పశ్చిమాన దాహం
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:23 PM
ఆలూరు మండలం మొలగవెళ్లి, ఎం కొట్టాల గ్రామాలకు నెల రోజులకు పైగా తాగునీరు అందడం లేదు. దాహం తీర్చుకోవడానికి జనం నానా అవస్థలు పడుతున్నారు. బోరుబావుల నీటిని కొనుగోలు చేయాల్సిన దైన్య పరిస్థితి ఉంది.
ఆలూరు నియోజకవర్గంలో నెల రోజులైనా అందని తాగునీరు
వందేళ్ల కిందటి వక్రేణి, పురాతన బావి నీళ్లే దిక్కు
మొలగవెళ్లి, జొహరాపురం, కొట్టాల గ్రామాల్లో దారుణ పరిస్థితి
ఆర్‌డబ్ల్యూఎస్ ఆఫీసు ముట్టడి
ఆలూరు మండలం మొలగవెళ్లి, ఎం కొట్టాల గ్రామాలకు నెల రోజులకు పైగా తాగునీరు అందడం లేదు. దాహం తీర్చుకోవడానికి జనం నానా అవస్థలు పడుతున్నారు. బోరుబావుల నీటిని కొనుగోలు చేయాల్సిన దైన్య పరిస్థితి ఉంది. మాకు తాగునీళ్లిచ్చి ప్రాణాలు కాపాడండి.. నలభై రోజులగా తాగునీరు అందడం లేదు.. మండుటెండల్లో బిందెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామంటూ మొలగవెళ్లి కొట్టాల (ఎం. కొట్టాల) గ్రామ ప్రజలు శుక్రవారం ఆలూరు డివిజన్ ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ముట్టడిం చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో చేశారు. అంటే.. ఆ పల్లెల్లో నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది. ఎం. కొట్టాల గ్రామంలోనే ఒక్కటే కాదు.. కర్ణాటక సరిహద్దున ఉన్న ఆలూరు నియోజకవర్గంలో ఏ పల్లెకు వెళ్లినా తడారిన గొంతులు దాహంతో తల్లడిల్లుతు న్నాయి. పలు గ్రామాల్లో తాతల కాలంలో తవ్విన వక్రేణి (వర్షపు నీటి నిల్వ కుంట), పురాతన బావుల నీళ్లతోనే దాహం తీర్చుకోవాల్సి వస్తోంది.
కర్నూలు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు నియో జకవర్గం. కర్ణాటక సరి హద్దులో ఉండడంతో పాలకుల నిర్లక్ష్యం, జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపం కలిసి ఈ రోజుకూ మంచి నీటి కోసం రోడ్లెక్కవలసి వస్తున్నది. గత కాలంలో తాగునీటి కోసం తవ్వుకున్న వక్రేణిలు, దిగుడు బావులపై ఆధారపడాల్సి రావడం తాగునీటి దారుణ పరిస్థితికి దర్పణం పడుతోంది. ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, ఆస్పరి, హొళగుంద మండలాల్లో మెజార్టీ పల్లె సీమల్లో దాహం కేకలు వి నిపిస్తున్నాయి. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) సరిహద్దులోనే ప్రవహిస్తున్నా బిందెడు నీటి కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తోంది. బాపురం, చింతకుంట, ఖాజీపేట, విరుపాపురం, సమ్మతగేరి, హొళ గుంద, హెబ్బటం, ఆస్పరి.. వంటి సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ఉన్నా.. శివారు గ్రామాలకు తాగునీరు అందని ద్రాక్షగా మారింది. కాలం చెల్లిన తాగునీటి పథకాలు, నిర్వహణలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రధాన కారణమనే ఆరోపణలు లేకపోలేదు. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ)కు అనుసంధానంగా 1974-75 మధ్యలో బాపురం సమగ్ర రక్షిత మంచినీటి పథకం (సీపీడబ్ల్యూఎస్) నిర్మించారు. ఈ స్కీం నుంచి నియోజకవర్గం కేంద్రం ఆలూరు, హాలహర్వి, మొలగవెళ్లి, జొహారాపురం, ఆగ్రహారం సహా 26 గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. 30 ఏళ్ల జనాభాకు అనుగుణంగా పథకాన్ని డిజైన్ చేశారు. ఇప్పటికీ 50 ఏళ్లు దాటింది. జనాభా నాలుగింతలు పెరిగింది. అందుకు అనుగుణంగా 1995లో రెండో ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్మించారు. 2009లో రూ.8 కోట్లతో పైపులైన్లు ఆధునికీకరణ చేశారు. అయినా.. మొలగవెళ్లి, ఎం. కొట్టాల, కె.కొట్టాల, జొహరాపురం వంటి శివారు గ్రామాలకు నెలలో రెండు మూడు రోజులు కూడా తాగునీరు అందడం లేదు. బావులు, వక్రేణిల్లో రంగు మారిన నీరు తాగలేక కొందరు ఒక డ్రమ్ము బోరుబావి నీటిని (పది బిందెలు) రూ.50-100లకు కొనుగోలు చేస్తున్నారు.
