తల్లడిల్లుతున్నారు
ABN , Publish Date - May 06 , 2026 | 11:51 PM
ఏడు జిల్లాల ఆరోగ్య సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు.
పెద్దాస్పత్రిలో ఉక్కపోతతో రోగులు విలవిల
ఐసీయూలో పని చేయని ఏసీలు
వార్డుల్లో తిరగని ఫ్యాన్లు
అల్లాడిపోతున్న పసికందులు, గర్భిణులు, బాలింతలు
పట్టించుకోని వైద్యులు, అధికారులు
ఏడు జిల్లాల ఆరోగ్య సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. పలు వార్డుల్లో ఫ్యాన్లు, ఏసీలు పని చేయడం లేదు. ఐసీయూ (ఇన్‌టెన్సివ్ కేర్ యూనిట్)లో సెంట్రల్ ఏసీలు, ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు తల్లడిల్లిపోతున్నారు. బాలింతలు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు ఎండవేడిమికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. కొందరు ఇన్‌ఫెక్షన్లుకు గురవుతున్నారు. చిన్న పిల్లల విభాగంలో చాలా వార్డుల్లో ఫ్యాన్లు పని చేయకపోవడంతో పిల్లల బాధలు వర్ణణాతీతం. అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రోగులు, వారి బంధువులు నానా కష్టాలు పడుతూ వైద్య చికిత్సలు పొందుతున్నారు.
కర్నూలు హాస్పిటల్, మే 6 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. నిత్యం వేలాది మంది రోగులతో కిటకిటలాడే కర్నూలు సర్వజన వైద్యశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వార్డుల్లో ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడం లేదు. అధిక వేడి రోగులను మరింత అనారోగ్యం తెప్పిస్తుంది. కర్నూలు జీజీహెచ్‌లో ప్రతి రోజు 3వేల నుంచి 3,500 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఇందులో ప్రతి రోజు 250 నుంచి 300 మంది, 1500 మంది 86 వార్డుల్లో ఆస్పత్రిలో అడ్మిషన్ పొంది చికిత్స తీసుకుంటున్నారు.
గర్భిణులు, బాలింతల అవస్థలు
ఉమ్మడి జిల్లాలో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ప్రసూతి విభాగంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిత్యం 200 మంది గర్బిణులు, బాలింతలు చికిత్స పొందుతుంటారు. ప్రతిరోజు 20 నుంచి 30కాన్పులు జరుగుతుంటాయి. సిజేరియన్ కాన్పులైతే 6 రోజులు, సాధారణ కాన్పు అయితే 3 రోజులు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతుంటారు. నెల రోజుల నుంచి పది పడకల గైనిక్ ఐసీయూ, 12 పడకల గైనిక్ పోస్ట్ ఐసీయూలో ఏసీలు పని చేయడం లేదు. ప్రసూతి విభాగపు వైద్యులు, హాస్పిటల్ అధికా రులు పట్టించుకోపోవడంతో బాలింతలు విలవిలలాడుతున్నారు. నెల రోజులుగా ఏసీలను మరమ్మతులు చేయిం చడంలో అధి కారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇటీవల ఆదోనికి చెందిన ఓబాలింత ఫిర్యాదు చేసినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. కొందరు గైనిక్ పోస్ట్ ఐసీయూలో బాలింతలు సొంతగా ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు.
ఉక్కపోతతో నరకయాతన
చిన్నపిల్లల విభాగంలో అత్యవసర పిల్లలకు 20 పడకలతో పీఐసీ యూను ఏర్పాటు చేశారు. ఈయూనిట్‌లో ఏసీలు, పనిచేయక పోవ డంతో వెంటిలేటర్ మీద ఉన్న చిన్నారులు, అత్యవసర చికిత్స పొందు తున్న చిన్న పిల్లలు ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నారు.
ఆరు నెలలుగా..
సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజి విభాగంలో 6 నెలలుగా అత్యవసర చికిత్స అందించే కార్డియాలజి ఐసీయూ యూనిట్‌లో సెంట్రల్ ఏసీ పని చేయడంలేదు. పది పడకలున్న ఐసీయులో 24 గంటలు కార్డియాలజి వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఏసీలు పని చేయకపోవడంతో ఐసీయులో ఉన్న మానిటర్స్, డిఫ్రిబ్రిలేషన్, వెంటిలేటర్లు తరుచూ మొరాయిస్తున్నాయి. గత 6 నెలలుగా సెంట్రల్ ఏసీ పని చేయడం లేదని ఫిర్యాదు చేసినా ఆసుపత్రి అధికారులు పట్టించుకోవడం లేదు.
సెంట్రల్ ఏసీ పూర్తిగా..
సెంట్రల్ ఏసీ పూర్తిగా పాడైపోయినట్లు వాటర్ లీకేజీతో సెన్సార్ పోయినట్లు తెలుస్తుంది. ఏసీలు పని చేయకపోవడంతో అధికారులు 10 టేబుల్ ఫ్యాన్లు అమర్చి చేతులు దు లుపుకున్నారు. ఇక కార్డియాలజి విభాగంలో 20ఫ్యాన్లు ఉండగా అందులో 3 ఫ్యాన్లు పని చేయడం లేదు. దీంతో అక్కడకూడా రోగులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గైనిక్, చిన్న పిల్లల కార్డియాలజి ఐసీయూ యూనిట్లలో ఏసీల మరమ్మతుల పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నాం. కార్డియాలజీ ఐసీయులోని సెంట్రల్ ఏసీ ఇప్పటి వరకు నాలుగుసార్లు మొరాయించింది. అందుకే అక్కడ కొత్త సెంట్రల్ ఏసీని అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక గైనిక్, డీఆర్‌ఐసీయు యూనిట్లలో ఏసీలు మరమ్మతు పనులను ఏపీఎంఎస్‌ఐడీసీ ఎలక్ర్టికల్ ఇంజనీర్‌కు అప్పగించాం. ఎండాకాలం కావడం వల్ల ఏసీ మెకానిక్‌లు ఎవరూ ముందుకు రావడం లేదు. కొరత తీవ్రతగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుని త్వరలో రోగులకు ఏసీలు, సెంట్రల్ ఏసీలను అందుబాటులోకి తీసుకొస్తాం.
డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, జీజీహెచ్