Share News

రెచ్చగొడుతున్నారు..!

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:31 PM

కర్నూలు నగరంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా జరుగుతోంది. అధికార కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ సహా వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎవరికి వారే ప్రచారంలో నిమగ్నమయ్యారు.

రెచ్చగొడుతున్నారు..!
కర్నూలులో కారు డోరు ఎక్కి టీడీపీ కార్యకర్తలను రెచ్చుగొడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌

కర్నూలు నగరంలో ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం

వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వీడియో వైరల్‌

‘చీల్చిపారేస్తా..’ అంటూ బూతు పురాణం

ప్రజలు ప్రశ్నిస్తే రెచ్చిపోతారా..?

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఆగ్రహం

కర్నూలు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా జరుగుతోంది. అధికార కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ సహా వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఎవరికి వారే ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో శనివారం సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. కర్నూలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ తన కారు డోరు రెక్కి మీసం మెలేస్తూ.. తొడ గొట్టి ఎదుటి వారిని ఛాలెంజ్‌ చేశాడు. అదే క్రమంలో పత్రికల్లో రాయడానికి వీలులేని పదాలతో బూతు పురాణం అందుకున్నారు. ‘రేయ్‌.. చీల్చిపారేస్తా. నా గురించి ఏమనుకుంటున్నారు..’ అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా సాయంత్రం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. నిజంగా టీడీపీ కార్యకర్తలు ఆయనను ఏమైనా అనివుంటే రెచ్చిపోయాడా..? ఉద్దేశపూర్వకంగానే రెచ్చిపోయి మాట్లాడి తన అనుచరులతో వీడియో తీయించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారా..? అన్నది నగరంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

కబ్జాపై ప్రశ్నించినందుకే రెచ్చిపోయాడా..?

వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సోమవారం వడ్డెగేరిలోని కేవీఆర్‌ గార్డెన్‌ ప్రాంతంలో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో గౌరిగోపాల్‌ హాస్పిటల్‌ సమీపంలో వైసీపీహయాంలో కబ్జాకు గురైన ఓ మసీదు స్థలం విషయంపై ఓ వ్యక్తి ప్రశ్నించడం వల్లే సమాధానం చెప్పలేక ఇలా రెచ్చిపోయాడని టీడీపీ వర్గీయులు అంటున్నారు. ఆ వీడియోను క్షుణంగా పరిశీలిస్తే.. మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఎవరినైతే ఉద్దేశించి పరుష పదాలతో దూషిస్తూ ఆవేశంగా రెచ్చిపోయారో..? ఆయనకు ఎదురుగా టీడీపీ నాయకులు గాని, ఆ పార్టీ జెండాలు కాని కనిపించడం లేదు. అంటే.. ఉద్దేశపూర్వకంగా ఈయన ఇలా రెచ్చిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా, వాస్తవాలు విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు.

రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఆరోపణలు

మాజీ ఎమ్మెల్యేపై మంత్రి టీజీ ధ్వజం

కర్నూలు అర్బన్‌ , అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ రాజకీయ లబ్ది కోసం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం నగరంలోని 30, 31, 32 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారానికి వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ను ప్రజలు ప్రశ్నిస్తే తట్టుకోలేక పోయారని, ప్రజలు ప్రశ్నించినందుకు రె చ్చిపోయి టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలిగాని ఇలా రెచ్చిపోవడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రశాతంగా ఉన్న కర్నూల్లో వైసీపీ నేతలు ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

Updated Date - Oct 26 , 2026 | 11:31 PM