2న మూడో విడత
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:11 PM
సం‘గ్రామం’ ముగింపు దశకు చేరుకుంది. మొదటి విడత సమరం ఎనిమిది మండలాల్లో గురువారం ముగిసింది. రెం డో విడత పల్లె పోరు ఆదివారం జరగనుంది.
ముగిసిన నామినేషన్ల విత్డ్రా గడువు
26 మంది సర్పంచులు, 379 వార్డు సభ్యులు ఏకగ్రీవం
124 సర్పంచ్ స్థానాలకు 426 మంది.. 1,215వార్డులకు 2,915 మంది అభ్యర్థులు
రేపు రెండో విడత సం‘గ్రామం’ తీర్పు
సం‘గ్రామం’ ముగింపు దశకు చేరుకుంది. మొదటి విడత సమరం ఎనిమిది మండలాల్లో గురువారం ముగిసింది. రెం డో విడత పల్లె పోరు ఆదివారం జరగనుంది. మూడో విడతలో కీలకమైన నామినేషన్ల ఉప సంహరణ శుక్రవారం ము గిసింది. డిసెంబరు 2న ఓటర్ల తీర్పు ఉంటుంది. ఎన్నికలు జరిగే 150 పంచాయతీల్లో 26 సర్పంచ్ స్థానాలు, 379 వా ర్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 సర్పంచ్ స్థానాలకు 426 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 1,215 వా ర్డులకు 2,915 మంది పోటీకి సై అంటున్నారు. రెండో విడతలో అత్యంత కీలకమైన ఓటర్లు తీర్పు రేపే. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆధ్వర్యంలో ఎన్నికల యంత్రాంగం ఒక వైపు రెండో విడత పోలింగ్ ఏర్పాట్లు, మరో వైపు మూడో విడత ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.
కర్నూలు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్చంద్ర పునేఠా షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడత ఆదోని, పత్తికొండ రెవిన్యూ డివిజన్లలోని ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల్లో 148 పంచాయతీల్లో సర్పంచ్, 1,520 వార్డులకు గురువారం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికలైన సర్పంచ్లు బాధ్యతలు చేపట్టారు. రెండో విడతలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల్లో 186 పంచాయతీల సర్పంచ్ స్థానాలు, 1,972 వార్డులకు ఆదివారంతో ఎన్నికలు ముగుస్తాయి. మూడో విడత ఎన్నికలు జరిగే కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో తొమ్మిది మండలాల్లో 150 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు, 1,644 వార్డు స్థానాలకు అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ల ఉప సంహరణ (విత్డ్రా) ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ప్రచారం సమరానికి శంఖారావం పూరించారు. ఈ నెల 30వ తేది ఆఖరు వరకు ప్రచారం ఉంటుంది. అధికార కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ సహా వివిఽధ పార్టీలు మద్దతు, స్వతంత్రంగా బరిలో పోరుకు సై అంటున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రచార జోరు పెంచారు.
26 సర్పంచులు.. 379 వార్డులు ఏకగ్రీవం
కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో 150 పంచాయతీల్లో సర్పంచ్ సహా 1,644 వార్డులకు మూడో విడతలో డిసెంబరు 2న పోలింగ్ జరగాలి. శుక్రవారం విత్ డ్రాలు గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. 150 సర్పంచ్ స్థానాలకు 974 మంది నామినేషన్లు వేయగా, 533 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. 26 సర్పంచ్ పీఠాలు ఏకగ్రీవమయ్యాయి. 124 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంటే 426 మంది బరిలో ఉన్నారు. 1,644 వార్డులకు 3,614 మంది నిమినేషన్లు వేశారు. వారిలో 202 మంది విత్డ్రా చేసుకున్నారు. 379 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 1,215 వార్డులకు 2,.915 మంది పోటీలు ఉన్నారు. పది వార్డులకు ఎన్నికలు జరగడం లేదు.
పత్తికొండ నియోజకవర్గంలో 87 పంచాయతీలు ఉంటే సర్పంచ్ స్థానాలకు 574 మంది నామినేషన్లు వేస్తే, 325 మంది విత్డ్రా చేసుకున్నారు. 14 సర్పంచ్ పీఠాలు ఏకగ్రీవం కాగా, 73 సర్పంచ్ స్థానాలకు 242 మంది పోటీలు ఉన్నారు. 946 వార్డులు ఉంటే 213 ఏకగ్రీవమయ్యాయి. 693 వార్డులకు 1,559 మంది పోటీలో ఉన్నారు.
కోడుమూరు నియోజకవర్గం పరిధిలో 63 పంచాయతీలు ఉంటే.. సర్పంచ్ స్థానాలకు 400 మంది నామినేషన్లు వచ్చాయి. వారిలో 208 మంది విత్డ్రా చేసుకున్నారు. 12 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 51 స్థానాలకు 184 మంది పోటీలో ఉన్నారు. 698 వార్డులు ఉంటే, 166 ఏకగ్రీవం కాగా, 522 వార్డు స్థానాలకు 1,358 మంది అభ్యర్థులు పోరులో ఓటరు తీర్పు ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు.
రెండో విడత ప్రచారానికి తెర
రెండో విడతలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో రెండో విడత ఎన్నికలు జరిగే 169 పంచాయతీల్లో శుక్రవారం ప్రచారానికి తెర పడింది. ఈ పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. తొమ్మిది మండలాల్లో రెండో విడతలో 186 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటే, 17 సర్పంచ్ స్థానాలు, 381 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగే 169 సర్పంచ్ స్థానాలకు 476 మంది అభ్యర్థులు, 1,590 వార్డులకు 3,547 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ప్రచారం ముగియడంతో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో గ్రామాల్లో చికెన్ బిర్యానీ తయారు చేసి విందు ఏర్పాటు చేసి, మద్యం మత్తులో ఓటర్లను ముంచేస్తున్నారు. వెయ్యి ఓట్లు ఉన్న పంచాయతీలో బరిలో దిగిన అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.10-15 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.