Share News

బెల్టులు పెట్టేశారు..!

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:42 PM

బెల్టులు పెట్టేశారు..!

బెల్టులు పెట్టేశారు..!

షాపులు పంచుకున్న లైసెన్సీలు

బార్లను తలపిస్తున్న పర్మిట్‌ రూమ్‌లు

నెలకు రూ. వంద కోట్లపైనే అమ్మకాలు

జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలుస్తున్నాయి. బెల్టుషాపుల వ్యవహారంలో స్వయంగా కొందరు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండటంతో ఎక్పైజ్‌, పోలీసులు శాఖలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. పైస్థాయిలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నందు వల్లే బెల్ట్‌ షాపులు ఇంత పెద్ద ఎత్తున నడుస్తున్నాయనే చర్చ ఎక్సైజ్‌ శాఖలో జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. నాటు సారాను అరికట్టేందుకు రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తోంది. దాదాపు 90 శాతం గ్రామాలకు మద్యం దుకాణాలు అందుబాటులో లేవు. దీని వల్ల బెల్టుషాపుల వ్యాపారం జోరుగా సాగుతోందనే విమర్శలు ప్రభుత్వంపై వ్యక్తమవుతున్నాయి.

కర్నూలు అర్బన్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): మద్యం అమ్మకాలతో రాష్ట్రంలోనే జిల్లా రెండోస్థానంలో నిలిచింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్నామనే బూచీ చూపి బెల్టుషాపుల అమ్మకాలకు ఇష్టాను సారంగా అనుమతి ఇచ్చేశారనే విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 118 మద్యం దుకాణాలు, 27 బార్లు ఉన్నాయి. 26 మండలాల పరిఽధిలో 484 గ్రామ పంచాయతీలు, ఒక నగరపాలక సంస్థ, 2 మున్సిపాలిటీ, ఒక నగర పంచాయతీ పరిధిలో దాదాపు 500కు పైగా బెల్టు షాపుల నిర్వహణ యథేచ్ఛగా సాగుతుందనేది సమాచారం. ఎక్కడ పడితే అక్కడ కౌంటర్లు ఏర్పాటుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్క మార్చి నెలలోనే రూ.112కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈనెలలో ఇప్పటికే రూ.70కోట్లపై బడి అమ్మకాలు జరిగాయని ఐఎంఎల్‌ డిపో రికార్డులు సూచిస్తున్నాయి.

ఇష్టానుసారంగా ధరలు

బెల్టుషాపుల యాజమానులు ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తున్నారని మందు బాబులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలో ప్రైవేట్‌ మద్యం షాపులకు లైసెన్సులు ఇచ్చే సమయంలో మండల కేంద్రాలను యూనిట్‌గా తీసుకున్నారు. మండలంలో ఎక్కడైనా మద్యం షాపు ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలో ఎక్కువగా ఏర్పాటుచేశారు. పెద్ద గ్రామా ల్లో కూడా కొన్నిచోట్ల మద్యం షాపులు లేకుండా పోయాయి. క్వార్టర్‌పై రూ.30వరకు అదనంగా అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఇష్టానుసారంగా రూ.10-20 వరకు లైసెన్సుడు మద్యం దుకాణాల్లో ధరలు పెంచేశారు. క్వార్టర్‌ వినియోగదారుడికి చేరే సరికి లైసెన్సు షాపు అదనం, బెల్టు దుకాణాల్లో లాభం కలుపుకొని రూ.50వరకు మందుబాబుల జేబులకు చిల్లు పడుతోంది. వేసవి కావడంతో బీర్‌లకు మరీ డిమాండ్‌ ఉంది. ఒక్కో బీర్‌పై రూ.50-70 అదనంగా వసూలు చేస్తున్నారు.

గ్రామాలను పంచేసుకున్నారు

పైవేట్‌ మద్యం షాపులు/బార్లు దక్కించుకున్న లైసెన్స్‌దారులు మండలంలోని గ్రామాలను పంచేసుకున్నారు. ప్రభుత్వం మద్యం డిపోల నుంచి వీళ్లు కొనుగోలు చేసిన సరుకులో కొంతభాగాన్ని బెల్టుషాపులకు చేరవేస్తున్నారు. 6నెలలు మాత్రమే లైసెన్సు అను మతులు ఉండటంతో చివరిలో ఎవరు పట్టించుకుంటారనే ధీమాతో అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలో 110 మద్యం దుకాణాలు, 27బార్లు ఉన్నాయి. అధికశాతం దుకాణాలు పట్టణ, మండల పరిధిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో బెల్టుషాపులకు అవకాశం ఏర్పడింది.

ఏమీ చేయలేని పరిస్థితుల్లో..

బెల్టుషాపులు చట్టరీత్యా అంగీకారం కాదు. పోలీసు, ఎక్సైజ్‌ సిబ్బంది కేసులు నమోదు చేయవచ్చు. కాని కొన్ని పరిస్థితులతో వాళ్లు ఏమీ చేయలేక పోతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఏదైనా ఆగ్రహం వ్యక్తమైతే ఒకటి లేదా రెండు కేసులు నమో దు చేసి సరిపెడుతున్నారు. బెల్టుషాపుల నుంచి నెల వారి మాముళ్లు వెళ్తాయనేది బహిరంగ రహస్యమే. బెల్టుషాపులతో అమ్మకాలు కూడా పెరుగుతాయి. లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతోంది., ఈ నేపథ్యంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

నియంత్రణ లేదు

పర్మిట్‌ రూమ్‌లు జిల్లాలో బార్లను తలపిస్తున్నాయి. మద్యం దుకాణాలకు సమయ పాలన ఉంది. పర్మిట్‌ రూమ్‌లో అక్కడే తయారు చేసే చేపలఫ్రై, కోడి మాంసం, వెజ్‌ ఐటమ్స్‌ వేడి వేడిగా తినుబండరాలు అక్కడే వండి వారుస్తున్నారు. వాటర్‌ బాటిళ్ల అమ్మ కాలు నిబంధలు ఉల్లంఘించిన వాటిపై నియంత్రణ లేదు. కర్నూలులో 24 గంటలు పర్మిట్‌ రూమ్‌లు, రెస్టారెంట్‌ల పని చేస్తున్నాయని ప్రకాష్‌ నగర్‌ వాసులు ఆందోళన చెందుతున్నారు.

నా దృష్టికి రాలేదు

బెల్టుషాపుల విషయం నా దృష్టికి రాలేదు. ఎన్‌ ఫోర్సుమెంట్‌ సిబ్బందిని పంపి విచారించి చర్యలు తీసుకుంటా.. నింబధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.

పి. శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్‌, ఎక్సైజ్‌ శాఖ, కర్నూలు

Updated Date - Apr 23 , 2026 | 11:42 PM