పోలీసులకు చిక్కిన దొంగల ముఠా
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:47 AM
పాత సామాన్లు సేకరించే మాటున దొంగతనాలకు పాల్పడిన ఓముఠాను ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు
బ్యాటరీలు, ఇతర సామగ్రి స్వాధీనం
ఆత్మకూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): పాత సామాన్లు సేకరించే మాటున దొంగతనాలకు పాల్పడిన ఓముఠాను ఆత్మకూరు పోలీసులు పట్టుకున్నారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని అర్బన్‌కాలనీకి చెందిన చెంచు గణేష్, పసుపుల సంజమ్మ, మాండ్ల నరసమ్మతో పాటు ఓ మైనర్‌బాలుడు కలిసిపాత సామాన్లు సేకరించి వాటిని గుజారీ దుకాణంలో విక్రయించి జీవనం సాగించేవారు. సులభ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలన్న దురాశతో పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలు, మోటార్ల కాపర్ కేబుల్స్‌తో పాటు ఇనుప వస్తువులను దొంగిలించి వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. శుక్రవారం ఆవిధంగా దొంగిలించిన వస్తువులను మార్కాపురంలో విక్రయించేందుకు ఓఆటోలో తీసుకెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీశైలం రస్తాలో ఆత్మకూరు ఎస్‌ఐ నారాయణరెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 అమరాన్ బ్యాటరీలు, ఒక సీసీటీవీ డీవీఆర్, ఆరు లారీ ఇనుక కట్టలు, కాపర్ కేబుల్స్‌తో పాటు ఇతర ఇనుప వస్తువులను స్వాధీ నం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఎస్సై నారాయణరెడ్డిని ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజీనాయక్ అభినందించారు.
అహోబిలంలో కార్డెన్ సర్చ్
ఆళ్లగడ్డ: మండలంలోని అహోబిలంలో డీఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా అధికా రుల ఆదేశాల మేరకు పలు అనుమానితుల ఇళ్లల్లో విస్తృత సోదాలు చేశారు. ఎనిమిది ఇళ్ల నుంచి 247 విస్కీ క్వాటర్ బాటిళ్లు, 37 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఆరు మందిని అదుపు లోకి తీసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ శనివారం తెల్లవారుజామున 50మంది పోలీసులతో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి, సారాస్థావరాలపై నిఘా పెట్టి దాడులు చేశామన్నారు. పుణ్యక్షేత్రం అహోబిలంలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసినా చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్‌ఐలు వరప్రసాద్, చిన్న పీరయ్య, రామిరెడ్డి, జయ్యప్ప పాల్గొన్నారు.