పోలీసుల అదుపులో హుండీ దొంగలు?
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:04 AM
మండలంలోని కల్లపరి దుర్గమ్మదేవి ఆలయంలో గత నెలలో హుండీ కానుకలు చోరీ చేసిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కోడుమూరు రూరల్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్లపరి దుర్గమ్మదేవి ఆలయంలో గత నెలలో హుండీ కానుకలు చోరీ చేసిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మార్చి 23న అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు ఆలయ తాళాలు పగలగొట్టి ఓ హుండీని ఎత్తుకెళ్లారు. పొలాల దారిలో హుండీ పగలగొట్టి అందులో బంగారు, వెండి కానుకలు, నగదు తీసుకుని, చిల్లర నాణేలు అక్కడే వదిలేసి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం పొలాలకు వెళ్లే దారిలో రైతులు హుండీ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించారు. ఈ కేసు నిందితుల్లో కొందరిని పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారని వినికిడి. ఆలయ చోరీకి పాల్పడడానికి ముందుగా దొంగలు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో ఆలయంలో ఎవరూ ఉండడం లేదని నిర్ధారించుకున్న తర్వాతే అర్ధరాత్రి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు. దొంగలు వదిలేసిన చిల్లర నాణేల మొత్తం రూ.35వేల పైచిలుకు ఉన్నట్లు తెలిసింది. అందులో కానుకలు, నగదు రూ.లక్షల్లో ఉంటుందని గ్రామస్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దొంగలు చోరీ సొత్తుతో విలువైన వస్తువులు కొనుగోలు చేశారని వినికిడి. ప్రస్తుతం పోలీసులు రికవరీ ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
వీరభద్రస్వామి కిరీటం దొరికేనా ?
ప్యాలకుర్తిలోని వీరభద్రస్వామి ఆలయంలో గతేడాది ఆగస్టు 29న వెండి కిరీటం చోరీకి గురైంది. పూజారి మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై గుడి లోపలికి వెళ్లాడు. ఆ వ్యక్తి తిరిగి వస్తున్న క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పూజారి గమనించి ప్రశ్నించారు. పూజ చేయడానికి వెళ్లినట్లు ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. అనంతరం పూజారి గుడి తాళంవేసి ఇంట్లోకి వెళ్లిపోయారు. తిరిగి సాయంత్రం పూజ చేయడానికి తాళం తెరిచాడు. స్వామి మూలవిరాట్‌పై ఉంచిన వెండి కిరీటం కనిపించలేదు. దీంతో ఆందోళన చెంది గ్రామస్థులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 75 తులాల వెండి కిరీటం దొంగ అపహరించాడు. ఇప్పటికీ ఆ కిరీటం దొరకలేదు. ఓ భక్తుడు మొక్కుబడి మేరకు స్వామివారికి వెండి కిరీటం అలంకరించాడు. వీరభద్రస్వామికి స్థానికులే కాకుండా వివిధ చోట్ల భక్తులు విచ్చేసి పూజలు నిర్వహిస్తారు. ఆలస్యమైనా కిరీటం దొరుకుతుందని భక్తులు విశ్వాసంతో ఉన్నారు.