Share News

ఖాళీ స్థలంపై కన్నేశారు

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:47 PM

రాజకీయ పరపతి ఉండాలేగాని ఖాళీ స్థలం కనిపిస్తే వదిలేస్తారా?

ఖాళీ స్థలంపై కన్నేశారు
సి. క్యాంప్‌ సర్కిల్‌ సమీపంలో సుద్దవాగు పక్కన ఉన్న మున్సిపల్‌ రిజర్వుడ్‌ ఓపన్‌ సైట్‌

కబ్జా కానున్న రూ.35 కోట్ల విలువైన 70 సెంట్ల కార్పొరేషన్‌ స్థలం

సి. క్యాంప్‌ సర్కిల్‌ సమీపంలో సుద్ద వాగు పక్కన

లీజు పేరిట స్వాధీనానికి తీవ్ర ప్రయత్నాలు

రాజకీయ నేతలపై ఒత్తిడి

రాజకీయ పరపతి ఉండాలేగాని ఖాళీ స్థలం కనిపిస్తే వదిలేస్తారా? ఏదో ఒక రకంగా కాజేద్దామని ఎత్తులు వేస్తారు. కర్నూలు నగరం సి. క్యాంప్‌ సమీపంలో సుద్దవాగును అనుకొని దాదాపు రూ.35 కోట్లకు పైగా విలువైన మున్సిపల్‌ రిజర్వుడ్‌ ఓపన్‌ సైట్‌ ఉంది. నిరుపయోగంగా ఉన్న ఆ స్థలంపై బడాబాబులు, రియల్‌ ఎస్టేట్‌ పెద్దల కన్ను పడింది. లీజు పేరిట ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

కర్నూలు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956 వరకు కర్నూల్లో రాజధాని ఉండింది. ఆ సమయంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నివాసం కోసం ఏ, బీ, సీ క్వార్టర్లు నిర్మించారు. ఈ ప్రాంతాల్ని ఏ-క్యాంప్‌, బి-క్యాంప్‌, సి-క్యాంప్‌ అని పిలుస్తారు. సి. క్యాంప్‌-నంద్యాల చెక్‌ పోస్టు ప్రధాన రోడ్డు వాణిజ్య కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఆ ప్రాంతంలో సెంటు రూ.50 లక్షలకు పైగా పలుకుతోంది. 1953లో బి.క్యాంప్‌ కార్టర్ల నిర్మాణంలో భాగంగా సి. క్యాంప్‌-నంద్యాల చెక్‌ పోస్టు ప్రధాన రోడ్డు పక్కనే సుద్దవాగును ఆనుకొని 70 సెంట్ల మున్సిపల్‌ రిజర్వుడ్‌ ఓపన్‌ సైట్‌గా కేటాయించారు. ఆ స్థలంలో నగరపాలక సంస్థ మున్సిపల్‌ డ్రైనేజీ పంప్‌హౌస్‌, కార్యాలయం నిర్మించారు. భవనాలు శిథిలావస్థకు చేరడం వల్ల పదేళ్లుగా ఖాళీగా ఉంచారు. గత డిసెంబరులో పాడుబడిన ఆ భవనాలు పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం ఇక్కడ సెంటు రూ.50 లక్షలకు పైగా పలుకుతోంది. అంటే.. ఆ స్థలం విలువ రూ.30 కోట్ల పైమాటే.

లీజు పేరిట స్వాధీనానికి యత్నాలు

సుద్దవాగు అనుకొని విశాలంగా కనిపిస్తున్న ఆ ఖాళీ స్థలంపై బడా బాబులు, నగరంలో పేరుమోసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కన్నేశారు. 30 ఏళ్లు లీజుకు తీసుకొని కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించు కోవాలనే ఆశతో ప్రముఖ రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నిస్తోన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ హయాంలో ఎలాగైనా ఆ స్థలం లీజు పేరిట కాజేయాలనే తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన రాజకీయ రంగు పులుముకున్న ఓ వ్యాపారవేత్త కూటమి ప్రభుత్వంలో మరింత ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యాపారవేత్త ప్రతిపాదనను ఒక ముఖ్య నాయకుడు అంగీకరించలేదని స్థానికులు అంటున్నారు. గత నెల రోజుల నుంచి పలువురు ముఖ్యులు కార్లల్లో వచ్చి ఆ స్థలం చూసి వెళ్తుండడంతో అన్యాక్రాంతం అవుతుందేమో అనే భయం స్థానికులకు వెంటాడుతుంది. నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాలని, ఖాళీ స్థలంలో పార్కు అభివృద్ధి చేసి పచ్చదనం పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

అడుగు స్థలం కూడా అన్యాక్రాంతం కానివ్వం

సి. క్యాంప్‌-నంద్యాల చెక్‌ పోస్టు రోడ్డులో సుద్దవాగు అనుకొని కార్పొరేషన్‌కు చెందిన రిజర్వుడ్‌ ఓపన్‌ సైట్‌ ఉంది. రిజర్వుడ్‌ ఓపన్‌ స్థలాలు వ్యాపార, నివాస, ప్రైవేట్‌ ప్రయోజనాలు కోసం లీజుకు ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. అక్కడ ఎలాంటి భవనాలు నిర్మించకూడదు. అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఆ స్థలం చుట్టూ ప్రహారీ నిర్మించి ఉద్యానవనం అభివృద్ధి చేస్తాం. కార్పోరేషన్‌ స్థలాలు ఒక్క అడుగు కూడా అన్యాక్రాంతం కాన్విం.

- చల్లా ఓబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్‌, కర్నూలు

Updated Date - Jun 18 , 2026 | 11:47 PM