కొలువుదీరారు
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:38 AM
కొలువుదీరారు
ప్రశాతంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
25 మండలాల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాలు
24 మండలాల్లో ఎగిరిన టీడీపీ జెండా
కోడుమూరు వైసీపీ కైవసం
మంత్రాలయం ఎంపీపీ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య ఉత్కంఠ
ఎంపీపీ ఎన్నిక వాయిదా
మండలాల్లో కొత్త పాలనకు తెర లేచింది. ఎంపీపీ పీఠాలపై కొత్త సారథులు కొలువుదీరారు. రాజకీయ సమీకరణాలు, రిజర్వేషన్లు, సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపిక చేసింది. పరిషత్ ఎన్నికల్లో చివరి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. మండలాధీశుల ప్రమాణస్వీకారాలతో మండల పరిషత్‌లతో నయా సందడి నెలకొంది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరై కొత్తగా ఎంపికైనా మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు శుభకాంక్షలు తెలిపారు. జిల్లాలో 26 మండలాలు ఉంటే 24 మండలాల్లో టీడీపీ పసుపు జెండా ఎగిరింది. కోడుమూడు పీఠం వైసీపీ దక్కించుకుంది. మంత్రాలయం ఎంపీపీ పీఠం జనసేనకు కేటాయించడం, ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది.
కర్నూలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 మండలాలు ఉంటే.. జిల్లాల పునర్విభజన తరువాత 28 మండలాలతో నంద్యాల ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. 26 మండలాలతో కర్నూలు జిల్లా మిగిలింది. 2021లో ఎంపికైన జిల్లా, మండల పరిషత్ పాలకవర్గం పదవి కాలం సెప్టెంబరు 24న ముగిసింది. నూతన పాలకవర్గం ఎంపిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్ చంద్ర పునేఠా అక్టోబరు 14న ఎన్నికల షెడ్యూల్ జారీ చేశారు. 26 మండలాల్లో 432 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 74 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 358 స్థానాలకు 907 మంది పోటీ పడ్డారు. ఈ నెల 3న పోలింగ్ జరిగింది. 5న ఓట్లు లెక్కించారు. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 311, వైసీపీ 113, ఇతరులు 8 స్థానాలు దక్కించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్‌లో భాగంగా గురువారం అన్ని మండలాల్లో మండల ప్రత్యేక అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు (పీవో) జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశాల మేరకు మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు సమావేశాలకు హాజరు కాగా పార్టీల వారీగా సీట్లు కేటాయించారు.
24 మండల పీఠాలు టీడీపీ కైవసం
జిల్లాలో 26 మండల పరిషత్‌లకు ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు, ప్రమాణాస్వీకారం కోసం ప్రిసైండింగ్ అధికారులు గురువారం మండల పరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీ సభ్యులతో ముందుగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ పీఠాల కోసం పోటీ పడే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 25 మండలాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యత ఉండడంతో, కూటమి అభ్యర్థులు మినహా ఎక్కడా కూడా పోటీకి ఎంపీటీసీలు ముందుకు రాలేదు. సింగిల్ నామినేషన్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు టీడీపీ బీ-ఫారంలు అందజేశారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులు నామినేషన్లతో పాటు బీ-ఫారాలు అందజేశారు. 24 మండలాల్లో సింగిల్ నామినేషన్ రావడంతో పీవోలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత కొత్తగా ఎన్నికైన మండలధీశులు, ఉప మండలాధీశులతో ప్రమాణస్వీకారం చేయించారు. పాణ్యం, కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, డాక్టర్ పార్థసారథి, ముఖ్య నాయకులు హాజరై కొత్తగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, బాధ్యతలు చేపట్టిన ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలిపారు. కోడుమూరు మండలాన్ని ఒక్క ఎంపీటీసీ అధిక్యతతో వైసీపీ కైవసం చేసుకుంది. ఒక ఎంపీటీసీ స్థానం గెలిచి, వైసీపీకి మద్దతు ఇచ్చిన సీపీఎం ఉపాధ్యక్ష పదవి దక్కించుకుంది.
మంత్రాలయంపై వీడని ఉత్కంఠ
మంత్రాలయం ఎంపీపీ పీఠంపై టీడీపీ, జనసేన మధ్య ఉత్కంఠ నెలకొంది. 18 ఎంపీటీసీ స్థానాలున్న ఈ మండలంలో ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 7, జనసేన ఒకటి, వైసీపీ 7 స్థానాలు దక్కించుకున్నాయి. కూటమి ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి భార్య యశోదమ్మ పేరును ఎన్నికలకు ముందే ప్రకటించారు. ఎన్నికల్లోనూ ఆమె పేరే ప్రచారం చేశారు. టీడీపీ ఎంపీపీ అభ్యర్థి యశోదమ్మ మాధవరం-1 ఎంపీటీసీగా గెలిచారు. గురువారం ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం ఏర్పాట్లు చేశారు. అయితే.. రాష్ట్రంలో కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా మంత్రాలయం ఎంపీపీ పీఠం జనసేనకు కేటాయించినట్లు టీడీపీ అధిష్ఠానం నుంచి జిల్లా నాయకత్వానికి జాబితా వచ్చింది. దీంతో మంత్రాలయం ఎంపీపీ అభ్యర్థి యశోదమ్మకు టీడీపీ బీ-ఫారం ఇవ్వలేదు. దీంతో టీడీపీ ఎంపీటీసీలు మండల పరిషత్ ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. జనసేన నియోజకవర్గం సమన్వకర్తల్లో ఒకరైన లక్ష్మన్న కోడలు సులోచన మంత్రాలయం-3 ఎంపీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా గెలిచింది. ఒక్క ఎంపీటీసీ కలిగిన జనసేనకు ఎంపీపీ పీఠం ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తుల్లో జనసేనకు ఎంపీపీ పీఠం కేటాయించినా, ఆ పార్టీ బీ-ఫారం ఇవ్వకపోగా అభ్యర్థికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. సరైన కోరం లేకపోవడంతో పీవో బాలవర్ధనిరాజు సమావేశాన్ని వాయిదా వేశారు. శుక్రవారం ఎంపీపీ ఎన్నిక జగాల్సి ఉంది. మంత్రాలయం ఎంపీపీ పీఠం ఎవరికి..? టీడీపీ, జనేన వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దేవనకొండ ఎంపీపీ పీఠం కూడా జనసేనకు కేటాయించినట్లు చర్చ రావడంతో ఇక్కడ కూడా ఉత్కంఠ నెలకొంది. చివరికు టీడీపీ ఎంపీపీ, వైస్ ఎంపీపీ పీఠాలను దక్కించుకుంది. సి.బెళగల్, గూడూరు ఉపాధ్యక్ష అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో పాటు నామినేషన్లు రాకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు.
