Share News

సూగూరుకు ముప్పు

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:51 PM

మంత్రాలయం మండలంలోని వగరూరు సమీపంలో నిర్మించిన గురురాఘవేంద్ర సూగూరు రిజర్వాయర్‌కు ముప్పు పొంచి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం చెరువులు, రిజర్వాయర్‌లు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులకు పైసా నిధులు కేటాయించకపోవడంతో రిజర్వాయర్‌ కట్టపై ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు మొలిచి పగుళ్లు ఏర్పడ్డాయి.

సూగూరుకు ముప్పు
రిజర్వాయర్‌ కట్ట కుంగిన దృశ్యం

ఏటా వర్షం పడగానే రిజర్వాయర్‌కు గండి

నాలుగు చోట్ల గండిపడినా కొరవడిన ఇరిగేషన్‌ అధికారుల పర్యవేక్షణ

తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్న అధికారులు

మంత్రాలయం, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం మండలంలోని వగరూరు సమీపంలో నిర్మించిన గురురాఘవేంద్ర సూగూరు రిజర్వాయర్‌కు ముప్పు పొంచి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం చెరువులు, రిజర్వాయర్‌లు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మరమ్మతులకు పైసా నిధులు కేటాయించకపోవడంతో రిజర్వాయర్‌ కట్టపై ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు మొలిచి పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రతి ఏడాది వర్షం పడితే చాలు రిజర్వాయర్‌ కట్టకు గండి పడడం రైతులు ఇసుక బస్తాలతో తాత్కాలికంగా పూడ్చుతూ వస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు తప్ప ఇరిగేషన్‌ అధికారులు రిజర్వాయర్‌ భద్రతపై కన్నెత్తి చూడటం లేదు. 2002లో టీడీపీ ప్రభుత్వం ఈ రిజర్వాయర్‌ను 135 ఎంసీఎఫ్‌టీ నీటి సామర్థ్యంతో నిర్మించారు. వగరూరు, వి తిమ్మాపురం, బూదూరు, సూగూరు, చెట్నహళ్లి గ్రామాలకు చెందిన 2,125 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ జలాశయాన్ని నిర్మించారు. అయితే రిజర్వాయర్‌కు చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపంతో చెరువుకు ముంపు పొంచి ఉంది. ఈ ఏడాది ఒకసారి కురిసిన వర్షానికే చెరువు నిండి కడగొమ్మ ఎత్తిపోస్తూ వాగులో కలుస్తున్నాయి. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి రిజర్వాయర్‌ నిండుకుంది. అయితే ఆదివారం సాయంత్రం వగరూరు, తిమ్మాపురం రైతులు గుర్తించి హుటాహుటిన రిజర్వాయర్‌ దగ్గర గండిపడిన ప్రాంతంలో తాత్కాలికంగా మరమ్మతు చేశారు. కట్టకు పడిన రంధ్రం నుంచి కిందికి వస్తున్న నీటిని పరిశీలించి అక్కడ ఉన్న ముళ్లకంపలను తొలగించి ఇసుకబస్తాలు, కంకర, రేకులతో పూడ్చే ప్రయత్నం చేపట్టారు. ప్రస్తుతం రిజర్వాయర్‌ కట్టకు మూడు చోట్ల రంధ్రాలు పడి, వాటి నుంచి నీరు కిందికి ప్రవహిస్తోంది. రిజర్వాయర్‌కు పడిన గండిని చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఎల్లెల్సీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. చీకట్లోనే ఆలస్యం చేయకుండా గ్రామస్థులే చేయి చేయి కలిపి తాత్కాలికంగా పూడ్చే ప్రయత్నాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న వీఆర్‌వో ప్రభాకర్‌, ఇరిగేషన్‌ డీఈ విద్యాసాగర్‌, ఏఈ పరమేష్‌, మంత్రాలయం సింగిల్‌ విండో అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున, వైసీపీ జిల్లా కార్యదర్శి సీవీ విశ్వనాథ రెడ్డి, కాంత్‌రెడ్డి, షాకీర్‌ దొర, మాజీ సర్పంచు లింగా రెడ్డి, టీడీపీ నాయకులు అబ్దుల్లా, పవన్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌ ఆధ్వర్యంలో రాత్రంతా అతి కష్టంతో ఎక్స్‌కవేటర్‌ సాయంతో రిజర్వాయర్‌ కట్టకు పడిన గండిని పూడ్చారు. అయితే సమీపంలో సోమవారం మరో భారీ గండి పడింది. ఈ గండి నుంచి దాదాపు రెండు క్యూసె క్కుల నీరు కిందకు వృథాగా పోతు న్నాయి. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహణ కార్యదర్శి పాలకుర్తి తిక్కారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘ వేంద్రరెడ్డి, ఆదేశాలతో రెండు యంత్రాలు, పది ట్రాక్టర్లు సహాయంతో మట్టితో గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాయంత్రం వరకు గండి పూడ్చుతున ్నప్పటికీ అదుపులోకి రాకపోవడంతో కడగొమ్మను ధ్వంసంచేసి రిజర్వాయర్‌లోని నీరు వాగులోకి వదులుతున్నారు. ప్రతి ఏడాది గండి పడినా తాత్కాలికంగా పనులుచేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చేపట్టడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్‌ కట్టకు పేరుకుపోయిన ముళ్లకంపను తొలగించి వేసవి కాలంలో మరమ్మతులు చేపట్టి రిజర్వాయర్‌ భద్రతకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎల్లెల్సీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రిజర్వాయర్‌కు గండి

ఎల్లెల్సీ ఇరిగేషన్‌ అధికారులు నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగానే సూగూరు రిజర్వాయర్‌కు ప్రతి ఏడాది గండి పడుతోంది. ఇరిగేషన్‌ అధికారులు చేయని పనులకు బిల్లులు చేసుకుంటూ కట్టకు మరమ్మతులు విస్మరించారు. వేసవి కాలంలో కట్టకున్న ముళ్లకంపలను తొలగించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడటం లేదు.

- తిక్కారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

రిజర్వాయర్‌ మరమ్మతులకు

రూ.2.20 కోట్లు ప్రతిపాదనలు పంపాం

22 ఏళ్ల ప్రాజెక్టు కావడంతో రిజర్వాయర్‌ కట్ట కుంగిందని దాని మరమ్మతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గత ఏడాది మే నెలలో రూ.2.20 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపాం. అయితే ఇప్పటికీ నిధులు రాకపోవడంతో రైతులు, నాయకులు సహకారంతో గండిపడిన ప్రతిసారి తాత్కాలిక మరమ్మతులు చేస్తూ కాపాడుతున్నాం. నిధులు కొరత కారణంగానే రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో శాశ్వత పనులు చేయలేకపోతున్నాం.

- విద్యాసాగర్‌, డీఈ, ఇరిగేషన్‌

Updated Date - Jun 15 , 2026 | 11:51 PM