ఆదోనిలో ఆ నలుగురు!
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:19 PM
దేశమంతా ధర పెరుగుతున్న పసిడి వైపు చూస్తుంటే ఆదోనిలో మాత్రం బంగారంలాంటి ఇసుక వైపు అందరి కళ్లూ పడ్డాయి.
అక్రమ ఇసుక డంపులు
అధికార పార్టీ నేతల అడ్డగోలు దోపిడీ
వైసీపీ నేతకూ నాలుగో వాటా!
గుడికంబాలి నుంచి తుంగభద్ర ఇసుక తరలింపు
ట్రాక్టర్ ఇసుక రూ.3,500 పైమాటే
ఉచిత ఇసుక పాలసీకి తూట్లు
ఆందోళనలో భవన నిర్మాణదారులు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు
దేశమంతా ధర పెరుగుతున్న పసిడి వైపు చూస్తుంటే ఆదోనిలో మాత్రం బంగారంలాంటి ఇసుక వైపు అందరి కళ్లూ పడ్డాయి. ఎంతమంది కళ్లు పడినా ఫలాలు దక్కేది మాత్రం ఆ నలుగురికే. విలువైన ఇసుకను అడ్డగోలుగా దోచేయడంలో గత వైసీపీ ప్రభుత్వ నేతలకు కూటమి పార్టీల నేతలు ఏమాత్రం తీసిపోవడం లేదు. వాళ్లు అంత దోచేస్తే.. అంతకుమించి చేసి చూపిస్తాం అంటున్నారు. ఫలితంగా ఇసుకలో ప్రతి నెలా లక్షలాది రూపాయల సొమ్ము నేతల ఇళ్లకు చేరుతోంది. కూటమిలోని పార్టీ నేతలతో పాటు భవిష్యత్తులో అడ్డుతగలకుండా ఉండేందుకు వైసీపీకి కూడా ఓ వాటా ఇచ్చేశారు. మొత్తం మీద వైసీపీతో కలిసి కూటమి పార్టీ నేతలు యథేచ్ఛగా ఇసుక దందా చేస్తున్నారని నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కర్నూలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక బంగారమైంది. ఫలితంగా నిర్మాణ రంగం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కరువై ఆర్థికంగా చితికిపోయారు. ధనాపేక్షతో వైసీపీ నాయకులు కొందరు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగించి రూ.కోట్లు దోచేయడంతో సామాన్యుడి సొంతింటి నిర్మాణం కలగానే మిగిలింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే ఉచితంగా ఇసుక ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక పాలసీ అమలు చేపట్టారు. రీచ్‌ల్లో కేవలం లోడింగ్ మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ధనాపేక్షతో కూటమి నాయకులు కొందరు ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడుస్తున్నారు. తుంగభద్ర రీచ్‌ల నుంచి ఇసుక తరలించి.. ఆదోనిలో అక్రమంగా డంపు చేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కో ట్రాక్టరు రూ.3,500కు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భాగో తంలో అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీ నాయకులకు నెల మామూళ్లు అందుతున్నా యనే ఆరో పణలు బలంగా ఉన్నాయి. దీనిపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదులు సైతం వెళ్లాయి.
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో మాత్రమే ఇసుక రీచ్‌లను గుర్తించారు. కౌతాళం మండలం నదిచాగి వద్ద 9.8 హెక్టార్లు, గుడికంబాళి గ్రామం వద్ద 10 హెక్టార్లు, మరళి గ్రామం వద్ద 5 హెక్టార్ల ఇసుక ఓపన్ రీచ్‌లు గుర్తించారు. ఇక్కడి నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లకు ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నారు. అయితే.. నదిలో ఇసుకను టిప్పర్‌కు లోడ్ చేసేందుకు టన్నుకు రూ.40 ధర జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. మైనింగ్ అధికారులు టెండర్లు ద్వారా కాంట్రాక్టరుకు అప్పగించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఉచిత ఇసుక పాలసీ’ వల్ల టన్నుకు రూ.40 చొప్పున 18 టన్నులు టిప్పర్‌కు రూ.720.. 20 టన్నులకు టిప్పరుకు రూ.800 మాత్రమే చెల్లించాలి. ఇసుక రీచ్‌ను ట్రాక్టరు లేదా టిప్పరు బాడుగ లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. 20 కిలో మీటర్ల వరకు ఆరు టైర్ల టిప్పరు (10 టన్నులు)కు రూ.2 వేలు, 10 టైర్ల లారీ (18 టన్నులు)కి రూ.3,600, 12 టైర్ల లారీ (22 టన్నులు)కి రూ.3,820 రవాణా చార్జీ నిర్ణయించారు. 20 కిలో మీటర్లు దాటితే.. ఒక కిలో మీటరుకు టన్నుకు రూ.8 రవాణా చార్జీ కింద తీసుకోవచ్చని జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది. ఈ లెక్కన.. కౌతాళం మండలం నదిచాగి, గుడికంబాళి, మరళి ఇసుక రీచ్‌ల నుంచి ఆదోనికి దాదాపు 45-50 కిలోమీటర్లు దూరం ఉంటుంది. జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం 18 టన్నులు టిప్పరు ఇసుక ఆదోని పట్టణంలోని లబ్ధిదారులకు సరఫరా చేయాలంటే.. లోడింగ్ చార్జి ఒక టన్నుకు రూ.40 ప్రకారం 18 టన్నులకు రూ.720, 20 కిలో మీటర్ల వరకు రవాణా చార్జీ రూ.3,600, ఆపైన టన్నుకు కిలోమీటరుకు రూ.8 ప్రకారం 30 కిలోమీటర్లకు రూ.4,320 కలిపి రూ.8,640కు మించకూడదు. అయితే.. ఇసుక రీచ్‌ల వద్ద కూడా ఒక్కో టిప్పరుకు రూ.1,500 నుంచి రూ.2 వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ డంపు.. ఆపై దోపిడీ..