మండల పరిషత్ ఉపాధ్యక్షులు వీరే..
మండలం ఉపాధ్యక్షులు పార్టీ
ఎమ్మిగనూరు కోటేకల్లు షేక్ రసూల్‌బీ టీడీపీ
నందవరం రాధమ్మ టీడీపీ
గోనెగండ్ల ఫకృద్దీన్ టీడీపీ
కర్నూలు నాగరాజు అశ్విని టీడీపీ
ఆలూరు కురువ నాగవే ణి టీడీపీ
చిప్పగిరి యు. గోవిందరాజులు టీడీపీ
ఆస్పరి చెన్నంపల్లి పద్మావతి టీడీపీ
హాలహర్వి సూరి నరసన్న టీడీపీ
దేవనకొండ ఉప్పర మంగమ్మ టీడీపీ
హొళగొంద మిక్కిలినేని రమేశ్‌బాబు టీడీపీ
పత్తికొండ చెక్కి శిల్పాశెట్టి టీడీపీ
తుగ్గలి పి.వెంకటపతి టీడీపీ
మద్దికెర ఆవుల పెద్దన్న టీడీపీ
వెల్దుర్తి కొమ్ము యమున టీడీపీ
కోసిగి కిందిగేరి గోపాల్ టీడీపీ
కౌతాళం ఎస్.లక్ష్మి టీడీపీ
పెద్దకడబూరు ఎం.రామాంజనేయులు టీడీపీ
ఓర్వకల్లు రషీదాబీ టీడీపీ
ఆదోని-1 ఈవీ రాముగౌడ్ టీడీపీ
ఆదోని-2 షాహీనా బేగం టీడీపీ
కల్లూరు కోడెల సుదర్శనం టీడీపీ
కోడుమూరు నేసే నాగిరెడ్డి అలియాస్ కనికె సీపీఐ(ఎం)
కోడుమూరులో వైసీపీ పాగా
జిల్లాలో ఆ పార్టీకి ఏకైక గెలుపు
వైసీపీ- సీపీఎం పొత్తుతో కైవసం
అధ్యక్షుడిగా రఘునాథరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్డి
కోడుమూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో రాజకీయంగా ఉత్కంఠ రేపిన కోడుమూరు మండల పరిషత్ ఎట్టకేలకు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. జిల్లాలోని 26 మండలాల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగినప్పటికీ కోడుమూరులో మాత్రం అధికార పార్టీ చతికిలపడింది. గురువారం రిటర్నింగ్ అధికారి జయంతి, ఏఆర్వో ఏసీ రాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఎంపీటీసీ రఘునాథరెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. అదేవిధంగా పొత్తులో భాగంగా సీపీఎం నుంచి ఎంపీటీసీగా గెలిచిన కనికె నాగిరెడ్డిని ఉపాధ్యక్ష పదవి వరించింది. కోడుమూరు మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 10 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 9 స్థానాలకే పరిమితమైంది. ఒక పొత్తులో భాగంగా సీటును దక్కించుకున్న సీపీఎం ఒక చోట, స్వతంత్ర అభ్యర్థి మరో స్థానంలో గెలిచారు. స్వతంత్ర అభ్యర్థితో పది స్థానాలతో టీడీపీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంది. అయితే సీపీఎం పొత్తుతో వైసీపీ 11 మంది ఎంపీటీసీ సభ్యులతో ఎంపీపీ పదవిని దక్కించుకుంది. ఓటమి పరిస్థితిని ముందే గ్రహించిన టీడీపీ ఎంపీటీసీలు, స్వతంత్ర అభ్యర్థి సమావేశానికి గైర్హాజరయ్యారు. ప్రమాణ స్వీకార సమయంలో సభ్యుల కుర్చీలు ఖాళీగా కనిపించాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో కోడుమూరు అసెంబ్లీని టీడీపీ కైవసం చేసుకుంది. అలాంటి నియోజకవర్గ కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జడ్పీటీసీ కోల్పోయిన టీడీపీకి ఎంపీపీ స్థానంతో అయినా పరువు నిలబెట్టుకోవాలని ఆశించిన నాయకులకు ఆశాభంగం తప్పలేదు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లాలో 25 మండలాల్లో కూటమి అభ్యర్థులు ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోడుమూరు, కర్నూలు త్రీటౌన్ సీఐలు తబ్రేజ్, శేషయ్య బందోబస్తు నిర్వహించారు.