ఓటెత్తారు..
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:15 AM
ఓటెత్తారు..
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ఓటర్లలో చైతన్యం
ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు
ఓటు హక్కును వినియోగించుకున్న 8.82 లక్షల మంది
జిల్లా వ్యాప్తంగా 68.23 శాతం పోలింగ్ నమోదు
బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
చిప్పగిరి మండలం గుమ్మనూరులో స్వల్ప ఘర్షణ
పరిషత్ పోరు ప్రశాంతం
రేపు ఓట్ల లెక్కింపు
గ్రామీణ ఓటర్లు పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓటేసేందుకు మేము సైతం అంటూ వృద్ధుల నుంచి యువత వరకు కదిలొచ్చారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు దీరారు. ఏ పల్లెకు వెళ్లినా.. ఏ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించినా.. ఎవరిని కదిపినా ఒకటే మాట ఓటేయడం మన బాధ్యత. పల్లె ప్రగతిపై ఓటర్లు తమ ఆకాంక్షను చాటారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటేసేందుకు జనం పోటెత్తారు. వృద్ధులు, మహిళలు, గర్భిణులు, పసిపిల్లల తల్లులు, దివ్యాంగులు, యువత సైతం ఓటేసేందుకు తరలిరావడం స్ఫూర్తిదాయకం. ఓటరన్న తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఫలితాలు ఎలా ఉంటాయో? అభ్యర్థులు, రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ మొదలైంది.
కర్నూలు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు ప్రజలు పోటెత్తారు. గురువారం ఉదయం నుంచే ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎండలు పెరిగినా ఓటర్లలో ఉత్సాహం తగ్గలేదు. మధ్యాహ్నం కాస్త తగ్గినా ఉదయం, సాయంత్రం భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటేశారు. ఒకటి రెండు చిన్నపాటి సంఘటనలు మినహా కందనవోలు ముంగిట పరిషత్ పోరు ప్రశాంతంగా ముగిసింది. అధికార యంత్రాం గం, రాజకీయ వర్గాలు ఊపిరి పీల్చుకు న్నాయి. సాయంత్రం 5గంటల తరువాత కూడా పలు గ్రామాల్లో వరుసల్లో నిలబడటం కొసమెరుపు. జిల్లా వ్యాప్తంగా 8,82,335 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. జిల్లా వ్యాప్తంగా 68.23 శాతం పోలింగ్ నమోదైంది. ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో వలస వెళ్లిన ఓటర్లు గ్రామాలకు చేరుకొని ఓటేశారు. పరిషత్ పోరు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం కౌంటింగ్ నిర్వహించనున్నారు.
26 జడ్పీటీసీ స్థానాలకు..
జిల్లాలో 26 జడ్పీటీసీలు ఉన్నాయి. 26జడ్పీటీసీ స్థానాలకు 97 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 26, ప్రతిపక్ష వైసీపీ 26 సహా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ వివిధ పార్టీలు, స్వతంత్రులు 45 మంది బరిలో ఉన్నారు.
432 ఎంపీటీసీ స్థానాలు..
26 మండల పరిషత్తుల్లో 432 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వాటిలో 73 ఎంపీటీసీ స్థానా లు ఏకగ్రీవం కాగా 359 స్థానాలకు 1,002 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఓటర్ల క్యూ..
జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నిక కోసం గురువారం పోలింగ్ జరిగింది. 12,50,166 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించు కోవడానికి వీలుగా 1,432 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్వోలు, పీవో, ఏపీవో, ఓపీవోలు సహా వివిధ స్థాయిల్లో 8,287 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఏ.సిరి పర్య వేక్షణలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకో వడానికి వీలుగా బారికేడ్లు, షామియాలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించారు.