కౌతాళం మండలం నదిచాగి, గుడికంబాళి, మరళి ఇసుక రీచ్‌ల నుంచి టిప్పర్ల ద్వారా ఆదోని పట్టణానికి తరలించిన ఇసుకను బైపాస్ రోడ్డులో ఖాళీ స్థలంలో అక్రమంగా డంపు చేస్తున్నారు. అక్కడి నుంచి ట్రాక్టరు రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు విక్రయిస్తున్నారు. టిప్పరు ఇసుక ఐదు ట్రాక్టర్లతో సమానం. అంటే.. ఒక టిప్పరు సరాసరి రూ.20వేలకు విక్రయిస్తున్నారనే ఆరో పణలు బలంగా ఉన్నాయి. నేరుగా టిప్పరు ఇసుక కావాలంటే రూ.14-15 వేలు వసులు చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 18-20 టన్నుల టిప్పరు ఇసుక రూ.18-20 వేలకు సరఫరా చేసేవారు. అందులో టన్ను రూ.475 ప్రకారం రూ.8,550 నుంచి రూ.9,500 ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించేవారు.అంటే.. లోడింగ్, రవాణా చార్జీలు కలిపి రూ.8-10 వేలు తీసుకునేవారు. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ‘ఉచిత ఇసుక పాలసీ’ అమలులోకి తెచ్చింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన టన్నుకు రూ.475 పూర్తిగా రద్దు చేసింది. కేవలం లోడింగ్, రవాణా చార్జీలు మాత్రమే తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇసుక అక్రమ డంప్, అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలు కలెక్టర్ చైర్మన్‌గా ఉండే జిల్లా ఇసుక కమిటీకి అప్పగించింది. ఇందుకు విరుద్ధంగా ఆదోనిలో ఇసుక అక్రమ డంప్ చేయడంతో పాటు టిప్పరు రూ.14-15 వేల వరకు వసులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక్కో టిప్పరుపై సరాసరి రూ.3-4 వేలు, ట్రాక్టరుపై రూ.వెయ్యి నుంచి రూ.1,500 అధికంగా, అక్రమంగా వసులు చేస్తున్నారు. ఇదంతా ఇసుక సిండికెట్ మాఫియా నడిపిస్తుందనే స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భాగోతంలో అధికార కూటమి, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఓ నాయకుడికి కూడా ప్రతి నెలా మాముళ్లు ముట్టజెప్పుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా తోడు కావడంతో నాలుగోవాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆదోనిలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది.
మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు
ఆదోని కేంద్రంగా సాగుతున్న ఇసుక మాఫియాపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత వైసీపీ హయాంలో ఇసుక రూపంలో దోపిడి చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక పాలసీ ద్వారా సామాన్యులకు ఇసుక అందుబాటు ధరకు వస్తుందనుకుంటే, కూటమి నేతలు ఉచిత ఇసుక పాలసీకి తూట్లు పొడుస్తున్నారని లోకేశ్‌కు వెళ్లిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదోనిలో అక్రమంగా ఇసుక డంప్ చేసి ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారని, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకొని సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని ఆ ఫిర్యాదులో వివరించినట్లు తెలుస్తుంది. దీనిపై మైనింగ్ డీడీ వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించిగా అందుబాటులోకి రాలేదు.