కుడాను కుదించారు!
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:09 PM
కర్నూలు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) పునర్‌వ్యవస్థీకరణకు కూటమి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది.
పునర్విభజనలో 472 గ్రామాలు, నగర, మున్సిపాలిటీలు
నంద్యాల జిల్లాకు కొత్తగా ‘నుడా’
30 మండలాలు, ఆరు మున్సిపాలిటీలతో ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
కర్నూలు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) పునర్‌వ్యవస్థీకరణకు కూటమి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాను నగరాభివృద్ధి ప్రాధికార సంస్థగా ఏర్పాటు చేయడంతో కుడా పరిధి తగ్గిపోయింది. ఇప్పటి వరకు కుడా పరిధిలో ఉన్న నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పాటయ్యే నంద్యాల అర్బన్ డెవల్‌పమెంట్ అధారిటీ (నుడా) పరిధిలోకి వెళ్లిం ది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. భవిషత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా నగర, పట్టణాలను అభివృద్ధి చేసేందుకు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (యూడీఏ)లను గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటుచేసినా ఉమ్మడి జిల్లా మొత్తం యూడీఏ పరిధిలోనే ఉండిపోయాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భవన నిర్మాణదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా పాలనాపరంగా కూడా పలు సమస్యలు తలెత్తాయి. వీటిని అధిగమించి నగరాభివృద్ధిలో కీలక ముందడుగు వేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సారథ్యలోని కూటమి ప్రభుత్వం యూడీఏ పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లా మొత్తం కర్నూలు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (కుడా), నం ద్యాల జిల్లా మొత్తం నంద్యాల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎల్ యూడీఏ - నుడా) ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (కుడా)ను 2016 ఫిబ్రవరి 6న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చట్టం-2016లో భాగంగా ఏర్పాటు చేశారు. మొదట్లో కర్నూలు నగరపాలక సంస్థ, నంద్యాల, డోన్ పురపాలక సంఘాలు, గూడూరు నగర పంచాయతీ, తొమ్మిది మండలాల్లో 123 గ్రామాలను కలుపుతూ ‘కుడా’ ఏర్పాటు చేశారు. 2,599.50 చదరపు కిలోమీటర్లు పరిధి ఉండేది. ఆ తరువాత 2017 మార్చి 24న కుడా విస్తీర్ణం పెంచారు. కర్నూలు కార్పొరేషన్, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, గూడూరు, బేతంచర్ల నగర పంచాయతీలు సహా 35 మండలాలకు విస్తరించారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కుడా పరిధిలోకి తీసుకొచ్చారు. జిల్లాల పునర్విభజన తరువాత కర్నూలు, నంద్యాల రెండు జిల్లాలు కుడా పరిధిలోనే ఉన్నాయి. దీని వల్ల అధికారిక కార్యకలాపాల నిర్వహణ, పరిపాలన పరంగా పలు సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యలకు చెక్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీల విభజనకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కుడా నుంచి నంద్యాల జిల్లాను విడదీసి, కొత్తగా నంద్యాల అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎన్‌డీఎల్ యూడీఏ - నుడా )ను ఏర్పాటు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.సురేశ్‌కుమార్ జీవో ఎంఎస్ నంబరు.185 చేశారు. అలాగే కుడా పునర్వ్యస్థీకరణ గెజిట్ ఉత్తర్వులు, జీవో ఎంఎస్ నంబరు.188 జారీ చేశారు. నంద్యాల నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (నుడా) ఏర్పాటుతో ఆ జిల్లా అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది.
విభజన అనంతరం కుడా, నుడా స్వరూపం
(విస్తీర్ణం చదరపు కిలో మీటర్లు)
వివరాలు కుడా నుడా
నగర పాలక సంస్థ కర్నూలు --
మున్సిపాలిటీలు 3 6
మండలాలు 27 30
గ్రామాలు 427 448
విస్తీర్ణం 7,779.48 7,113.46
కుడా పరిధి ఇలా..
ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలు కలిసి నగరాభివృద్ధిలో కీలక మలుపునకు బీజం వేసిన కుడా పరిధి సగానికి తగ్గిపోయింది. విభజన తరువాత కర్నూలు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) పరిధిలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు, గూ డూరు నగర పంచాయతీ సహా 27 మండలాలల్లోని 427 గ్రా మాలు ఉంటాయి. 7,779.48 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో కుడా ఉంటుంది. ప్రస్తుతం ఆ సంస్థ చైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ కొనసాగుతున్నారు.
నుడా పరిధి ఇలా..
ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ చట్టం-2016లో భాగంగా నంద్యాల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎన్‌డీఎల్ యూడీఏ - నుడా)ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నుడా పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు పురపాలక సంఘాలు, బేతంచర్ల నగర పంచాయతీ సహా 30 మండలాల్లోని 448 గ్రామాలు వస్తాయి. 7,113.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నుడా ఆవిర్భవించింది.
నుడా పాలకవర్గం ఇలా
ఎన్‌డీఎల్ యూడీఏ - నుడా చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. అలాగే.. ప్రభుత్వం నియమించే వైస్ చైర్మన్ సీఈవోగా ఉంటారు. జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జిల్లా కలెక్టర్, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, పురపాలక శాఖ ఎస్‌ఓ్‌సడీ, జేడీ, డీడీలలో ఒకరు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ చెందిన జాయింట్ సెక్రెటరీ లేదా డిప్యూటీ సెక్రెటరీలతో పాటు రోడ్లు భవనాలు శాఖ, ఇంధన, పర్యావరణ శాఖల నుంచి నలుగురు, పట్టణ ప్రణాళిక, పరిపాలన, పరిరక్షణ, పర్యావరణ, రవాణా రంగాల్లో పరిజ్ఞానం కలిగి ఉండి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందిన ముగ్గురిని సభ్యులుగా నియమిస్తారు.
ప్రభుత్వ నిర్ణయం మంచిదే
అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (యూడీఏ)లను పునర్‌వ్యవస్థీకరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇన్నాళ్లు ఒకే యూడీఏ పరిధిలో ఉన్న కర్నూలు, నంద్యాల జిల్లాలు కుడా, నుడా రెండు యూడీఏలుగా ఏర్పాటు అవుతాయి. ఈ నిర్ణయం వల్ల నగారభివృద్ధికి వేగంగా ముందడుగు పడుతుంది. నంద్యాల జిల్లా అభివృద్ధికి ఇది సువర్ణ అవకాశం. 30 ఏళ్ల ముందు చూపు, భవిషత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు అద్భుత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగమే నుడా ఏర్పాటు.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్, కర్నూలు