Share News

డబ్బులు ఇస్తేనే పనులు

ABN , Publish Date - May 12 , 2026 | 11:33 PM

తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి పెచ్చుమీరిందని, డబ్బులు ఇస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు.

డబ్బులు ఇస్తేనే పనులు
తహసీల్దార్‌ కార్యాలయం ముందు బైఠాయించిన టీడీపీ నాయకులు

అధికారుల తీరుపై టీడీపీ నాయకుల మండిపాటు

కోసిగి రెవెన్యూ కార్యాలయం ముట్టడి

తహసీల్దార్‌ ఖాళీ కుర్చీకి వినతి పత్రం అందజేత

కోసిగి, మే 12(ఆంధ్రజ్యోతి): తహసీల్దార్‌ కార్యాలయంలో అవినీతి పెచ్చుమీరిందని, డబ్బులు ఇస్తేనే ఫైళ్లు కదులుతున్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం టీడీపీ నాయకులు తహసీల్దార్‌ వేణుగోపాల్‌ తీరును నిరసిస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. ముందుగా కోసిగిలోని తేరుబజార్‌ మైదానం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైకు ర్యాలీ నిర్వహిస్తూ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. కార్యాలయం ముందే వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెండ్యాల భరద్వాజ్‌ శెట్టి, కొండగేని వీరారెడ్డి, నాడిగేని చిన్న తాయన్న, నాడిగేని మాదేవా తదితరులు మాట్లాడుతూ తహసీల్దార్‌ నుంచి వీఆర్వోలు, సర్వేయర్ల వరకు అందరూ వైసీపీ నాయకుల పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఇంకా వారి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకుల పనులు పెండింగ్‌లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్‌ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చాంబర్‌లోని ఖాళీ కుర్చీకి వినతి పత్రాన్ని అందించి నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన అర్జీని ఆర్‌ఐ శ్రీరాములుకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంపాపతి, నాడిగేని వీరారెడ్డి, శ్రీనివాసులు, శకుంతలమ్మ, డీలర్‌ నరసన్న, న్యాయవాది నాగరాజు, బోంపల్లి నరసింహులు, రామయ్య, మజ్జిగ రామాంజనేయులు, రాజశేఖర్‌రెడ్డి, మహేష్‌, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:34 PM