ఏ పల్లెకు వెళ్లినా కన్నీటి కష్టాలు
నియోజకవర్గం కేంద్రం ఆలూరు పట్టణంలో 27 వేలకు పైగా జనాభా ఉంది. పది పదిహేను రోజులకోసారి తాగునీరు ఇస్తున్నారు. అదికూడా గంటా రెండు గంటలు మాత్రమే అని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో కుళాయిల వద్ద జలజగడం తప్పడం లేదు. ఆస్పరి మండలం జొహరాపుం గ్రామ జనాభా 9,500 పైగా ఉంది. ఈ గ్రామానికి కూడా బాపురం రక్షిత మంచినీటి పథకం నుంచి 15-20 రోజలకు ఒకసారి అది కూడా అర్థరాత్రి 12, ఒంట గంట మధ్యలో ఇస్తుండడంతో కాళరాత్రిలో బిందెడు నీటి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఈ ఊరిలో పురాతన వర్షపు నీటి నిల్వ కుంట నీటితో ఇప్పటికీ దాహం తీర్చుకుంటున్నారంటే ఎంతటి దుర్భరమైన పరిస్థితి ఉందో ఇట్టే తెలుస్తోంది. ఈ తాగునీటి అవస్థలు చూసి తమ ఊరితో వివాహ సంబంధాలకు సిద్ధం కావడం లేదని గ్రామానికి చెందిన మల్లేశప్ప అనే వ్యక్తి అన్నాడు. నగరూరు గ్రామానికి ఆస్పరి రక్షిత మంచినీటి పథకం (ఆదోని మండలం నాగనాథనహల్లి) నుంచి శుద్ధి చేసిన తాగునీరు అందించాల్సి ఉంటే, జనవరి నుంచి ఈ రోజు వరకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఇచ్చారని విజయగోపాల్ వ్యక్తి వాపోయారు. జిల్లా పశ్చిమ ప్రాంతం పల్లెసీమల్లో ఏ పల్లెకు వెళ్లినా, ఎవరికి కదిపినా బిందెడు నీటి కోసం పడుతున్న క‘న్నీటి’ కష్టాలను వివరిస్తున్నారు.
అమలుకు నోచుకోని లోకేశ్ పాదయాత్ర హామీ
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్షంలో ఉండగా యువగళం పేరిట పాదయాత్ర చేశారు. జిల్లాలో ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో జనం పడుతున్న తాగునీటి ఇబ్బందులను కళ్లారా చూశారు. జిల్లా పశ్చిమ ప్రాంతం కరువు, వలసలు, తాగునీటి అవస్థలపై అసెంబ్లీ సహా పలు వేదికల్లో వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నీటి కష్టాలు తీరుతాయని ఆ ప్రాంతం ప్రజలు ఆశించారు. రాబోయే జూన్ 12కు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతుంది. పశ్చిమ ప్రాంత ప్రజల క‘న్నీటి’ కష్టాలు మాత్రం తీరలేదు. వివిధ జలాశయాల నుంచి రక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్‌లో భాగంగా వాటర్‌గ్రిడ్ కింద రూ.2,950 కోట్లలో పంపిన ప్రతిపాదనలు అటకెక్కాయి. తాజాగా జలజీవన్ మిషన్ కింద 53 పనులకు రూ.120 కోట్లతో ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రాధాన్యతగా తీసుకొని నిధులు మంజూరు చేయాల్సి అవసరం ఉంది. ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి ఒక్కటే రూ.6.7 కోట్లు మంజూరైనా టెండర్ల దశలోనే కొట్టుమిట్టాడుతోంది. జిల్లా మంత్రి టీజీ భరత్, ఇన్‌చార్జి మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పశ్చిమ ప్రాంతం తాగునీటి కష్టాలను సీఎం చంద్రబాబు, సంబంధిత శాఖ చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించాలని పలువురు కోరుతున్నారు.
