ముగ్గులొలికే...
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:49 AM
రంగురంగుల ముగ్గుతో ఇలపై హరివిల్లు వాలింది. చక్కనైన ముగ్గుల అలంకరణతో భూమాత పులకించింది.
‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీకి విశేష స్పందన
రంగుల హరివిల్లుగా మారిన నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు
ఉత్సాహంగా సాగిన రంగవల్లుల పోటీలు
రాయలసీమ కళలు సాహిత్యానికి పుట్టినిల్లు
శ్రీఅరుణభారతి వ్యవస్థాపకుడు బీసీ రాజారెడ్డి
నంద్యాల కల్చరల్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రంగురంగుల ముగ్గుతో ఇలపై హరివిల్లు వాలింది. చక్కనైన ముగ్గుల అలంకరణతో భూమాత పులకించింది. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా? అన్న రీతిలో అతివలు వేసిన ముగ్గులతో అవని పులకించింది. ఆధ్మాత్మికంగా, సందేశాత్మకంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దిన ముగ్గులు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముగ్గు పిండిని చుక్క, చుక్కను కలుపుకుంటూ మహిళలు సృజనాత్మకత, సంప్రదాయ బధ్దమైన భావాలతో తీర్చిదిద్దన ముగ్గులన్నీ సప్తవర్ణ శోభితంగా ఒదిగిపోయాయి. మహిళలలోని కళాత్మక భావాలకు నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు వేదికగా నిలిచింది. సోమవారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో పవర్డ్ బై సన్‌ఫీ్‌స్ట మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్, బెస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగర్‌బత్తీ సహకారంతో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు, యువతుల నుంచి విశేష స్పందన వచ్చింది. సప్తవర్ణ శోభితంగా మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి.