కొండనుగుల్ల చేస్తున్నారు
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:43 PM
ఆదోని పట్టణ శివారులోని మండగిరి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది.
ఆదోని శివారులోని మండగిరిలో అక్రమ తవ్వకాలు
పట్టించుకోని అధికారులు
ఆదోని, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణ శివారులోని మండగిరి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జా వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. సర్వే నంబర్ 550లోని కొండను గుల్ల చేస్తూ, విలువైన ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం భూమిని ఆక్రమించడమే కాకుండా కొండలోని గరుసు మట్టిని, రాళ్లను తరలించి సొమ్ము చేసుకుంటున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
‘నైట్ ఆపరేషన్’.. సర్వం సిద్ధం
భూ మాఫియా ఎంచుకున్న వ్యూహం పక్కాగా ఉంటోంది. పగలు తక్కువగా కనిపించేలా ఉంటూ రాత్రి కాగానే ఎక్స్‌కవేటర్, కంప్రెసర్లతో కొండను పిండి చేస్తున్నారు. ఆ తర్వాత బండలను క్రషర్లకు తరలిస్తున్నారు. రాత్రికి రాత్రే రేకుల షెడ్లు వేసి అక్కడ కబ్జాదారుల బోర్డులు లేదా గుర్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. పట్టుబడినప్పుడు ఇది తమ సొంత వసతి కోసం అని అమాయకంగా మాట్లాడుతున్నారు.
అధికారుల హెచ్చరికలు మాత్రమే సరిపోతాయా...?
సమాచారం అందుకున్న వీఆర్వో ఈరన్న సంఘటనా స్థలానికి చేరుకుని పనులను ఆపడం అభినందనీయమే. అయితే కేవలం మందలించి వదిలేయడం వల్ల ఇలాంటి మాఫియాకు భయం లేకుండా పోతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ సంపదలో భాగమైన కొండను ధ్వంసం చేయడం క్రిమినల్ నేరం. ప్రకృతి వనరులను అనుమతి లేకుండా తరలిస్తే మైనింగ్ చట్టం కింద కేసులు నమోదు చేయవలసి ఉంటుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, జరిమానాలు వసూలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
భూ మాఫియా వెనుక ఉన్నది ఎవరు..?
సర్వే నంబర్ 550లోని ఈ భూమి ఆదోని పరిసరాల్లో అత్యంత విలువైనది. భారీ యంత్రాలతో కొండను కొల్లగొడుతోంటే స్థానిక అధికారులకు తెలియకుండాపోవడం వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కొండలు కరిగిపోతున్నాయని, అధికారులు ఇకనైనా నిద్రమత్తు వీడాలని ప్రజలు కోరుతున్నారు. సర్వేనంబర్ 550లో గత కొంతకాలంగా ఎంత విస్తీర్ణంలో అక్రమాలు జరిగాయో రెవెన్యూ అధికారులు సర్వే చేయించాలని, అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన ఎక్సకవేటర్లు, ఇతర యంత్రాలను జప్తు చేయాలని, ఇలాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లేదా నిరంతర నిఘా పెట్టి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటాం
కొండ ప్రాంతాన్ని కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోం. సమాచారం తెలిసిన వెంటనే వీఆర్వోను అక్కడికి పంపించాం. కబ్జా చేసినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- శేషఫణి, తహసీల్దార్, ఆదోని