మా క‘న్నీటి’గోడు వినేదెవరు..?
కర్ణాటక సరిహద్దున జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మా క‘న్నీటి’ కష్టాలు అధికారులు, పాలకులకు కనిపించడం లేదు. నెల రోజులుగా తాగునీరు సరఫరా చేయడం లేదు. ఎప్పుడో వందేళ్ల క్రితం పూర్వీకులు తవ్వించిన అతి పురాతనమైన బావినీరు ఆకుపచ్చగా మారాయి. ఆ నీటితో దాహం తీర్చుకుంటున్నాం. ఊళ్లోకి వచ్చి నీరు అమ్ముతున్నారు. ట్యాంకరు నీళ్లు రూ.300-400కు, డ్రమ్ము నీరు రూ.50-100 కొనుక్కుంటున్నాం. అధికారులు స్పందించి కనీసం వారంలో రెండు మూడు రోజులైనా పుష్కలంగా తాగునీరు సరఫరా చేయాలి.
- కె. రామాంజనేయులు, మొలగవెళ్లి గ్రామం, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా:
జల్‌జీవన్ మిషన్ కింద ప్రతిపాదనలు పంపాం
ఆలూరు నియోజకవర్గంలో మొలగవెళ్లి, జొహరాపురం గ్రామాలతో పాటు వివిధ గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నమాట నిజమే. 53 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించడానికి జల్‌జీవన్ మిషన్ కింద రూ.120 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. జొహరాపురం గ్రామానికి రూ.6.70 కోట్లు మంజూరు అయ్యాయి. జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తుంగభద్ర దిగువ కాలువకు డ్యాం నుంచి నీరు విడుదల చేశారు. ఎస్‌ఎస్ ట్యాంకుల్లో నిల్వ చేసి శివారు గ్రామాలకు కూడా తాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం.
- మనోహర్, ఎస్‌ఈ, గ్రామీణ తాగునీటి విభాగం, కర్నూలు:
తాగు నీరు లేక 40 రోజులు
ఆలూరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): 40 రోజులు గడిచినా చుక్కనీరు సరఫరా చేయకపోతే ఏం తాగి బతకాలి? అధికారులకు తమ సమస్య కనిపించదా? అని ఆలూరు మండలం ఎం. కొట్టాల గ్రామస్థులు శుక్రవారం ఖాళీ బిందెలతో ఆలూరుకు తరలివచ్చి నిరసనకు దిగారు. గంటపాటు మండుటెండల్లో కూర్చొని నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో అధికారులు భయపడి బయటకు పరుగులు తీశారు. కార్యాలయానికి తాళాలు వేసి డీఈ మల్లికార్జున, ఏఈ రామ్‌లీలాను వెంబడించి చుట్టుముట్టి దిగ్బంధం చేసి అధికారులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బాపురం రిజర్వాయర్ కాంట్రాక్టర్ రవిరెడ్డి, గంగాధర్‌రెడ్డిపై ఆగ్రహంతో దాడికి యత్నించారు. ఈ సందర్భంగా గ్రా మస్థులు మాట్లాడుతూ దళిత గ్రామం కావడం వల్లే తమ ఊరిని అధికారులు నిర్లక్ష్యంగా చూస్తున్నారని, 40రోజులు గడిచినా తాగునీరు అందడం లేదని ఆగ్రహించారు. తాగునీరు సరఫరా చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని ఎందుకు సరఫరా చేయడంలేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్, వాటర్‌మెన్ నిర్లక్ష్యమంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో గ్రామస్తులు నినాదాలు చేశారు. నీరే సరఫరా కానప్పుడు వాటర్‌మెన్ ఏం చేస్తాడని ప్రశ్నించారు. నీటి సమస్యను పరిష్కరించే వరకు ఇక్కడి నుంచి కదలబోమని తేల్చి చెప్పారు. నీటి సరఫరాకు తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కొట్టాల రాజు, రామాంజినేయులు, బంకా రామాంజనేయులు, గోవిందురాజులు, నౌనేపాటి, శరమంద రాజి, భాస్కర్, ఏరూరు ఆనంద్, ప్రహ్లాద్ పాల్గొన్నారు.