 PM

‘కుటంబ నేపథ్యం చూసో.. పాత పరిచయాలు ఆధారంగానో.. ఫలాన వాళ్లతో బాగా మాట్లాతున్నాననో రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కుదరు.

ప్రజల్లో ఉండే వారికే  టికెట్లు..!

పరిచయాలు.. కుటుంబ నేపథ్యం చూసేది లేదు

పనితీరు ప్రాతిపదికనే భవిష్యత్తు

జిల్లా ప్రజా ప్రతినిధులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు క్లాస్‌

ఎమ్మెల్యేలకు 20 నెలల ప్రోగ్రెస్‌ సీల్డ్‌ కవర్‌ నివేదికలు

అభివృద్ధి పనులపై చంద్రబాబుకు విన్నపాలు

కర్నూలు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘కుటంబ నేపథ్యం చూసో.. పాత పరిచయాలు ఆధారంగానో.. ఫలాన వాళ్లతో బాగా మాట్లాతున్నాననో రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం కుదరు. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాదరణ ఉన్నవాళ్లను పిలిచి టికెట్లు ఇస్తా. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పనితీరుపై ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు, రహస్య విచారణల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నాను. ప్రజల్లో ఉండేవారికే ప్రాధాన్యం ఇస్తాను..!’ అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజాప్రతినిధులతో అన్నారు. 20 నెలల ప్రోగ్రెస్‌ రిపోర్టును సీల్డ్‌ కవర్లలో వారికి చేతుల్లో పెట్టారు. ఇప్పటి వరకు మీ పనితీరు పర్వలేకున్నా.. ఇంకా మారాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడా వెనకపడ్దదీ, ఏఏ లోపాలు ఉన్నదీ గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని సూచనలు చేశారు. సీల్డ్‌ కవర్లలో ప్రోగ్రెస్‌ రిపోర్టులు చూసి పలువురు ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన కనిపించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో సీఎం చంద్రబాబు గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీల్డ్‌ కవరు నివేదికలోని అంశాలను సహచరులతో చర్చికుంటూ మెజార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు మధనపడుతున్న సమాచారం.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేపథ్యంలో అధినేత చంద్రబాబు, యువనేత, మంత్రి నారా లోకేశ్‌ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. విద్య, ఐటీ మంత్రి లోకేశ్‌ ప్రతి రోజు ఒకటి రెండు పార్లమెంట్‌ నియోజకర్గాల పరిధిలో ఉండే ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారితో కలసి ఆత్మీయ భోజనాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు జిల్లాల వారిగా ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జీలతో భేటీ అవుతున్నారు. ఈ భేటీ కలెక్టర్‌, ఎస్పీలను సైతం హాజరు అవుతున్నారు. గురువారం జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరిత, కేఈ శ్యాంబాబు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, డాక్టర్‌ పార్థసారథి, ఆలూరు, మంత్రాలయం ఇన్‌చార్జీలు వైకుంఠం జ్యోతి, మాధవరం రాఘవేంద్రరెడ్డిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలల్లో ప్రజా ప్రతినిధుల పనితీరుపై చంద్రబాబు విశ్లేషించినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా పింఛన్ల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, పత్రికా, మీడియా సమావేశాలు, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారా..? ప్రతిపక్ష పార్టీ నేతల ఆరోపణలను ఎలా తిప్పికొడుతున్నారు..? వంటి అంశాలపై సర్వేల వివరాలతో తయారు చేసిన సీల్డ్‌ కవర్‌ నివేదికలను ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి పార్టీలతో సమన్వయం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.

పరిచయాలు కాదు.. పని తీరే కొలమానం

ప్రజల్లో ఉండేవారికే పిలిచి టికెట్‌ ఇస్తాను అంటూ కొంత కటువుగా సీఎం హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. అధినేత ఆగ్రహంతో సమావేశం హాల్‌ సైలెంట్‌ అయినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన వాళ్లలో ఎక్కువ మంది యువకులే.. నిత్యం ప్రజల్లో ఉండి, ప్రజా ఆంకాక్షల మేరకు పని చేయాలి.. ఎవరి పనితీరు ఎలా ఉందో..? నివేదికలు వస్తున్నాయి.. లోపాలు సరిదిద్దుకొని మారాలని వారికి హితబోధ చేసినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో కొందరిపై సీరియస్‌ అయినట్లు కూడా తెలుస్తోంది. గత ఎన్నికల్లో నాయకులు, అభ్యర్థుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే జిల్లాలో రెండు స్థానాల్లో ఓడిపోయామని, అలాంటి పరిస్థితి ఏ నియోజకవర్గంలో రాకూడదని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల వారిగా ప్రజా ప్రతినిధులు, ఇన్‌చార్జీల పనితీరును రెడ్‌, ఎల్లో, గ్రీన్‌.. జోన్లుగా విభజించారు. ప్రస్తుతం రెడ్‌ జోన్లో లేరు కాని.. ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కష్టపడి పని చేయాలంటూ సూచనలు చేసినట్లు సమాచారం. కొందరిని సుతిమెత్తగా మందలించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు.. విన్నపాలు

సీఎం చంద్రబాబు భేటీ సందర్భంగా జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్‌ చార్జీలు నియోజకవర్గం అభివృద్ధిపై వినతులు ఇచ్చారు. ప్రాధా న్యత రీత్యా పరిష్కారం చేద్దామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలు స్తోంది. కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు రోడ్డును జాతీయ రహదారుల కింద చేర్చి అభివృద్ధి చేయాలని, జిల్లా కేంద్రానికి పశ్చిమ ప్రాంత ప్రజలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు విన్నవించారు. కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి జాతీయ రహదారుల జాబితాలో చేర్చి అభివృద్ధి చేద్దామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరం బీ క్యాంప్‌, సీ క్యాంపు స్థలాల్లో జిల్లాకు ఐకానిక్‌గా ఉండేలా హైకోర్టు బెంచ్‌, నూతన కలెక్టరేట్‌ నిర్మించాలని మంత్రి టీజీ భరత్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించినట్లు తెలిసింది. రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా తుంగభద్రపై గుండ్రేవుల జలాశయం నిర్మించాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి విన్నవించారు. ఆర్డీఎస్‌, వేదవతి ప్రాజెక్టులు, గాజులదిన్నె జలాశయం సామర్థ్యం పెంపు పనులు పూర్తి, పులికనుమ జలాశయం 3.5 టీఎంసీలకు పెంచాలని, తద్వారా జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలు తీరుతాయని ఎమ్మిగనూరు ఎమ్మెల్యేల బీవీ జయనాగేశ్వరరెడ్డి, పత్తికొండ పట్టణం ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు నిధులు ఇవ్వాలని, పత్తికొండ జలాశయం కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఆదోని నియోజకవర్గంలో ప్రాధాన్యత కలిగిన ఐదు పనులపై ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జీలు నియోజకవర్గ సమస్యలను వివరించారు. ప్రజాప్రతినిధులు విన్నపాలు ఆలకించిన చంద్రబాబు నిధులు లభ్యత, ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చేద్దామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 27 , 2026 | 11:28 PM