పుంజుకున్న పోలింగ్
ఉదయం తొమ్మిది గంటలకు రెండు గంటల్లోనే 11.25 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తరువాత క్రమంగా పుంజుకొని 11గంటలకు 29.31 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 48.95 శాతం, మూడు గంటలకు 62.34 శాతం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటేశారు. పోలింగ్ ముగిసే సమయానికి 68.23 శాతం అంటే 8.82లక్షల ఓటర్లు తమ ఓటు వేశారు. ఇది పల్లె ఓటర్లలో చైతన్యానికి నిదర్శమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ నెల 1వ తేదీన పట్టణ పోరులో భాగంగా పోలింగ్ జరిగింది. కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీలో ఎన్నికల్లో ఆ చైతన్యం కనిపించలేదు. సగటున 55.28 శాతం ఓటర్లే ఓటేశారు. అందులో సామాన్య జనం నివాసముండే కాలనీల్లో ఓటర్లు పోటెత్తితే.. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు ఉండే కాలనీల్లో 40-45 శాతానికి పోలింగ్ మించలేదు. అదే గ్రామాల్లో ఓటే నా లక్ష్యం అంటూ వయస్సుతో నిమిత్తం లేకుండా కుటుంబ సభ్యులతో వృద్ధులు, చిన్నారులను ఎత్తుకొని తల్లులు, యువత, రైతులు, కూలీలు, మహిళలు అన్నివర్గాల ఓటర్లు తమ పనులను పక్కన పెట్టి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పల్లె ప్రతినిధులుగా పరిషత్తులో ఎవరు ప్రాతినిధ్యం వహించాలి? తమ గ్రామాలను ఎవరు అభివృద్ధి చేస్తారు? అనే అంశాలపై ఆలోచించి ఓటేసినట్లు పలువురు ఓటర్లు ‘ఆంధ్రజ్యోతి’తో వెల్లడించారు.
ఆ ఒక్క సంఘటన మినహా..
చిప్పగిరి మండలం గుమ్మనూరులో వైసీపీ వర్గీయులు, కూటమి బీజేపీ నేత, గుంతకల్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. గుమ్మనూరు, డేగులపాడు గ్రామా లను కలిపి డేగులపాడు ఎంపీటీసీ స్థానం ఏర్పాటు చేశారు. టీడీపీ అభ్యర్థి గోవిందుకు నారాయణ మద్దతు ఇచ్చాడు. వైసీపీ అభ్యర్థిగా లాల్స్వామి పోటీ చేశారు. పోలింగ్ సమయంలో వైసీపీ ఏజెంట్ లోపలికి బయటకు వస్తుండడంతో అలా ఎందుకు వస్తావని బీజేపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ ప్రశ్నించడంతో.. నీకేమి సం బంధం అంటూ వైసీపీ కార్యకర్తలు ఆయనను పోలింగ్ కేంద్రం నుంచి తోసుకుంటూ వచ్చారు. ఆ సమయంలో వారి మధ్య తోలులాట జరగడంతో నారాయణకు చేతికి రక్త గాయాలయ్యాయి. ఇది తెలిసి నారాయణ వర్గీయులు కూడా గొడవకు దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగింది. టీడీపీ, వైసీపీ వర్గీయులు ఆరుగురు గాయపడ్డారు. ఈ ఒక్క సంఘటన మినహా జిల్లా అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఎవరి అంచనాలు వారివి..
ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా స్ట్రాంగ్ రూంలకు చేరింది. పోలింగ్ సరళిపై అంచనాలు మొదలయ్యాయి. గెలుపోటములపై రాజకీయ పార్టీల్లో లెక్కలు వేస్తున్నా రు. ఫలానా గ్రామంలో పోలైన ఓట్లు ఎన్ని? ఆ గ్రామంలో ఏఏ సామాజికవర్గాలకు తమకు అనుకూలంగా ఓటేశారు? ఎక్కడ వ్యతిరేకత కనిపించింది? అంటూ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు విశ్లేషణలో మునిగిపో యారు. పల్లెల్లో కనిపించిన ఓటరు ఉత్సాహం తమకే అనుకూలమని, విజయానికి సంకేతమని అధికార కూటమి పార్టీల నాయకులు అంచనాలు వేస్తున్నారు. గ్రామీణ ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, తమకే కలిసొస్తుందని ప్రతిపక్ష వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తంగా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు ఎవరికి అధికారం కట్టబెడుతుందో? 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.