Share News

విషాదం మిగిల్చిన యాత్ర

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:21 AM

ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ఉన్న చిన్న కుమార్తె ఇండియాకు రావడంతో ఆ వృద్ధు దంపతులు సంతోష పడ్డారు. అల్లుడు, కూతురు, మనవళ్లతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. ఐదు రోజుల పాటు సంతోషంగా గడిపారు. స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. మరి కొన్ని గంటల్లో వారు స్వస్థలానికి చేరుకునే వారు. అంతలోనే విధి వక్రీకరించింది. వారు ప్రయాణిస్తున్న కారు ఒక్క సారిగా అదుపు తప్పింది. క్షణాల్లో ముగ్గురి ప్రాణాలు అనంత వాయువులోకి కలిసి పోయాయి. కళ్లెదుటే భార్య, అత్త మామలు మృత్యువాత పడటంతో భర్త, మనవడు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని గొల్లర హట్టి గేట్‌ వద్ద చోటుచేసుకోగా మృతులంతా ఆదోని పట్టణ వాసులు.

విషాదం మిగిల్చిన యాత్ర
అదుపు తప్పి గుంతలో పడిన కారు

తెరుచుకోని ఎయిర్‌ బ్యాగ్‌లు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం

మరో ముగ్గురికి తీవ్రగాయాలు

కర్ణాటకలోని గొల్లరహట్టి గేట్‌ వద్ద ఘటన

మృతులంతా ఆదోని ఎస్కేడీ కాలనీ వాసులు

ఆదోని, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆ విహార యాత్ర వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరులో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆదోని పట్టణంలోని ఎస్కేడీ కాలనీ అమృత అపార్ట్‌మెంట్‌లో నివసించే గజేశ్వర్‌రెడ్డి(65), ఇందిరమ్మ(55) దంపతులు కాపురం ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె సౌమ్య(35)ను సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి చార్వి, చరిత్‌రెడ్డి అనే ఇద్దరు చిన్నారులు సంతానం. విదేశాల్లో ఉంటున్న సౌమ్య భర్త, పిల్లలతో కలసి తల్లిదండ్రులను చూసేందుకు మే 30న ఇండియాకు వచ్చింది. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఊటీతో పాటు ఆలయాలు, పలు పర్యాటక ప్రదేశాలకు వెళ్లారు. పిల్లలు, మనవళ్లతో గజేశ్వర్‌ రెడ్డి, ఇందిరమ్మ సంతోషంగా ఐదు రోజులు గడిపారు. యాత్ర ముగించుకుని సొంతూరైన ఆదోనికి ఇన్నోవా వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. మరో కొన్ని గంటల్లో ఇంటికి చేరుతామన్న ఆనందంలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లా గొల్లరహట్టి గేట్‌ వద్ద వారి కారు ప్రమా దానికి గురైంది. ముందుగా వెళ్తున్న ఓమ్నీ వాహనాన్ని ఇన్నోవా బలంగా ఢీకొంది. దీంతో కారు సమీపంలోని గుంతల్లోకి దూసుకెళ్లి పొలాల్లో బోల్తా పడింది. వాహనం ముందు సీట్లలో ఉన్న ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అల్లుడు రవికుమార్‌, మనవడు చరిత్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ మధ్య సీట్లో కూర్చున్న గజేశ్వర్‌రెడ్డి, ఇందిరమ్మ, కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు. వారు కూర్చున్న వైపు ఎయిర్‌ బ్యాగులు సాంకేతిక కారణాలతో తెరుచుకోలేదు. అత్తమామలతో పాటు భార్య మృతదేహాన్ని చూసిన రవికుమార్‌ బిడ్డలను దగ్గరకు తీసుకుని బోరున విలపించడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఆదోనికి తరలిస్తారని బంధువులు తెలిపారు. హులియూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి

ఈ ప్రమాదంలో కారులో ఉన్న చిన్నారి చార్వి వెన్నెముక విరిగి రక్తపు మడుగులో పడి నరకయాతన అనుభవించింది. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన చిన్నారి బెంగళూరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. అల్లుడు రవికుమార్‌, మనవడు చరిత్‌రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సకాలంలో ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో బతికి బయటపడ్డారు.

మిన్నంటిన రోదనలు

ఆదోని కొత్త బస్టాండ్‌ సమీపంలోని రాచప్ప కాంప్లెక్స్‌లో కోళ్ల ఫామ్‌ నడుపుకుంటూ అందరితో ఎంతో మర్యాదగా, అప్యాయంగా ఉండే గజేశ్వర్‌రెడ్డి కుటుంబం ఇలా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయిందన్న వార్త ఆదోని పట్టణాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. అమృత అపార్ట్‌మెంట్‌ పరిసరాల్లో బంధువులు, స్థానికుల రోదనలతో మిన్నంటింది.

Updated Date - Jun 05 , 2026 | 12:21 AM